రేషన్‌ రాకెట్‌

ABN , First Publish Date - 2020-09-26T20:52:13+05:30 IST

రేషన్‌ రాకెట్‌

రేషన్‌ రాకెట్‌

జిల్లా కేంద్రంగా రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలు, రవాణా

నిన్న ఎర్రగొండపాలెం టూ రాయలసీమ

నేడు మార్టూరు నుంచి బంగ్లాదేశ్‌

మూలనపడిన రైస్‌ మిల్లులను అద్దెకు తీసుకొని భారీ నిల్వలు 

వైసీపీ నేతల ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యం 

వలపర్లలో మిల్లుపై  దాడితో వెలుగులోకి

అన్ని ప్రాంతాల్లోనూ భారీగా పట్టుబడిన బియ్యం 


రేషన్‌ బియ్యం గుట్టురట్టవుతోంది. అక్రమ నిల్వలు, రవాణాకు జిల్లా కేంద్రంగా మారిందన్న విషయం మరోసారి స్పష్టమైంది. వీటిని కొన్ని ప్రాంతాల నుంచి చెన్నైకి తరలించి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తుండడం చూస్తే ఈ రాకెట్‌ ఏ స్థాయిలో సాగుతుందో అర్థమవుతోంది. ఈ అక్రమ వ్యాపారంలో కీలకపాత్ర పోషించేవారందరికీ అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న విషయం కూడా తేటతెల్లమవుతోంది. ఏళ్లుగా మూలనపడిన రైస్‌ మిల్లులను అద్దెకు తీసుకుని ఈ అక్రమ వ్యాపారానికి కొందరు తెర తీశారు. శుక్రవారం మార్టూరు మండలం వలపర్లలో పట్టుబడిన భారీ బియ్యం అక్రమ నిల్వల వ్యవహారంలో దొరికిన సమాచారంతో పోలీసులు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దీంతో అధికారపార్టీ నేతల్లో  అలజడి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు, విజిలెన్స్‌, పౌరసరఫరాల శాఖ అధికారులు నిక్కచ్ఛిగా వ్యవహరిస్తే ఈ రాకెట్‌లో తెరవెనుక ఉన్న నేతల పేర్లు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. 


ఆంధ్రజ్యోతి, ఒంగోలు 

జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఏడాదిగా కొందరు దీ న్ని వ్యాపారంగా మార్చుకున్నారు. లారీలకు లారీలను ఎల్లలు దాటిస్తున్నారు. అక్కడి నుంచి ఇతర దేశాలకు తరలిస్తున్నారు. నెలకు రూ.కోట్లు కూడబెట్టుకుంటున్నారు. శుక్రవారం ఇంకొల్లు సీఐ అల్తాఫ్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో మార్టూరు మండలం వలపర్లలోని ఓ రైసు మిల్లుపై నిర్వహించిన దాడుల్లో భారీ అక్రమ నిల్వలు పట్టుబడటం ద్వారా ఈ వ్యవహారం ఏ స్థాయిలో నడుస్తుందో తేటతెల్లమవుతోంది. ఉలిక్కిపడిన అధికారపార్టీ నేతలు పోలీసు, పౌరసరఫరాలశాఖ అధికారులపై ఒత్తిడి పెంచారు. 


అవాక్కయ్యే నిజాలు వెలుగులోకి.. 

వలపర్లలోని రైసు మిల్లులో భారీగా బియ్యం పట్టుబడిన వెంటనే పోలీసులు దానిపై లోతైన వి చారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా అవా క్కయ్యే నిజాలు బయటపడ్డాయి. బియ్యం చెన్నై ఓడరేవుకు తరలిస్తున్నట్లు తేలింది. అక్కడి నుంచి బంగ్లాదేశ్‌కు రవాణా అవుతున్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.  జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు, గుంటూరు జి ల్లా బాపట్ల, పశ్ఛిమ గోదావరి జిల్లా ఏలూరు, తెలంగాణ  రాష్ట్రం నుంచి కూడా అక్కడికి బియ్యం రవాణా జరిగినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆ రైస్‌మిల్లు కొన్ని సంవత్సరాల క్రితమే మూతపడింది. అద్దంకికి చెందిన సురేంద్ర అనే వ్యక్తి కొద్ది నెల ల క్రితం దాన్ని లీజుకి తీసుకున్నాడు. ఆయన ఒంగోలు, పర్చూరు నియోజకవర్గాలకు చెందిన మరికొందరి తోడ్పాటుతో ఆ రైస్‌మిల్లుని అక్రమ నిల్వలకు  కేంద్రంగా మార్చాడు. అ క్కడి నుంచి చెన్నై పోర్టు ద్వారా విదేశాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఎర్రగొండపాలెంలో భారీగా అక్రమ నిల్వలు బయటపడ్డాయి. అక్కడి నుంచి బియ్యాన్ని రాయల సీమ జిల్లాలకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది.  


అధికార పార్టీ నాయకులే కీలక పాత్ర 

వలపర్ల వద్ద రైసు మిల్లులో దాడుల సందర్భం గా వెల్లడైన సమాచారం మేరకు పోలీసులు శుక్రవా రం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ జిల్లావ్యాప్తంగా రైసు మిల్లులపై దాడులు నిర్వహించారు. అనేక చోట్ల రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలు బయటపడ్డాయి. వీటిలో అత్యధిక మిల్లుల నిర్వహణలో ఇటు ప్రత్యక్షంగా, అటు పరోక్షంగా అధికారపార్టీ నాయకులే కీలకంగా ఉన్నట్లు సమాచారం. ఆరంభంలో ఎక్కడికక్కడ తనిఖీ చేసిన వెంటనే సమాచారం ఇస్తున్న పోలీసులు ఒక్కసారిగా సమాచారాన్ని ఇవ్వటం నిలిపివేశారు. అంతా రేపు చెపుతాం అంటూ  మీడియాకు స్పష్టం చేశారు.  దీంతో ఈ బాగోతంలో ఎవరిపాత్ర ఎంత? అసలేమి జరుగుతుంది? అన్న విషయంలో ఎంత వరకు నిజాలు బయటకు వస్తాయనేది వేచి చూడాల్సి ఉంది. 


మండలానికి  ఒక ప్రతినిధి

రేషన్‌ బియ్యం అక్రమార్కులు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి ఒక ప్రతినిధిని, వారికింద మండలానికి ఒక ప్రతినిధిని ఏర్పాటు చేసుకొని ప్రతి చౌక ధరల దుకాణం నుంచి బియ్యాన్ని అక్రమంగా దారిమళ్లిస్తున్నట్లు సమాచారం. వీరిలో 90శాతం మంది అధికార పార్టీ మద్ధతు ఉన్న వారని తెలుస్తోంది. కొందరైతే  ఆరేడు నెలల క్రితం హడావుడిగా అధికారపార్టీ కండువా కప్పించుకుని రం గంలోకి వచ్చి ఈ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారని చెప్తున్నారు. వీరికి కాస్తంత పైస్థాయిలో ఉన్న అధికారపార్టీ నాయకులతోడు కూడా లభిస్తున్నట్లు తెలిసింది.  


Updated Date - 2020-09-26T20:52:13+05:30 IST