తుఫానుతో విద్యుతశాఖకు రూ.2కోట్ల మేర నష్టం

ABN , First Publish Date - 2020-11-29T05:21:38+05:30 IST

నివర్‌ తుఫాను కారణంగా గత రెండురోజులు జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో విద్యుతశాఖకు రూ.2కోట్ల మేర నష్టం వాటిల్లింది.

తుఫానుతో విద్యుతశాఖకు రూ.2కోట్ల మేర నష్టం
రైల్వేకోడూరు వెంకయ్యస్వామి ఆలయం సమీపంలో విరిగిపడిన స్తంభాలను పరిశీలిస్తున్న సీఎండీ

నీట మునిగిన 318 ట్రాన్సఫార్మర్లు, 63 సబ్‌ స్టేషన్లు

నేలకొరిగిన 900 విద్యుత స్తంభాలు

33 కి.మీ మేర తెగిపడిన తీగలు

25 గ్రామాల్లో అంధకారం

కడప (సిటి)/రైల్వేకోడూరు, నవంబరు 28 : నివర్‌ తుఫాను కారణంగా గత రెండురోజులు జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో విద్యుతశాఖకు రూ.2కోట్ల మేర నష్టం వాటిల్లింది. అయితే ట్రాన్సఫార్మర్లు, సబ్‌స్టేషన్లు నీట మునిగి విద్యుత స్తంభాలు నేలకొరిగి, విద్యుత తీగలు తెగిపడ్డంతో అనేక ప్రాంతాల్లో విద్యుత సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా జిల్లాలో 63 సబ్‌స్టేషన్లలో నీరు చేరి విద్యుత సరఫరాకు అంతరాయం ఏర్పడగా రెండురోజుల్లో 60 సబ్‌స్టేషన్లలో మరమ్మతులు పూర్తి చేశారు. కాగా 163 ఫీడర్లు తుఫాను బారిన పడగా 133 సరిచేశారు. ఇదిలా ఉంటే పవర్‌ ట్రాన్సఫార్మర్లు 318 దెబ్బతినగా 55 వాటికి మరమ్మతులు చేశారు. 900 విద్యుత స్తంభాలు నేలకొరగగా 150 తిరిగి నిలబెట్టారు. అలాగే 33 కి.మీ మేర విద్యుత తీగలు తెగిపడ్డాయి. వీటిలో 14 కిమీ మేర తీగలు పునరుద్ధరించారు. రాయచోటి, రాజంపేట డివిజన్ల పరిధిలో శనివారం రాత్రి వరకు 25 గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో విద్యుత పునరుద్ధరణ కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని, మరమ్మతులు పూర్తి చేసి జిల్లా వ్యాప్తంగా విద్యుత సరఫరా పునరుద్ధరిస్తామని ఎస్పీడీసీఎల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీరు ఎన.శ్రీనివాసులు పేర్కొన్నారు.


యుద్ధప్రాతిపదికన విద్యుత పనులు


వరద ప్రాంతాల్లో దెబ్బతిన్న విద్యుత్‌ పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని విద్యుత్‌ శాఖ సీఎండీ హరినాధరావు తెలిపారు. శనివారం రైల్వేకోడూరులోని వెంకయ్యస్వామి ఆలయం సమీపంలో కూలిపోయిన విద్యుత్‌ స్తంభాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లో వరద నీటి ప్రవాహం, గాలులకు విద్యుత్‌శాఖకు రూ.5.2 కోట్లు నష్టం వాటిల్లిందని తెలిపారు. వేగవంతంగా పనులు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. 65 ప్రాంతాల్లో నీరు ఉన్నందున విద్యుత్‌ సరఫరా మూడు రోజుల్లో పూర్తిగా పునరుద్ధరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట విద్యుత్‌ డీఈ చంద్రశేఖర్‌రావు, రైల్వేకోడూరు ఏడీఈఈ చింతం బాలాజీ, ఏపీలు సుబ్బారావు, యోగానందం, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T05:21:38+05:30 IST