యూట్యూబ్ నుంచి ఐరాసకు...

ABN , First Publish Date - 2020-10-11T16:12:24+05:30 IST

యూట్యూబ్‌లో ఛానెళ్లు పెట్టిన వాళ్లు లక్షల్లో ఉంటారు. కానీ ఒక ఛానెల్‌ ద్వారా అంతర్జాతీయ స్థాయికి చేరిన వారు చాలా అరుదు. అలాంటి...

యూట్యూబ్ నుంచి ఐరాసకు...

యూట్యూబ్‌లో ఛానెళ్లు పెట్టిన వాళ్లు లక్షల్లో ఉంటారు. కానీ ఒక ఛానెల్‌ ద్వారా అంతర్జాతీయ స్థాయికి చేరిన వారు చాలా అరుదు. అలాంటి అరుదైన వ్యక్తి ‘ప్రజక్తా కోలి’. ముంబైకి చెందిన ఈ అమ్మాయి రేడియో జాకీగా కెరీర్‌ ను మొదలుపెట్టి... ఇప్పుడు దేశంలో ప్రముఖ యూట్యూబర్‌ గా, సామాజిక వేత్తగా ఎదిగింది...

 

పుట్టింది... పెరిగింది...

ప్రజక్తా సొంతూరు ముంబై. చదువయ్యాక రేడియో జాకీగా మారింది. కానీ ఆ ఉద్యోగం అంతగా నచ్చలేదు. ఏదో చేయాలన్న తపన ఉండేది. 2015లో ‘మోస్ట్లీసాన్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ మొదలుపెట్టింది. 


ఆమె ఛానెల్‌ ప్రత్యేకత...

రోజువారీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను వినోదాత్మకంగా చిన్న నాటికల రూపంలో నటించి చూపిస్తుంది ప్రజక్తా. కన్నీళ్లను తెచ్చే పరిస్థితులను కూడా కామెడీగా మార్చి చూపిస్తుంది. 


యాభై ఐదు లక్షల మంది..

2015లో ఛానెల్‌ పెట్టాక మొదటి మూడునెలల కేవలం మూడు వేల మందే సబ్‌ స్కైబ్ర్‌ చేశారు. ఆ తరువాత ‘ఢిల్లీ ప్రజల పది కష్టాలు’పేరుతో ఓ చిన్న నాటిక రూపొందించింది. ఆ నాటిక అప్‌ లోడ్‌ చేశాక ముప్పై వేల మంది సబ్‌ స్క్రయిబ్‌ చేశారు. అక్కణ్నించి సబ్‌స్ర్కిప్షన్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆమె ఛానెల్‌ ను ఫాలో అవుతున్న వారు యాభై అయిదు లక్షల మంది. 


టాప్‌ యూట్యూబర్‌

ఇన్‌స్టాగ్రామ్‌ లో ఆమెకు పాతిక లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.‘ప్రజక్తా ఫ్యాన్‌ క్లబ్‌’లు ఇన్‌ స్టాగ్రామ్‌ 51 దాకా ఉన్నాయి. మనదేశంలో టాప్‌ మహిళా యూట్యూబర్‌గా పేరు తెచ్చుకుంది ప్రజక్తా.


సామాజిక వేత్తగా...

యూట్యూబర్‌ గా పాపులర్‌ అయ్యాక సామాజికవేత్తగానూ మారింది. వాట్సాప్‌ లో ఫేక్‌ న్యూస్‌ షేరింగ్‌ ఆపాలంటూ ప్రకటనల్లో కనిపించింది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన ‘ఐ ప్లెడ్జ్‌ టు బి మీ’ పేరుతో ప్రచారం మొదలుపెట్టింది. ఆడపిల్లల చదువుపై ‘గర్ల్స్‌ కౌంట్‌’ పేరుతో మరో క్యాంపెయిన్‌ నిర్వహించింది. ‘నేషనల్‌ టోలెరెన్స్‌ డే’ సందర్భంగా గతేడాది న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొంది. 


మరోసారి ఐరాసలో భాగం

కరోనాకు సంబంధించి కేవలం నమ్మకమైన సమాచారాన్నే షేర్‌ చేయాలన్న అంశంపై ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది మేలో ‘వెరిఫైడ్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో వెబినార్‌ ద్వారా పాల్గొనే అవకాశం ప్రజక్తాకు దక్కింది. 


మిసెస్‌ ఒబామాతో

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్‌ ఒబామాతో అమ్మాయిల చదువుపై అనేక అంశాలు చర్చించే అవకాశాన్ని దక్కించుకుంది. మరో ఇద్దరు విదేశీ యూట్యూబర్లతో కలిసి మిషెల్‌ ను ఇంటర్వూ చేసింది. 


నాన్న, చెల్లి సాయం...

‘‘నా వయసు ఇరవైఏడయినా... ఇన్వెస్ట్‌ మెంట్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటి ఆర్ధికపరమైన విషయాలు అర్థం కావు. అందుకే నా సంపాదనను ఏం చేయాలో నాన్న, చెల్లి ఆలోచిస్తారు. ఏదైనా అందరం  చర్చించే నిర్ణయం తీసుకుంటాం...’’ 


బెస్ట్‌ ఫ్రెండ్‌

‘‘మిథిలా పాల్కర్‌. మా ఇద్దరిదీ ఒకే వయసు. తను నటి. నెట్‌ ఫ్లిక్స్‌లోని సినిమాల్లో ఎక్కువగా నటిస్తుంది.  ఇద్దరం కలిస్తే టైమే తెలియదు. గంటలు సెకన్లలా  గడిచిపోతాయి...’’.

Updated Date - 2020-10-11T16:12:24+05:30 IST