వరికి ‘కత్తెర’

ABN , First Publish Date - 2020-09-26T20:48:17+05:30 IST

వరికి ‘కత్తెర’

వరికి ‘కత్తెర’

ఉధృతంగా వ్యాపించిన పురుగు

రాత్రికి రాత్రే పైరును అమాంతం తినేస్తున్న వైనం 

ఆందోళనలో  రైతులు 


పీసీపల్లి: ఈ ఏడాది ముందుగానే వర్షాలు పడటంతో రైతులు వరి నాట్లు వేశారు. వరి నాటి నెల సమయం కూడా కాకముందే పైరుకు కత్తెర పురుగు ఆశించింది. పచ్చగా పెరుగుతున్న పైరును కత్తెర పురుగు చిదిమేస్తోంది. మిషన్‌తో కత్తిరించినట్లు పైరును నాశనం చేస్తోంది. దీని నివారణకు ఎన్ని రకాల రసాయనిక పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. గత ఏడాది జొన్న పంటను ఆశించి దెబ్బతీసిన పురుగు, ఈ ఏడాది వరి రైతులను తీవ్రంగా నష్టపరుస్తోంది. 

మండలంలో గుంటుపల్లి, అడవిలోపల్లి, లక్ష్మక్కపల్లి తురకపల్లి, వెంగళాయపల్లి, వేపగుంపల్లి, పెద్దన్నపల్లి, తలకొండపాడు, నేరేడుపల్లి, మురిగమ్మి అయ్యవారిపల్లి గ్రామాల్లో సుమారు 200 ఎకరాలకు పైగా వరి సాగు చేశారు. నాటినప్పటి నుంచి 15 రోజుల వరకు బాగా పైరు ఎదిగింది.  వాతావరణం మార్పులకు తోడు చిలక వైరస్‌ కూడా పైరును ఆశించింది. ఆ చిలక గుడ్లుపెట్టి అది కత్తెర పురుగుగా మారింది. ఈ కత్తెర పురుగు కాండం నుంచి తొలుస్తూ ఆకులకు చేరి ఆకును కత్తెరించి తింటుంది. పగటి పూట పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో మువ్వలో ఉంటున్న పురుగు రాత్రివేళల్లో పైరు పైకి చేరి ఆకులను కత్తిరిస్తుంటుంది. కాండం, మువ్వలను తొలుస్తుండటంతో పైరు కుచించుకుపోయి ఎండిపోతుంది. ఏటా వరి నాటినప్పటి నుంచి కోతకొచ్చేవరకు 2 లేదా మూడుసార్లు రసాయన మందులు పిచికారీ చేస్తే సరిపోయేది. ఈ ఏడాది పైరు నాటి నెలకూడా కాకముందే కత్తెర పురుగు ఉధృతమవడంతో ఇప్పటివరకు రైతులు 5 నుంచి 6 సార్లు పురుగు మందులు పిచికారీ చేయాల్సి వస్తుంది. రైతులకు పెట్టుబడులు అఽధికమై నష్టం చేస్తుంది వ్యవసాయ శాఖ అధికారుల సూచించిన మందులు వాడినా ఈ కత్తెర పురుగు నియంత్రణలోకి రావడం లేదు. వరి రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది ఈ పురుగు కాస్త అదుపు కాకపోతే గింజకూడా ఇంటికి తెచ్చుకోలేమంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు పైరును పరిశీలించి సూచనలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.


Updated Date - 2020-09-26T20:48:17+05:30 IST