Abn logo
Mar 26 2020 @ 00:27AM

పవరాఫ్‌ లాక్‌డౌన్‌!

ప్రాణం ముఖ్యమా?

పదిమందిలో తిరగడం ముఖ్యమా?

ప్రాణమే కదూ!

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని మోదీ ‘లాక్‌డౌన్‌’ ప్రకటించారు. 

మరి, ఇప్పుడు మనిషి ప్రాణాలతో ఉండాలంటే??

వన్‌ అండ్‌ ఓన్లీ ఆప్షన్‌... ‘లాక్‌డౌన్‌’!

బయట తిరగకుండా ఇంట్లోనే ‘లాక్‌డౌన్‌’!!


అమల అక్కినేని ఇటీవల ‘ది లాక్‌డౌన్‌: వన్‌ మంత్‌ ఇన్‌ వూహాన్‌’ అని ఒక డాక్యుమెంటరీని మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశారు. సీజీటీవీ (చైనా గ్లోబల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌) రూపొందించిన 33 నిమిషాల నిడివి గల ఆ డాక్యుమెంటరీని ఇప్పటికి సుమారు 1.40 కోట్లమంది చూశారు. అదొక్కసారి చూస్తే... లాక్‌డౌన్‌ వల్ల ఎంత ఉపయోగం అనేది తెలుస్తుంది. ఇంతకీ, ఆ డాక్యుమెంటరీలో ఏముంది?


వూహాన్‌లో లాక్‌డౌన్‌ విధించారు. ప్రజల్ని వీధుల్లోకి రానివ్వలేదు. ప్రజా రవాణా వ్యవస్థ అనే మాటే లేదు. ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు తు.చ. తప్పకుండా పాటించారు. ఫలితంగా కరోనా పుట్టినిల్లులో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ, మహమ్మారి మిగతా ప్రపంచంలో, మన తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది.


ప్రస్తుతం కరోనాకు మందు లేదు. ఇంకా కనిపెట్టలేదు. కరోనాకి విరుగుడు కనుగొనే పనిలో వైద్య శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. మరి, ఈ మహమ్మారి మన చెంతకు చేరకుండా ఉండాలంటే ఏం చేయాలి? చెప్పులేసుకుని షికార్లు చేయకుండా చక్కగా తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చోవాలి. ఈ విషయంలో వూహాన్‌ ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలి. అలా కాదని ఇంటి బయట అడుగు పెట్టి, అందరితో రాసుకుపూసుకు తిరిగితే మన దేశం మరో ఇటలీ అయ్యే ప్రమాదం ఉంది. ముప్ఫై రోజుల పాటు ‘లాక్‌డౌన్‌’లో వూహాన్‌లో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అంబులెన్స్‌ ధ్వని తప్ప, ప్రజల రణగొణ ధ్వనులు ఎక్కడా వినిపించలేదు. 


చైనా సంప్రదాయం ప్రకారం కొత్త ఏడాది, జనవరి 25కి రెండు రోజుల ముందు... 23న ఉదయం 10 గంటలకు వూహాన్‌లో ‘లాక్‌డౌన్‌’ విధించారు. రైళ్లు, బస్సులు, కార్లు, సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు... ప్రజా రవాణా వ్యవస్థ అంతటినీ రద్దు చేశారు. దాంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. సుదూర ప్రాంతాల నుండి వూహాన్‌కి వచ్చినవారు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లలేక కష్టాలు పడ్డారు. ఓ కార్మికుడు అయితే అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌ ఏరియాలో కొన్ని రోజులు తల దాచుకున్నాడు. అయితే... కరోనా స్పీడుకు బ్రేకులు వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేసింది. ప్రజల్ని నిర్బంధంలో ఉంచింది. అదే మంచిది అయింది. వూహాన్‌కి వచ్చిన ఓ పర్యాటకుడికి కరోనా వచ్చింది. అతణ్ణి నిర్బంధంలో ఉంచి చికిత్స అందించింది. ఒకవేళ ‘లాక్‌డౌన్‌’ విధించనట్లయితే... అతడి ద్వారా మరికొందరికి సోకేది. 28 రోజుల లాక్‌డౌన్‌ తర్వాత ఒకానొక దశలో 13 వేలు ఉన్న కరోనా కేసులు, ఆరు వందలకు చేరాయి. తర్వాత మరిన్ని తగ్గాయి.


దటీజ్‌ ది పవరాఫ్‌ ‘లాక్‌డౌన్‌’! 

కరోనా ఎవరో ఒకరి కోసం ప్రత్యేకంగా రాదు. అదో చోటుకు వస్తే... అందరికీ హాయ్‌ చెప్తుంది. కరోనాకి కన్‌ఫ్యూజన్స్‌ లేవు. క్లారిటీ ఎక్కువ. వస్తే... మడతపెట్టి తీసుకువెళ్లిపోతుంది. అందుకని, కరోనాని మన దగ్గరకి రానివ్వకుండా జాగ్రత్త పడదాం! బయట తిరగకుండా ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా ఉందాం!!

Advertisement
Advertisement
Advertisement