పార్టీల రద్దుకూ పవర్‌ !

ABN , First Publish Date - 2022-06-27T08:33:47+05:30 IST

పన్ను రాయుతీల కోసమో.. ఇతరత్రా రాజకీయ ప్రయోజనాల కోసమో పెట్టిన రాజకీయ పార్టీల గుర్తింపు రద్దుచేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) గట్టి పట్టుదలతో ఉంది.

పార్టీల రద్దుకూ పవర్‌ !

కేంద్రానికి ఎన్నికల కమిషన్‌ ప్రతిపాదన

ఇప్పటికే 198 గుర్తింపు పొందని పార్టీలపై వేటు.. ఈసీ రిజిస్టర్‌ నుంచి తొలగింపు 

రద్దుచేసే అధికారమూ ఇవ్వాలని వినతి.. 4 ఏళ్ల కింద సుప్రీంనూ ఇదే కోరిన కమిషన్‌

రిజిస్టర్‌ చేయించుకుని బరిలో నిలవని పార్టీలు.. ఐటీ మినహాయింపుల కోసమే పార్టీలు 

విరాళాల వివరాలివ్వకుండా తప్పించుకుంటున్న కొన్ని పక్షాలు


న్యూఢిల్లీ, జూన్‌ 26: పన్ను రాయుతీల కోసమో.. ఇతరత్రా రాజకీయ ప్రయోజనాల కోసమో పెట్టిన రాజకీయ పార్టీల గుర్తింపు రద్దుచేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) గట్టి పట్టుదలతో ఉంది. రిజిస్టరైన గుర్తింపు పొందని పార్టీలు (ఆర్‌యూపీపీలు) చేసే అక్రమాలకు కళ్లెం వేయాలని భావిస్తోంది. పార్టీలను రిజిస్టర్‌ చేసే అధికారంతో పాటు సదరు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం కూడా తనకు దఖలుపరచాలని కేంద్ర న్యాయ శాఖను కోరుతోంది. ఇప్పటికే ఆషామాషీ పార్టీల ప్రక్షాళనకు ఈసీ నడుం బిగించింది. ఇటీవల 198 ఆర్‌యూపీపీలను తన వద్ద ఉన్న పార్టీల జాబితా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. కొందరితో కూడిన సమూహాన్ని రాజకీయ పార్టీగా రిజిస్టర్‌ చేసే అధికారాన్ని ఎన్నికల చట్టం ఈసీకి కల్పిస్తోంది. కానీ దాని రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసే అధికారం మాత్రం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల కింద ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ కేంద్ర శాసన వ్యవహారాల (న్యాయశాఖ పరిధిలో) కార్యదర్శితో సమావేశమయ్యారు. నిర్దిష్ట కారణాలతో నాన్‌సీరియస్‌ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారాన్ని ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కమిషన్‌కు ఇవ్వాలని కోరారు. నిజానికి ఈ ప్రతిపాదన ఇప్పటిది కాదు. చాలాకాలంగా ఈసీ కేంద్రానికి లేఖలు రాస్తూనే ఉంది. నాలుగేళ్ల కిందట 2018 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో ఈ అధికారం కోరుతూ ఓ అఫిడవిట్‌ కూడా దాఖలుచేసింది. చాలా పార్టీలు రిజిస్టర్‌ చేయించుకుంటున్నాయి గానీ.. ఎన్నికల్లో పోటీచేయడం లేదు. అలాంటి పార్టీలు కాగితంపైనే ఉంటున్నాయి. ఆదాయ పన్ను మినహాయింపు ప్రయోజనం పొందే ఉద్దేశంతోనే కొందరు పార్టీలు పెడుతున్నారని కూడా ఈసీ భావిస్తోంది. దేశంలో సుమారు 2,800 వరకు రిజిస్టరైన గుర్తింపు పొందని పార్టీలు ఉన్నాయి. 8 జాతీయ పార్టీలుగా, 50కిపైగా గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలుగా ఉన్నాయి. కాగా, సముచిత పరిరక్షణ చర్యలతో పార్టీల రిజిస్ట్రేషన్‌ రద్దు అధికారాన్ని కమిషన్‌కు ఇవ్వొచ్చని ఓ సీనియర్‌ అధికారి అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఈసీ స్వతంత్రంగా పనిచేయాలి. స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించాలి. తప్పుడు మార్గాల్లో పార్టీలను రిజిస్టర్‌ చేసుకుంటే... దానిపై ఈసీ విచారణ జరిపితే.. కమిషన్‌ రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోవలసి వస్తుంది. పార్టీల రాజకీయ కార్యకలాపాలు, కార్యక్రమాలు, సిద్ధాంతాలపై పర్యవేక్షణ కూడా చేయాల్సి రావచ్చు. బహుశా ఈ కారణంగానే రిజిస్ట్రేషన్‌ రద్దుచేసే అధికారాన్ని ప్రభుత్వం తనకివ్వడం లేదని ఈసీ భావిస్తోంది.


విరాళాల వివరాలు ఇవ్వకుండా.. 

చిరునామాయే లేని ఆర్‌యూపీపీల అంతు తేల్చడానికి ఈ ఏడాది మే 25న కమిషన్‌ ఆయా రాష్ట్రాల  ఎన్నికల ప్రధానాధికారులకు (సీఈవోలకు) ఓ ఆదేశమిచ్చింది. ప్రజాప్రాతినిధ్యం చట్టంలోని 29ఏ, 29సీ సెక్షన్లకు అనుగుణంగా కమిషన్‌ నిర్దేశాలకు కట్టుబడి ఉండని ఆర్‌యూపీపీలపై చర్యలు ప్రారంభించాలని ఉత్తర్వులిచ్చింది. అదే రోజు 87 ఆర్‌యూపీపీలను తన జాబితా నుంచి తొలగించింది. ఈ నెల 20న మరో 111 ఆర్‌యూపీపీలను (మొత్తం 198 పార్టీలు) తీసివేసింది. ఈసీ తనిఖీలు చేపట్టగా.. రిజిస్టర్‌ చేయించుకున్న చిరునామాల్లో ఈ పార్టీల కార్యాలయాలు లేవు. అడ్రస్‌ మార్చుకున్న పార్టీలు ఆ సమాచారాన్ని కమిషన్‌కు అందజేయలేదు. సీఈవోలు పంపిన లేఖలు తిరిగొచ్చాయి. దీంతో ఈసీ పై నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన మూడు ఆర్‌యూపీపీలపై న్యాయ, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కేంద్ర రెవెన్యూ విభాగానికి నివేదించింది. ఇంకోవైపు.. అందుకున్న విరాళాలకు సంబంధించి 2017-18లో 1,897 ఆర్‌యూపీపీలు, 18-19లో 2,202, 19-20లో 2,351 ఆర్‌యూపీపీలు కమిషన్‌కు వివరాలు అందించలేదు. దీంతో వీటి సమాచారాన్ని కూడా పంపి తగు చర్యలు తీసుకోవాలని కోరింది. విరాళాల వివరాలు సమర్పించకుండా ఆదాయ పన్ను మినహాయింపు పొందిన 66 గుర్తింపు పొందని పార్టీల సమాచారాన్ని కూడా అందజేసింది.


అఫిడవిట్‌లో ఏం చెప్పింది..?

‘ఏదైనా పార్టీని చట్టవిరుద్ధంగా ప్రకటించినప్పుడు.. తప్పుడు మార్గాల ద్వారా రిజిస్టర్‌ చేయించుకున్నట్లు తేలితే వాటి రిజిస్ట్రేషన్‌ను రద్దుచేయొచ్చు. అలాగే సుప్రీంకోర్టు వివిధ తీర్పుల సందర్భంగా ప్రస్తావించిన ప్రత్యేక సందర్భాల్లో రిజిస్ట్రేషన్‌ రద్దుచేయొచ్చు’ అని ఈసీ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. భారత రాజకీయాలను నేరరహితం చేయాలని న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ వేసిన పిటిషన్‌పై ఈ అఫిడవిట్‌ దాఖలుచేసింది. అవకతవకలకు పాల్పడే ఆర్‌యూపీపీల రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసే అధికారాన్ని తనకు అప్పగిస్తూ చట్టాన్ని సవరించాలని 1998 నుంచీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నామని ఈసీ కోర్టుకు తెలియజేసింది. ‘2004లో ఎన్నికల సంస్కరణలకు సంబంధించి 22 ప్రతిపాదనలతో కేంద్రానికి జాబితా పంపాం. ఏడాది తర్వాత దానిని కేంద్ర సిబ్బంది, న్యాయశాఖల స్థాయీసంఘానికి నివేదించారు. రిజిస్ట్రేషన్‌ రద్దు అధికారం ఈసీకి ఇవ్వాలన్న ప్రతిపాదన పరిశీలనయోగ్యమైనదేనని కేంద్ర న్యాయ శాఖ 2010 డిసెంబరులో పేర్కొంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన పార్టీల గుర్తింపు రద్దుచేసే అధికారాన్ని కమిషన్‌కు ఇవ్వాలని మూడేళ్ల తర్వాత తన నివేదికలో కూడా తెలిపింది. 2005-15 మధ్య ఎన్నికల్లో పోటీచేయని ఆర్‌యూపీపీలను గుర్తించేందుకు 2016లో కమిషన్‌ స్వయంగా చొరవ తీసుకుంది. కేవలం ఐటీ మినహాయింపులు పొందేందుకే పార్టీలు పెట్టడాన్ని అడ్డుకునేందుకు కూడా రిజిస్ట్రేషన్‌ రద్దు అధికారాన్ని కోరుతున్నాం’ అని వివరించింది.

Updated Date - 2022-06-27T08:33:47+05:30 IST