కలెక్టర్‌గా చాన్సిస్తా.. రండి!
ABN , First Publish Date - 2020-07-14T07:47:53+05:30 IST
‘సార్..కొవిడ్ కట్టడి చర్యలతో మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. కొంత సడలింపులను ఇవ్వండి’ అని కోరిన వ్యాపారులకు ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఏకంగా
- ఒక్కరోజు పనిచేసి చూపించండి.. కొవిడ్‌పై చర్యలు సినిమా కాదు
- వ్యాపారులతో ప్రకాశం కలెక్టర్.. ‘ఒకే ఒక్కడు’ని తలపించిన తీరు
ఒంగోలు కలెక్టరేట్, జూలై 13: ‘సార్..కొవిడ్ కట్టడి చర్యలతో మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. కొంత సడలింపులను ఇవ్వండి’ అని కోరిన వ్యాపారులకు ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఏకంగా ‘సినిమా’ చూపించారు. ‘ఎవరికైనా ఆసక్తి ఉంటే రండి. నా కన్నా బాగా పని చేయగలమని మీరు అనుకొంటే.. ఒకరోజు కలెక్టర్‌గా పనిచేయడానికి అవకాశమిస్తాను. మీరేం చేస్తారో చూద్దాం’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఒకే ఒక్కడు’ సినిమాను తలపించేలా ఆయన వ్యాఖ్యలు ఉండటంతో వ్యాపారులు ఖిన్నులయ్యారు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో కరోనా ఆంక్షలు ఎత్తి వేయాలని వ్యాపారులు కొంతకాలంగా కోరుతున్నారు. సోమవారం పలువురు వ్యాపారులతో కలెక్టర్ పోలా భాస్కర్ ఈ సమస్యపై చర్చించారు. ఈ సందర్భంగా ఓ వ్యాపారి కొవిడ్ కట్టడి చర్యల కారణంగా తాము పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్ ప్రతిస్పందిస్తూ...ఇది సినిమా కాదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా తాను ముందుకు వెళ్లాల్సి ఉందని వ్యాఖ్యానించారు.