Jul 9 2021 @ 13:38PM

హీరోగా ప్రభు సాల్మాన్‌ కుమారుడు

తమిళ చిత్ర సీమంలో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన దర్శకుడు ప్రభు సాల్మాన్‌ కుమారుడు సంజయ్‌ ఇప్పుడు ‘డేయ్‌ తగప్పా’ అనే చిత్రం ద్వారా హీరోగా మారారు. కౌషిక్‌ శ్రీబుహర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాను దర్శకత్వం వహించిన పలు షార్ట్‌ఫిలిమ్స్‌కు పలు అవార్డులు, రివార్డులు అందుకున్న కౌషిక్‌... తొలిసారి కోలీవుడ్‌కు దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. అంతేకాకుండా, జోజో ఇండియన్‌ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పతాకంపై సీవీ విక్రమ్‌ సూర్యవర్మ నిర్మించే తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఆరాధ్య నటిస్తుంటే, ప్రధాన పాత్రల్లో మదురై ముత్తు, విజయ్‌ టీవీ ఫేం పప్పు, హర్షత్‌ ఖాన్‌ తదితరులు నటిస్తున్నారు. పైగా ఈ చిత్రానికి జాన్‌ రాబిన్స్‌ సంగీతం సమకూర్చుతుండగా, ఎస్‌జే సూభాష్‌ డీవోపీగా పనిచేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల పూజాకార్యక్రమంతో ప్రారంభమైంది.