Oct 9 2021 @ 23:13PM

మీడియాను చూస్తే భయం: ప్రభుదేవా

భరతన్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత ఆర్‌.వి. భరతన్‌ నిర్మించిన ‘బఘీరా’ చిత్ర ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌’గా గుర్తింపు పొందిన ప్రభుదేవా హీరోగా నటించగా, అమైరా దస్తూర్‌, రమ్యా నంబీశన్‌, జనని అయ్యర్‌, సంచితా శెట్టి, గాయత్రీ శంకర్‌, సాక్షి అగర్వాల్‌, సోనియా అగర్వాల్‌, సాయికుమార్‌ తదితరులు నటించారు. గణేశన్‌ శేఖర్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ఒక సైకో థ్రిల్లర్‌ మూవీ. ఇందులో మానసిక స్థిరత్వం లేని సీరియల్‌ కిల్లర్‌ పాత్రలో ప్రభుదేవా నటించారు. 


ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్‌.థాను మాట్లాడుతూ.. ‘‘డ్యాన్సర్‌గా ఉన్నప్పుడు ప్రభుదేవాలో ఎలాంటి ఎనర్జీ ఉందో 30 యేళ్ళ తర్వాత కూడా అదే ఎనర్జీ ఉంది. అదే సమయంలో చిన్న నిర్మాతలను కూడా దగ్గరకి చేరదీసి వారి చిత్రాల్లో కూడా నటించే పెద్ద మనసు ప్రభుదేవాకు ఉంది. అలాగే, చిత్ర నిర్మాణ సంస్థ భరతన్‌ పిక్చర్స్‌ ఒక్క తమిళంలోనే కాకుండా అన్ని భాషల్లో చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. 


హీరో ప్రభుదేవా మాట్లాడుతూ.. ‘‘మీడియా మిత్రులను చూస్తే భయం. వారు ఎంతో షార్ప్‌గా ఉంటారు. ఎంతో తెలివైనవారు. అందుకే వారంటే నాకు భయం. అదే సమయంలో ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకోవద్దంటూ హితవు చేస్తున్నా. ఇకపోతే, ‘బఘీరా’ చిత్రం అద్భుతంగా వచ్చింది. దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ ఆయన బాణీలోనే తెరకెక్కించారు. ఇందులో నటించిన నటీనటులు తమతమ పాత్రలకు న్యాయం చేశారు. పోలీస్‌ పాత్రలో సాయికుమార్‌ మరోసారి రెచ్చిపోయారు. ఈ మూవీ ప్రతి ఒక్కరినీ అలరించేలా ఉంటుంది’ అన్నారు.


Otherwoodsమరిన్ని...