పోయి రావాలె

ABN , First Publish Date - 2022-01-10T05:40:56+05:30 IST

పోయి రా వలెను, పోయి చూసి రావలెను వెళ్లేందుకు వీలు కల్పించుకోవాలి....

పోయి రావాలె

పోయి రా వలెను, పోయి చూసి రావలెను

వెళ్లేందుకు వీలు కల్పించుకోవాలి


కంటినిండా చూసి చాన్నాళ్ళయింది

కడుపునిండా మాట్లాడీ చాలా రోజులే అయ్యింది


మాట్లాడుటకే బయలుదేరి పోవాలి

మనసు దాహం తీర్చేవి మాటలు ముచ్చట్లే


అమ్మమ్మ ఊరి మీద వాలి రావాలి

అమ్మ అంబాడిన నేలను మృదువుగా ముట్టుకోవాలి

తెగిపోయిన బొడ్డుతాడు కొసను దేవులాడాలి

తల్లి గారి ఇల్లు అంటే

మూలకణాలు పొదిగిన పొదరిల్లు


మ్యాన మామలతో మాట్లాడితేనే

బంధుత్వ తీగల బలగం తెలుసుకోవచ్చు

వారసత్వాల పరంపరా చూడవచ్చు


పోయి రావలెను, పోయి కలిసి రావలెను

సమయం కల్పించుకుని మరీ వెళ్లి రావాలి


జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వందనంతో

తాత ముత్తాతల వంశ పారంపర్యను

ఆజన్మాంతం తలచుకుని తలచుకుని రావాలి


నీ మూలాల్లోకి నీవే వెళ్లిపోవడం అంటే

ఎక్కన్నుంచి వచ్చావో లెక్క తెలిసికోవడమే

నీ జన్మ స్థలానికి నీవు పోయి రావడమంటే

ఒక సత్కార్యం, ఒక కలయిక, ఒకానొక తలపోత


పుట్టిపెరిగిన సమస్త గ్రామాన్ని

బుద్ధి జ్ఞానం నేర్పిన తరగతి గదిని

అక్షరాలు దిద్దిచ్చిన గురువర్యులను

చూసి వినమ్రంగా దండం పెట్టి రావాలి


ఊరులోని వాడలు, చేనులు చెల్కలలో

చిన్ని చిన్ని పాదాలతో నడిచిన బాటల

పాదముద్రలను హృదయంతో ఫోటోలు తీసుకోవాలి


బాల్యంలో అంబాడిన అరుగుమీద

మరొకసారి ఆడి ఆడి రావాలి

స్నానం చేసిన చేదబావి నీళ్లతోని

మరోసారి కాల్లు రెక్కలు కడుక్కొని రావాలి


ఒక్కోసారి మన కోసం మనమే పోవాలి

పోవడం కోసమే పోవాలి రావాలి


అక్కడ ఇప్పుడు ఎవరున్నా లేకున్నా

అక్కడి గాలితో నైనా మాట్లాడాలి

నేల ధూళి నైనా గంధం పూసుకోవాలి

పాత గోడలనైనా పట్టుకోవాలి


పిల్లను చూసిన్నాడు పోయినట్టు గనే

పిల్లనిచ్చిన ఊరికీ ఓసారి పయనమవ్వాలి

పెండ్లి నాటి బరాతు గుర్తుచేసుకొని

ఎదురుకోళ్ల కాడ కాసేపు నిలబడి తీరాలి

అత్త గారి ఊరూ పోయి వస్తుండాలి


మాటలు మనసును కడిగి శుభ్రం చేస్తాయి

ఎజెండా లేకుండానే మాట్లాడుకోవాలి

కడుపారా పాత జ్ఞాపకాలు తలకి ఎత్తుకోవాలి


ఎక్కడికైనా పోయి రావడం అంటేనే

దూర దారాన్ని మరింత దగ్గర చేయడమే

మాట్లాడడం మది నింపే ఆనందమే...

అన్నవరం దేవేందర్‌

94407 63479


Updated Date - 2022-01-10T05:40:56+05:30 IST