బడుగు జనుల గొంతుక ‘ప్రజా అసెంబ్లీ’

ABN , First Publish Date - 2020-09-04T16:42:16+05:30 IST

ప్రజల ఓట్లతో చట్టసభలకు ఎన్నిక అవుతున్నవారు తాము ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళం అనే విషయాన్ని ఎన్నికైన తక్షణమే మరచిపోతున్నారు.

బడుగు జనుల గొంతుక ‘ప్రజా అసెంబ్లీ’

ప్రజల ఓట్లతో చట్టసభలకు ఎన్నిక అవుతున్నవారు తాము ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళం అనే విషయాన్ని ఎన్నికైన తక్షణమే మరచిపోతున్నారు. తమ పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కరించడం కంటే, స్వప్రయోజనాలు, తమ అనుంగు అనుచరుల అవసరాలకే ప్రాధాన్యమిస్తున్నారు.



తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పని చేస్తున్న 13 ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు ఒక్క వేదిక మీదకు వచ్చి, బడుగువర్గాల గొంతు వినిపించే లక్ష్యంతో ‘తెలంగాణ ప్రజా అసెంబ్లీ’ని నిర్వహిస్తున్నాయి. సెప్టెంబర్ 4 నుంచి 7వ తేదీ వరకూ ఈ ప్రజా అసెంబ్లీ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. వ్యవసాయం, విద్యా, వైద్య రంగాలు; భూమి, నీరు, అడవులు, విత్తనాలు వంటి సహజ వనరులపై హక్కులు; ఆదివాసీల, అసంఘటిత కార్మికుల, నిర్వాసితుల, మత మైనారిటీల, మహిళల సమస్యలు; ప్రభుత్వ సంస్థల పనితీరుపై ఈ సమావేశాలలో చర్చలు జరుగుతాయి.


రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన చట్ట సభలలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలపై సమగ్ర చర్చ జరగాలి; ప్రజలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలకు శాస్త్రీయమైన పరిష్కారాలు కనుక్కోవాలి; ఆ పరిష్కారాల అమలుకు ప్రభుత్వం నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలి; ఆ కార్యాచరణకు ఒక స్పష్టమైన కాలపరిమితి ఉండాలి; మరీ ముఖ్యంగా బడ్జెట్‌లో తగిన కేటాయింపులు జరపాలి- ఇదీ, మనం ఎన్నుకున్న చట్ట సభల నుంచి మనం సహజంగా ఆశిస్తున్నది. ఇదే పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియ అని చాలా కాలంగా చెప్పుకుంటున్నాం.


మరి మన చట్ట సభలు ఈ స్ఫూర్తితోనే నడుస్తున్నాయా? లేదు, అవి ఆ స్ఫూర్తిని కోల్పోయాయి. చట్టసభల సమావేశాలు జరిగే రోజులు క్రమంగా తగ్గిపోతున్నాయి. సమావేశాలు జరిగిన రోజుల్లో పనిగంటలూ తగ్గిపోతున్నాయి. చర్చ కంటే రచ్చ ఎక్కువ జరుగుతున్నది. ప్రజల నిజమైన సమస్యలపై చర్చల కంటే పరస్పర రాజకీయ విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. సమస్యలకు సరైన పరిష్కారాలు వెతకడం కంటే, ఎదుటి వారి నోరు మూయించే ప్రయత్నం ఎక్కువ జరుగుతున్నది.


తెలంగాణలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఎన్నికల ప్రణాళికను అమలు చేయడం మానేసి తనకు తోచిన విధంగా పథకాలు, ప్రాజెక్టులను రీ డిజైన్ చేస్తూ, ఏకపక్షంగా అమలు చేస్తున్నది. ఈ క్రమంలో ప్రజల నిజమైన సమస్యలు, అవసరాలు పక్కకు పోతున్నాయి. ప్రభుత్వం తనకు తోచిన స్కీములను ప్రకటిస్తున్నది. వీటిలో ప్రజల సమస్యలు పరిష్కారం కావాలనే లక్ష్యం కంటే వచ్చే ఎన్నికలలో మరిన్ని ఎక్కువ ఓట్లు రాబట్టాలనే యావ మాత్రమే కనిపిస్తున్నది. ప్రజల సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కంటే, పార్టీ తక్షణ ప్రయోజనాలే అగ్ర ప్రాధాన్యం పొందుతున్నాయి. సమాజంలోని ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన జీవితాన్ని జీవించేందుకు తగు అవకాశాలు కల్పించడం కంటే, ఎప్పటికీ పాలకుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే యాచకులుగా అత్యధికులను మార్చే లేదా ఉంచివేసే ప్రయత్నం కొనసాగుతున్నది. పైగా బడ్జెట్ పరిమితులను పట్టించుకోవడం లేదు. అలాగే పర్యావరణ పరిమితులను అర్థం చేసుకుని సముచిత నిర్ణయాలు తీసుకునే శ్రద్ధ అసలే కన్పించడం లేదు. ఫలితంగా కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకు పోతున్నది.


ప్రజలకు, ప్రజా సంఘాలకు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు గొంతు లేకుండా చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది. బ్యూరోక్రసీని, పోలీసు వ్యవస్థను విచ్చలవిడిగా వినియోగిస్తూ పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తున్నది. ప్రతిపక్ష పార్టీలకు చట్ట సభలలో ప్రాతినిధ్యం లేకుండా చేయడం, ప్రశ్నించిన వాళ్ళను జైళ్లకు పంపడం, బహిరంగ సమావేశాల మీద కూడా ఆంక్షలు పెట్టడం, ప్రజలకోసం మాట్లాడుతున్నవాళ్ళపై నిరంతర నిఘా పెట్టడం నిత్యకృత్యమై పోయింది. ప్రజల ఆలోచనా శక్తిని అణచివేసేందుకు వారిని మద్యం మత్తులో ఉంచుతున్నది. మూఢనమ్మకాల రొంపిలో దింపుతున్నది. కొవిడ్ విపత్తు వేళ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయాన్ని కూల్చివేశారు. ప్రజల దరఖాస్తులకు జవాబు చెప్పేవారు లేరు. విన్నపాలను వినరు. పాలనా వ్యవస్థలో అన్ని స్థాయిలలో అవినీతి పరాకాష్టకు చేరుకున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే- ప్రజలకు రాష్ట్రంలో ఏ రకమైన ప్రజాస్వామిక పాలన కనిపించడం లేదు.


ప్రజల ఓట్లతో చట్టసభలకు ఎన్నిక అవుతున్న పెద్ద మనుషులు కూడా తాము ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళం అనే విషయాన్ని ఎన్నికైన తక్షణమే మరచిపోతున్నారు. తమ పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కరించడం కంటే, తమ స్వప్రయోజనాలు, తమ అనుంగు అనుచరుల అవసరాలకే ప్రాధాన్యమిస్తున్నారు. అవే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. శాసనసభ్యులుగా వారి ప్రతి పనిలోనూ ఈ వాస్తవమే ద్యోతకమవుతున్నది. స్థానిక ప్రజా సమూహాలతో చర్చించి, వాళ్ళ అవసరాలను తెలుసుకునేందుకు కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. ప్రజా శ్రేయస్సు పట్ల ఉపేక్ష మెజారిటీ ‘ప్రజా ప్రతినిధుల’లో స్పష్టంగా కన్పిస్తున్నది. ప్రజలను మద్యం మత్తులో ముంచడంతో పాటు కుల, మత అంతరాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. అలవికాని హామీలు ఇచ్చి, ప్రతి ఓటుకూ ధర నిర్ణయించి కొనుక్కుంటూ ఎన్నికలలో విజయం సాధిస్తున్నారు. ఇక ఆ తర్వాత ఖర్చు పెట్టిన ప్రతి పైసాను సంపాదించే పనిలో ఉంటున్నారు. దీనికోసం వ్యాపారాలు, కాంట్రాక్టులు, లంచాలు -ఒక్కటేమిటి, ప్రజా ప్రతినిధులమనే స్పృహను కోల్పోయి, పదవిని ఫక్తు వ్యాపార సాధనంగా మార్చేస్తున్నారు. తమ స్వలాభం కోసం, తాము గెలిచిన పార్టీని వదిలేసి, అధికార పార్టీలోకి వలస పోతున్నారు.


ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, క్షేత్ర స్థాయిలో ప్రజల నిజమైన సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్న 13 ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు ఒక్క వేదిక మీదకు వచ్చి, రాష్ట్ర బడుగు వర్గాల ప్రజల గొంతు వినిపించే లక్ష్యంతో ‘తెలంగాణ ప్రజా అసెంబ్లీ’ని నిర్వహించాలని నిర్ణయించాయి. సెప్టెంబర్ 4 నుంచి 7వ తేదీ వరకూ ఈ ప్రజా అసెంబ్లీ ఆన్లైన్‌లో జరుగుతుంది. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల నాటికి తెలంగాణ ప్రజా డిమాండ్లు ఒక పత్రంగా రూపొందించి, ప్రభుత్వానికి, అన్ని రాజకీయ పార్టీలకు; మీడియా ద్వారా ప్రజలకు అందించాలని ప్రజా అసెంబ్లీ నిర్వాహకుల కమిటీ ప్రయత్నం చేస్తున్నది.


సాధారణంగా అసెంబ్లీలో ప్రజలకు సంబంధించి కొన్ని అంశాలు మాత్రమే చర్చకు వస్తాయి. ఆ చర్చ కూడా పూర్తిగా జరగదు. ఆ చర్చలో పాల్గొనేందుకు అసెంబ్లీ సభ్యులలో కేవలం కొద్ది మందికి మాత్రమే అవకాశం వస్తుంది. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రశ్నలకు ఇచ్చే జవాబులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండవు. అసెంబ్లీలో ఆమోదించే ఆర్డినెన్సులు, చట్టాలు, ప్రభుత్వం విడుదల చేసే జీవోలు కూడా ఇంగ్లీష్ లో ప్రభుత్వ వెబ్సైట్స్ లో మాత్రమే కనపడతాయి. కొన్ని జీవోలు ప్రభుత్వ వెబ్సైట్ లో కూడా ఉండవు. శాసనసభ ఆమోదించిన చట్టాలను ప్రభుత్వం అమలు చేయకపోయినా అడిగే పరిస్థితి లేదు.


ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న ప్రజా అసెంబ్లీలో సమాజంలో ఉన్న అన్ని వర్గాలు, సామాజిక బృందాల ప్రతినిధులు ప్రజల భాష అయిన తెలుగులో (కొందరు ఉర్దూలో) మాట్లాడతారు. అన్ని అంశాలపై వాస్తవ గణాంకాల ప్రాతిపదికన పత్రాలు, ఆయా వర్గాల, ప్రజల నిర్దిష్ట డిమాండ్లు ప్రజల ముందు తెలుగు, ఇంగ్లిష్ భాషలలో ఉండనున్నాయి. ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్‌లో మాత్రమే కాకుండా ప్రజలు వీక్షించడానికి వివిధ సోషల్ మీడియా వేదికల మీద ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయి.


ఈ సమావేశాలలో ప్రజలు నేరుగా మాట్లాడతారు. ప్రజలతో పని చేస్తున్న కార్యకర్తలు, నాయకులు, ఆయా రంగాలపై అధ్యయనం చేస్తున్న నిపుణులు, మేధావులు మాట్లాడతారు. అసంఘటిత ఆదివాసీ రైతులతో పాటు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, టీచర్లు, న్యాయవాదులు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు కూడా ఒకే వేదికను పంచుకుంటారు. ఈ సమావేశాలలో మాట్లాడుతున్న వాళ్ళు అందరూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో నేరుగా పాల్గొన్న వాళ్ళు, ప్రజల ఆకాంక్షలను ఎత్తి పట్టిన వాళ్ళు. అధికారానికి దూరంగా, ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడిన వాళ్ళు. నిజాయితీ, నిబద్ధత కలిగిన వాళ్ళు. వీరి గొంతుకు ఒక సాధికారత ఉంది. పురుషులు, స్త్రీలు, ట్రాన్స్జెండర్లు కూడా ఈ వేదికలో గొంతు వినిపిస్తున్నారు. ప్రారంభ సెషన్ నుంచి ముగింపు సెషన్ వరకూ అనేక మంది ప్రజా పక్షపాతులు భాగం పంచుకోనున్నారు.


రాష్ట్రంలో వ్యవసాయం, ఉపాధి, ఉద్యోగాలు, విద్యా,  వైద్య రంగాలు, భూమి, నీరు, అడవులు, విత్తనాలు లాంటి సహజ వనరులపై హక్కులు, గ్రామీణ ఉపాధులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి కార్మికులు, పశు పోషకులు, ఆదివాసీ ప్రజలు, అన్ని రంగాల అసంఘటిత కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, రవాణా కార్మికులు, వైకల్యం కలిగిన వ్యక్తులు, భూ సేకరణలో నష్టపోయిన నిర్వాసితులు, మత మైనారిటీలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు, బాలలు, ప్రజాస్వామిక హక్కులు, ప్రభుత్వ సంస్థల పని తీరుపై ఈ సమావేశాలలో చర్చలు జరుగుతాయి. ఈ సమావేశాల ముగింపుగా సెప్టెంబర్ 7న అధికార పార్టీతో సహా, అన్ని రాజకీయ పక్షాలతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. ప్రజా అసెంబ్లీ సమావేశాలలో వచ్చిన అంశాలను చర్చ కోసం, పరిష్కారం కోసం సమాజం ముందు కూడా ఉంచుతారు. అత్యంత ఆసక్తిదాయకమైన ఈ సమావేశాలకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే.


-కన్నెగంటి రవి 

రైతు స్వరాజ్య వేదిక

Updated Date - 2020-09-04T16:42:16+05:30 IST