ప్రగతి భారత ప్రతిష్ఠా శిఖరం

ABN , First Publish Date - 2020-06-28T05:46:59+05:30 IST

ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌లో భూసంస్కరణలు, వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే అధికార వికేంద్రీకరణ చేపట్టి గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేసేందుకు ప్రయత్నించిన పీవీ ఒక క్రాంత దర్శి...

ప్రగతి భారత ప్రతిష్ఠా శిఖరం

ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌లో భూసంస్కరణలు, వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే అధికార వికేంద్రీకరణ చేపట్టి గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేసేందుకు ప్రయత్నించిన పీవీ ఒక క్రాంత దర్శి. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న తరుణంలో కీలకమైన విధానాలు చేపట్టి దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలపైకి తీసుకురావడంతో పీవీ పాలనా దక్షత ప్రపంచానికి సుస్పష్టమైంది. 


దేశాభివృద్ధిలో, జాతి ప్రగతిలో సాంస్కృతిక రంగం పాత్ర కీలకం. జాతి సమగ్రతను పరిపుష్టం చేయడంలో కళారంగం పోషించే పాత్ర బృహత్తరం. సాంస్కృతిక సమైక్యతతోనే నిజమైన భావసమైక్యత సిద్ధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

పీవీ నరసింహా రావు


పీవీనరసింహావు గారితో ఎన్నో ఏళ్ల అనుబంధముంది. ఆయనంటే నాకు అపారమైన గౌరవం. మాతృదేశం, మాతృభాష పట్ల ఆయనకు ఎనలేని అభిమానం ఆయన మాటల్లో చేతల్లో వ్యక్తమయ్యేది. బహుభాషా పరిజ్ఞానం, సాహితీవేత్త కావడం, దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు మార్చి ఆధునిక భారతానికి దారిని నిర్మించిన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశానికి అంతర్జాతీయ ఖ్యాతి సాధించడమే కాదు, గ్రామాల్లో నిజమైన స్వరాజ్యం గురించి తపించిన పీవీ నరసింహారావు ఒక తెలుగు వాడని నేను సగర్వంగా చెప్పుకుంటాను.


పివి సమైక్య వాది. సమైక్య రాష్ట్రం ఉండాలని ఆయన అభిలషించేవారు. కాని అందుకు భిన్నంగా నేను రెండు తెలుగు రాష్ట్రాలుండాలని అనుకునేవాడిని. ఈ ఒక్క అభిప్రాయ వ్యత్యాసాన్ని మినహాయిస్తే మా ఇద్దరి మధ్యా సత్సంబంధాలుండేవి. ఎన్నో కీలక మంత్రిత్వ శాఖలు ఉన్నప్పటికీ నేను వాజపేయి ఆశ్చర్యపోయే విధంగా నాకిష్టమైన గ్రామీణాభివృద్ధి శాఖనే కోరుకుని గ్రామాలకు సేవ చేయాలనుకున్నాను. ఆ సమయంలో మా ఇద్దరి మధ్యా ఎన్నో సార్లు చర్చలు జరిగేవి. ఒక తెలుగువాడివై ఉండి ఇంత చిన్న వయస్సులో మంచి విషయ పరిజ్ఞానం సాధించి ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో సంతోషకరమని ఆయన భుజం తట్టేవారు. ఆయన ప్రధాని అయిన వెంటనే 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకోవడం వల్ల నాకు గ్రామీణాభివృద్ధి శాఖలో ఆ రంగంలో మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం లభించిందని చెప్పక తప్పదు. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌లో సాహసోపేతంగా భూసంస్కరణలు వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే అధికార వికేంద్రీకరణ చేపట్టి గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేసేందుకు ప్రయత్నించిన పీవీ ఒక క్రాంత దర్శి.


పీవీ నరసింహారావు మితభాషి. అన్ని హంగులూ, ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. ఆర్థిక సంస్కరణలతో పాటు విద్యా సంస్కరణలను, భూసంస్కరణలను ప్రవేశపెట్టినప్పటికీ, బహుముఖ ప్రజ్ఞాశాలి అయినప్పటికీ ఎంతో నిగర్విగా, నిరాడంబరంగా ఉండడం అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. స్థిత ప్రజ్ఞుడైన పివి భారత రాజకీయాల్లో చాణక్యుడుగా గుర్తింపు పొందారు.


హాస్యప్రియుడైన పీవీ నిశ్శబ్ద ప్రవాహం లాగా ప్రసంగించేవారు. మంచి ఉపన్యాసకుడైన ఆయన ప్రసంగాల్లో భాషా చాతుర్యం, భావ స్పష్టత, విషయాల పట్ల గాఢత ప్రస్ఫుటమయ్యేది. విమర్శలకు క్రుంగి, ప్రశంసలకు లొంగే మనస్తత్వం కాదు ఆయనది. ఎటువంటి విమర్శలొచ్చినా తొణకకుండా శాంతచిత్తంతో అందర్నీ ఒప్పించేలా సమాధానం ఇచ్చేవారు.


తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని కీలకమైన విధానాలు చేపట్టి ఆర్థికవ్యవస్థను తిరిగి పట్టాలపైకి తీసుకురావడంతో పీవీ పాలనా దక్షత ప్రపంచానికి సుస్పష్టమైంది. పార్లమెంటులో మెజారిటీ లేకపోయినా అత్యంత చాకచక్యంతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు నడిపించడం వల్లనే పీవీ రాజనీతి ఏమిటో తేటతెల్లమైంది.


ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే పివి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. దేశంలో విస్తృత ఆర్థిక సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ‘వేగవంతమైన పారిశ్రామికీకరణకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు కల్పిస్తున్న అవకాశాలను, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో అందిపుచ్చుకుంటూ అంతర్జాతీయ విపణిలో పోటీపడే దిశగా భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు కృషిచేస్తాం’ అని ఆయన తన ఆలోచనా విధానాన్ని స్పష్టం చేశారు. వాణిజ్య సరళీకరణ చేపట్టడంతో పాటే ఆయన భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేశారు. ‘అన్ని ద్వారాలు తెరవాలి. ఏ గాలికీ మనం కొట్టుకుపోకూడదు..’ అన్న ఆయన సిద్ధాంతం వల్లనే భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ పోటీలో నిలదొక్కుకుంది. అప్రతిష్ట పాలైన లైసెన్స్ పర్మిట్ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పటిష్టమైన సంస్కరణలు చేపట్టిన ఘనత పీవీకి దక్కుతుంది. అంతేకాదు, వినూత్నమైన, విప్లవాత్మకమైన మార్పులు చేపట్టినప్పటికీ వాటికి ఆమోదయోగ్యత సాధించారు. అందుకు అనుగుణమైన రాజకీయ వాతావరణాన్ని సృష్టించారు.


దౌత్య సంబంధాల విషయంలో కూడా ఆయన తన ప్రజ్ఞాపాటవాలతో భారతదేశ కీర్తిప్రతిష్టలను పరిరక్షించడంతోపాటు మన ప్రాధాన్యతలను, లక్ష్యాలను అంతర్జాతీయ వేదికలపై చాలా స్పష్టంగా చెప్పేవారు. ప్రపంచంలో విదేశాంగ, ఆర్థిక అంశాలపై ఆయనకు విస్తృతమైన అవగాహన ఉండేది. విదేశాంగ శాఖ మంత్రిగా ఇండో యూరో, జీ-77 సదస్సులకు అధ్యక్షత వహించి తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. గల్ఫ్ యుద్ధం సందర్భంగా జరిగిన అలీనోద్యమ దేశాల (నామ్) విదేశాంగమంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించి మన దేశ ప్రయోజనాలను కాపాడటంలో చొరవతీసుకున్నారు. లుక్ ఈస్ట్ పాలసీ ద్వారా ఆసియాన్ దేశాలకు చేరువయ్యే విధంగా చొరవతీసుకోవడం,ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలు నెలకొల్పడం, అమెరికాతో సత్సంబంధాల పునరుద్ధరణ వంటి సాహసోపేతమైన చర్యలు చేపట్టారు. అధికారిక సమావేశాల్లోనే కాదు, తెర వెనుక మంతనాల ద్వారా ఆయన ప్రదర్శించిన దౌత్య నీతి వల్ల భారత దేశానికి ప్రత్యేక గుర్తింపు లభించింది..


విదేశాంగ శాఖ మంత్రిగా, కేంద్ర గృహమంత్రిగా, రక్షణ మంత్రిగా, ప్రణాళిక శాఖ మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా.. ఇలా తను బాధ్యతలు చేపట్టిన ప్రతి శాఖలోనూ అవసరమైన సంస్కరణలు తీసుకొచ్చి విమర్శకులతోనూ ప్రశంసలు అందుకున్నారు. పంజాబ్, కశ్మీర్‌ల్లో వేర్పాటువాదాన్ని నియంత్రించడంలో ఆయన విశేష కృషి కొనియాడదగినది.


ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రధానమంత్రి హోదాలో ఉన్నా అసమ్మతిని ఎదుర్కున్నప్పటికీ.. చాకచక్యంగా నెగ్గుకురాగలిగారు. మన రాష్ట్రం నుంచే కాక పొరుగురాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కూడా పార్లమెంటుకు ఎన్నికయ్యారు.. ‘దేశాభివృద్ధిలో, జాతి ప్రగతిలో సాంస్కృతిక రంగం పాత్ర కీలకం. జాతి సమగ్రతను పరిపుష్టం చేయడంలో కళారంగం పోషించే పాత్ర బృహత్తరం. సాంస్కృతిక సమైక్యతతోనే నిజమైన భావసమైక్యత సిద్ధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను’ అని ఓ సందర్భంలో పీవీ పేర్కొన్నారు. కళలు, సాహితీ రంగంపై వారికున్న మక్కువకు ఇదొక నిదర్శనం.


మన భారతీయ భాషలన్నింటితోపాటు మాతృభాష అయిన తెలుగుపై వారికి మమకారంతోపాటు పట్టు ఎక్కువ. అందుకే సమైక్యాంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో తెలుగుభాషాభివృద్ధికి కృషిచేశారు. ప్రాథమిక విద్య తప్పనిసరిగా మాతృభాషలోనే ఉండేట్లుగా చర్యలు తీసుకున్నారు.


1967లో అధికారభాషగా తెలుగు అమలుకు చట్టబద్ధతను తీసుకురావడంతోపాటు ప్రామాణిక కీబోర్డులు, టైప్ రైటర్లు తయారుచేయించి పరిపాలనాభాషగా తెలుగు అమలు కావడంలో ప్రత్యేక చొరవతీసుకున్నారు. అధికార భాషాసంఘం, తెలుగు అకాడెమీ ఏర్పాటులోనూ పీవీ నరసింహారావు చొరవ చిరస్మరణీయం. అంతర్జాతీయ స్థాయిలోనూ తెలుగు సంస్థల ఏర్పాటును ప్రోత్సహించారు. ప్రజల్లో భాషాచైతన్యం కలిగించేందుకు భాషోద్యమం రూపుదిద్దుకోవాలని కూడా వారు ఆకాంక్షించేవారు. రాజహంస, భట్టాచార్య, రాజా అనే కలం పేర్లతో రచనలు చేశారు.


తెలుగుపై అభిమానాన్ని చాటుతూనే.. వివిధ భారతీయ భాషల అభివృద్ధి గురించి తీవ్రంగా కృషిచేశారు. 9 భారతీయ భాషల్లో, 6 విదేశీ భాషల్లో అలవోకగా మాట్లాడేవారు. అందుకే వారిని బహుభాషా కోవిదుడు అంటారు.విషయ పరిజ్ఞానం మెండుగా ఉండబట్టి జ్ఞానాజ్ఞాన విచక్షణతో కూడిన ప్రవర్తనతో బృహస్పతిగా కూడా పేరు తెచ్చుకున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించి, ప్రోత్సహించేవారు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘వేయిపడగలు’ నవలను హిందీ భాషలోకి ‘సహస్రఫణ్’ పేరుతో అనువాదం చేసి ప్రశంసాపాత్రుడయ్యారు. పీవీకి అటల్ బిహారీ వాజపేయితో సన్నిహిత సంబంధాలుండేవి. ఇద్దరూ మంచి ప్రజ్ఞాపాటవాలు కలిగినవారు, సాహిత్య అభిరుచి కలిగినవారు, రచయితలు కావడంతో ఈ సాన్నిహిత్యం పెరిగిందనుకోవచ్చు. ఆయన చేపట్టిన సంస్కరణలు తిరుగులేనివి. వాటిని వాజపేయి ఫలవంతంగా అమలు చేస్తే ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ మరింత వేగవంతం చేస్తున్నారు. నేను పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో పీవీ నరసింహారావు గారికి స్మారక చిహ్నం ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకోగలగడం నాకు లభించిన బృహత్తర అవకాశం. దక్షిణాది వాడు, ప్రధానంగా తెలుగు వాడైన పీవీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం మనందరికీ గర్వకారణం.

(నేటి నుంచి పీవీ శత జయంతి ఉత్సవాలు)


ముప్పవరపు వెంకయ్యనాయుడు

భారత ఉపరాష్ట్రపతి

Updated Date - 2020-06-28T05:46:59+05:30 IST