ప్రజా విశ్వాసం కోల్పోయిన టీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2020-12-06T04:54:11+05:30 IST

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలనపట్ల ప్రజల్లో సన్నగిల్లిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆ పార్టీ ఆరేళ్లపాలనపై ప్రజలలో వ్యతిరేకత పెరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

ప్రజా విశ్వాసం కోల్పోయిన టీఆర్‌ఎస్‌
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం

ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయింది

కాంగ్రెస్‌ను బలహీనపరచడంతో బీజేపీ బలపడింది

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం


ఖమ్మం, డిసెంబరు 5(ప్రతినిధి): రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలనపట్ల ప్రజల్లో సన్నగిల్లిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆ పార్టీ ఆరేళ్లపాలనపై ప్రజలలో వ్యతిరేకత పెరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను బలహీనపరచడం వల్ల బీజేపీ బలపడి దుబ్బాకతోపాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించగలిగిందని తమ్మినేని అభిప్రాయపడ్డారు. ఖమ్మంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు బీజేపీ గెలవడం వల్ల వార్నింగ్‌ బెల్‌ మోగించిందని, అది గమనించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీజేపీతో లోపాయికారిగా స్నేహబంధం కొనసాగించి, లాలూచీ రాజకీయాలు నడిపించారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ చేసే చట్టాలను సమర్శించిన టీఆర్‌ఎస్‌ ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీటుకు ఎసరు రావడంతో బీజేపీని వ్యతిరేకిచాలని చెబుతోందన్నారు. బీజేపీతో స్నేహంచేసిన ప్రాంతీయ పార్టీలన్నింటికి దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఎదురైందని తమ్మినేని వివరించారు. ఆంధ్రాలో టీడీపీ, పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జి. ఒడిస్సాలో బీజూజనతాదల్‌, యూపీలో బీఎస్పీ బీజేపీతో పొత్తుకట్టి  దెబ్బతిన్నాయన్నారు. ఇప్పుడు ఏపీలో అధికార విపక్ష పార్టీలు బీజేపీ ప్రాపకం కోసం ఆరాటపడుతున్నాయని విమర్శించారు. హిందుత్వ పార్టీగా చెప్పుకుంటూ ఉన్మాద పార్టీలా వ్యవహరిస్తోందని ఆయన వివరించారు. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ ఇప్పుడు ప్రయత్నిస్తుండడంతో   టీఆర్‌ఎస్‌ ఆ పార్టీపై వ్యతిరేకత చూపుతోందన్నారు. నిరుద్యోగులకు భృతి, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల హామీతోపాటు ప్రజలపై ఎల్‌ఆర్‌ఎస్‌భారం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, బీజేపీకి కలిసివచ్చాయని వివరించారు. పోడుభూములు సాగుచేస్తున్న వారిపై దాడులు, ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వకపోవడం, ఖాళీ ఉద్యోగాలను భర్తీచేయకపోవడం, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల అవినీతి తదితర కారణాలతో బీజేపీ జీహెచ్‌ఎంసీలో విజయం సాధించిందని వివరించారు. ఇప్పటికైనా లౌకికతత్వానికి విఘాతం కలిగించే పార్టీకి వ్యతిరేకంగా లౌకిక పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు టీఆర్‌ఎస్‌ కూడా ముందుండాలని సూచించారు అలాకాకుండా భవిష్యత్‌లో లౌకిక కూటమి పార్టీల పొత్తుల పేరుతో ఎన్నికల సందర్భంగా ఐక్యంగా పోటీచేసిన ప్రజలు విశ్వసించరన్నారు. ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా తమ పొత్తుల విషయం వెల్లడిస్తామని ప్రకటించారు.  

8న భారత్‌బంద్‌ను జయప్రదం చేయండి 

దేశవ్యాప్తంగా 8వ తేదీన కేంద్ర వ్యవసాయబిల్లులకు వ్యతిరేకంగా జరిగే భారతబంద్‌కు ప్రజలు సహకరించాలని, రైతులు, రైతుసంఘాలు, రాజకీయపక్షాలు బంద్‌లో పాల్గొనాలని తమ్మినేని కోరారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటికే పంజాబ్‌, హర్యాన, యూపీ తదితర రాష్ట్రాలనుంచి రైతులు పోరాటం సాగిస్తున్నారని, జాతీయ రహదారులను సైతం కదంకాలు తవ్వి రాకపోకలు నిలిపివేస్తున్నారని, వివరించారు. 8న జరిగే భారత్‌బంద్‌లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ కూడా కలిసివచ్చి బంద్‌లో ముందుండాలని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని తెలిపారు. విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-06T04:54:11+05:30 IST