Abn logo
May 13 2021 @ 13:31PM

జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించాలి: సుబ్బారావు

ప్రకాశం: రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరిని ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్‌లో పలు మీడియా సంస్థలు దెబ్బతినడంతో పాటు 60 మంది వరకూ జర్నలిస్టులు అశువులు బాశారన్నారు. ఏపీలో కొవిడ్ ఆస్పత్రులలో పడకలు, ఆక్సిజన్ కొరతతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతీరోజు కరోనాపై సీఎం జగన్, మంత్రులు, అధికారులు సమీక్షలు జరుపుతున్నారు కానీ జర్నలిస్టుల గురించి ఆలోచించక పోవటం బాధాకరమన్నారు. కరోనా మొదటి వేవ్‌లో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చినా పూర్తిస్థాయిలో అమలు కాలేదని చెప్పారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధంగా జర్నలిస్టులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులకు రూ.20 వేల ఆర్థిక సాయం ప్రకటించాలన్నారు. పలువురు జర్నలిస్టులు మృతి చెందినప్పుడు కంటితుడుపు ప్రకటనలతోనే సరిపెడుతున్నారని విమర్శించారు. కరోనాతో జర్నలిస్టులు ఇబ్బందులు పడుతుంటే సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఇంత వరకు స్పందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకునైనా జర్నలిస్టులకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించకుంటే కరోనా నిబంధనలకు అనుగుణంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని సుబ్బారావు హెచ్చరించారు. 

Advertisement