మద్యంపై మహిళల కన్నెర్ర

ABN , First Publish Date - 2020-07-08T21:42:02+05:30 IST

రోనా భయం ఒకపక్క వెంటాడుతున్నా పట్టించుకోకుండా ఇష్టారీతిన మద్యం..

మద్యంపై మహిళల కన్నెర్ర

కరోనా కాలంలో అమ్మకాలపై మండిపాటు 

రెడ్‌జోన్ల నుంచి మందుబాబుల రాకపై బొద్దికూరపాడులో ఆందోళన

దురుసుగా ప్రవర్తించిన సిబ్బందిపై ఆగ్రహం


తాళ్లూరు(ప్రకాశం): కరోనా భయం ఒకపక్క వెంటాడుతున్నా పట్టించుకోకుండా ఇష్టారీతిన మద్యం అమ్మకాలపై మహిళలు కన్నెర్ర చేశారు. తమ పరిసర గ్రామాల్లో కరోనా కేసులు అధికంగా ఉన్నాయని, రెడ్‌జోన్లుగా ప్రకటించి మద్యం దుకాణాలను మూసివేయటంతో వందలాది మంది గ్రామ మద్యం దుకాణం వద్దకు వస్తున్నందున తమకు ప్రమాదం పొంచి వుందని భయాందోళన చెందిన బొద్దికూరపాడుకి చెందిన మహిళలు ఆందోళనకు దిగారు.


గ్రామంలో మహిళలు రాజకీయాలు, పార్టీలకతీతంగా నడుం బిగించి కదం తొక్కారు. మంగళవారం ఉదయం షాపు తెరవగానే మహిళలు ప్రభుత్వ మద్యం షాపు వద్దకు వెళ్లి షాపు మూసివేయాలని కోరారు. షాపు నిర్వహకులు మాత్రం ఇది ప్రభుత్వ దుకాణమని, ఉన్నతాధికారుల అనుమతి ఉంటే తప్ప తాము మూసివేయబోమంటూ వారిపట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో మహిళల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. దుకాణం తెరవద్దంటూ అడ్డుగా కంప వేశారు. అక్కడే ధర్నా చేపట్టారు. దుకాణ ప్రాంగణంలో ఉన్న అట్టపెట్టెలను, కంపను షాపు ముందే తగులబెట్టారు.


మందుబాబుల కారణంగా మహిళలకు భద్రత కొరవడుతున్నదన్నారు. రెడ్‌జోన్లుగా ఉన్న తూర్పుగంగవరం, నాగంబొట్లపాలెం, దర్శి, మర్రిచెట్లపాలెం, పొదిలి పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో జనం షాపు వద్దకు వస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భౌతికదూరం పాటించకుండా గంటలసేపు బారులు తీరి కొనుగోలు చేయటం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందేమోనని భయంగా ఉందన్నారు. గ్రామంలో మద్యం దుకాణం తొలగించాని, కనీసం తగ్గుముఖం పట్టేవరకైనా మూసివేయాల్సిందేనని నినాదాలు చేశారు. కార్యక్రమంలో 400మందికి పైగా మహిళలు, పురుషులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-08T21:42:02+05:30 IST