విద్యుత్‌ చౌర్యానికి అడ్డుకట్టేదీ?

ABN , First Publish Date - 2022-07-07T05:57:27+05:30 IST

ఉమ్మడి గుంటూరు జిల్లాలో విద్యుత్‌ చౌర్యం కేసులు పెరిగిపోతున్నాయి.

విద్యుత్‌ చౌర్యానికి అడ్డుకట్టేదీ?

ఐఆర్‌డీఏ స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసినా అంతే

రెండేళ్లలో రూ.10 కోట్ల వరకు జరిమానాలు 

వసూళ్లలో అధికారుల అలసత్వం

గుంటూరు, జూలై 6: ఉమ్మడి గుంటూరు జిల్లాలో విద్యుత్‌ చౌర్యం కేసులు పెరిగిపోతున్నాయి. అక్రమార్కులకు విధించిన జరిమానాల వసూలు అధికారులకు తలకుమించిన భారంగా మారుతున్నాయి. కొందరు దొడ్డిదారిన విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నారనేది తనిఖీల్లో తేటతెల్లమవుతోంది. ఇటీవల ఉమ్మడి జిల్లాలో ఆపరేషన్‌, విజిలెన్స్‌ తనిఖీల్లో పెద్దఎత్తున కేసులు నమోదు చేసి రూ.లక్షల్లో జరిమానా విధించారు. అయితే వాటి వసూలు మాత్రం నత్తనడకన సాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పాత మీటర్ల వినియోగదారులు ఎక్కువగా విద్యుత్‌ చౌర్యానికి పాల్పడేవారు. వాటి స్థానంలో ఐఆర్‌డీఏ స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. రెండేళ్లుగా విద్యుత్‌ విజిలెన్స్‌ బృందాలు జరిపిన దాడుల్లో అక్రమ కనెక్షన్లు వెలుగుచూశాయి. దీంతో విస్తుపోవటం అధికారుల వంతవుతోంది. గుట్టుచప్పుడు కాకుండా చౌర్యానికి పాల్పడుతున్న  వారిపై కేసులు నమోదు చేసి పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తున్నారు.  

వసూళ్లలో అలసత్వం..

విద్యుత్‌ చౌర్యానికి పాల్పడిన వారినుంచి జరిమానాల వసూళ్లలో విద్యుత్‌శాఖ అధికారుల అలసత్వంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్‌ చౌర్యం కేసుల్లో విధించిన జరిమానాలను నిర్దేశిత గడువులోగా వసూలు చేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఆలస్యమైతే నెలవారీ విద్యుత్‌ బిల్లుల చెల్లింపులతో పాటు జరిమానా నగదు కలిపి చెల్లించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఓ అధికారి పేర్కొన్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండేళ్లలో సుమారు 5వేల కేసులు నమోదు చేయగా రూ.10 కోట్ల వరకు జరిమానాలు విధించినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 

కొరవడిన ప్రణాళిక..

విద్యుత్‌ నష్ట నివారణపై అధికారుల వద్ద సమగ్ర ప్రణాళిక లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్‌ చౌర్యం, నష్ట నివారణ చర్యలపై ప్రజలకు కల్పించాల్సిన అవగాహన శూన్యం. అక్రమ వాడకంపై విధించే జరిమానాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తే ఈ చౌర్యానికి కొంతమేర అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. విజిలెన్స్‌, విద్యుత్‌ ఆపరేషన్‌ విభాగాల అధికారులు ముందస్తు ప్రణాళికతో అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే తప్ప వందశాతం జరిమానాల వసూలు కష్టమేనన్న వాదన వినిపిస్తోంది.

విద్యుత్‌ వినియోగం పక్కదారి...

కొన్ని రంగాలకు రాయితీపై, మరికొన్నింటికి ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నా చౌర్యం ఆగడం లేదు. తీగలకు నేరుగా వైర్లను కలిపి వాడుకోవటం, గృహ అవసరాలకు కనెక్షన్‌లు తీసుకొని వాణిజ్యానికి వినియోగించుకోవటం, వ్యవసాయం మాటున ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. మీటర్లకు సంబంధం లేకుండా విద్యుత్‌ వాడకం(మాల్‌ ప్రాక్టీస్‌), అధిక లోడు వినియోగం తదితర మార్గాల్లో వినియోగిస్తూ విద్యుత్‌ సంస్థకు నష్టాన్ని తెచ్చిపెడుతున్నారు. ఏదైనా ప్రాంతంలో సరఫరాలో వ్యత్యాసం ఉంటే అధికారులు తనిఖీలు నిర్వహిస్తారు. దాడుల సందర్భంగా మాత్రమే ఈ చౌర్యం కేసులు బయటపడుతున్నాయి. అప్పటివరకు అక్రమార్కులకు పుల్‌స్టాప్‌ పడటం లేదు. 

ఉమ్మడి జిల్లాలో నమోదైన కేసులు....

సంవత్సరం జరిమానా (రూ.కోట్లలో)        వసూళ్లు 

2020-21     4.88 3.2

2021-22     5.48 3.64


Updated Date - 2022-07-07T05:57:27+05:30 IST