Abn logo
Feb 14 2020 @ 20:39PM

కాంగ్రెస్ ఉన్నట్టుండి మాయం కావడంతోనే ఓటమి : ప్రకాశ్ జవదేకర్

న్యూఢిల్లీ : ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవంపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యుద్ధభూమిలో కాంగ్రెస్ ఉన్నట్టుండి మాయం కావడంతోనే బీజేపీ ఓడిపోయిందని ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ యుద్ధ భూమిలో లేకపోవడంతో ఆమ్‌ఆద్మీ, బీజేపీ నేరుగా తలపడ్డాయని, అందుకే ఓడిపోయామని అన్నారు. ‘‘యుద్ధ భూమిలో కాంగ్రెస్ ఉన్నట్టుండి కనిపించక పోవడంతోనే ఓడిపోయాం. కాంగ్రెస్ సొంతంగానే ఇలా చేసిందా? లేదా ప్రజలే అలా చేశారా? లేదా కాంగ్రెస్ ఓట్లు ఆప్‌కు మళ్లాయా? అన్నది వేరు విషయం’’ అని కుండబద్దలు కొట్టారు.


లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 26 శాతం ఓట్లను సాధిస్తే, ఢిల్లీ అసెంబ్లీ నాటికి కేవలం 4 శాతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. తమకు 42 శాతం నుంచి 48 శాతం వరకు ఓట్లు వస్తాయని భావించామని తెలిపారు. అయితే తామనుకున్న దానికంటే మూడు శాతం మాత్రమే ఓట్లు తగ్గాయని, తమకు ఎన్నికల్లో 39 శాతం ఓట్లు వచ్చాయని, ఆప్‌కు 51 శాతం వచ్చాయని జవదేకర్ విశ్లేషించారు. ఎన్నికల్లో విజయాలనేవి ఎత్తు పల్లాల్లాంటివని, గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ను తాను ఎప్పుడూ తీవ్రవాది అని అనలేదని జవదేకర్ స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement
Advertisement