ఈ రోజుల్లో మనల్ని బాధ పెడుతున్న సమస్యలని ప్రస్తావిస్తూ ఈ సినిమా తీశారు.. ప్రతి ఒక్కరూ చూడండి అని అన్నారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో.. డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న బిన్నమైన కథా చిత్రం ‘1997’. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలోని సింగర్ మంగ్లీ పాడిన ‘ఏమి బతుకు.. ఏమి బతుకు’ అనే సాంగ్‌ను ప్రకాశ్ రాజ్ చూసి.. చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘1997 చిత్రంలోని పాట చూశాను. డాక్టర్ మోహన్ ముఖ్య పాత్రలో నటించడమే కాకుండా ఆయన డైరెక్ట్ చేసిన ఈ చిత్రం నిజ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కినట్లుగా చెప్పారు. పాట వినగానే.. కథ గురించి తెలుసుకున్నాను. ఈ రోజుల్లో మనల్ని బాధ పెడుతున్న సమస్యలపైనే ఈ సినిమా తీశారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిది. నిజంగా ఇలాంటి మంచి ప్రయత్నం చేసిన మోహన్ అండ్ టీమ్‌ని అభినందిస్తున్నాను. అలాగే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుతున్నాను..’’ అని అన్నారు.