మీ మొబైల్‌తోనే కరెంట్‌ మీటర్‌రీడింగ్‌ తీసుకోవచ్చు!

ABN , First Publish Date - 2021-05-17T16:36:34+05:30 IST

ప్రతి నెలా మీ ఇళ్లలో ఇకమీరే విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ తీసుకోవచ్చు...

మీ మొబైల్‌తోనే కరెంట్‌ మీటర్‌రీడింగ్‌ తీసుకోవచ్చు!

  • 30 రోజులు దాటితే సెల్ఫ్‌రీడింగ్‌
  • టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఐటీ యాప్‌లో అందుబాటులోకి
  • రీడింగ్‌ స్కాన్‌ చేయగానే బిల్లు సిద్ధం

హైదరాబాద్‌ సిటీ : ప్రతి నెలా మీ ఇళ్లలో ఇకమీరే విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ తీసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌తో మీరే విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ని స్కాన్‌ చేసి బిల్లు తీసుకునే యాప్‌ను దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) అందుబాటులోకి తీసుకువచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్‌ బిల్లుల జారీప్రక్రియ ఆలస్యంగా జరుగుతోంది. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెడుతూ 30 రోజులు దాటితే సెల్ఫ్‌మీటర్‌ రీడింగ్‌ తీసుకునే విధానాన్ని విద్యుత్‌ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన విద్యుత్‌ బిల్లులను డిస్కం పరిధిలో అన్ని సర్కిళ్లలో 90 శాతం వరకు జారీ చేయడంతో ఈ  సేవలు వచ్చేనెల నుంచి పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఐటీవింగ్‌ అధికారులు తెలిపారు. టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ సంస్థ యాప్‌లో కన్జ్సూమర్స్‌ సెల్ఫ్‌ బిల్లింగ్‌ పేరుతో ప్రత్యేక గుర్తును గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. రీడింగ్‌ ప్రక్రియలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయని, మీటర్‌ రీడింగ్‌ ప్రక్రియ ప్రారంభమయిన తర్వాత వాటిని గుర్తిస్తూ పరిష్కరిస్తామని ఐటీ అధికారులు చెబుతున్నారు.


20 సర్కిళ్లలో సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ 

డిస్కం పరిధిలోని 20 సర్కిళ్ల పరిధిలో సెల్ఫ్‌మీటర్‌ రీడింగ్‌ ప్రక్రియ అందుబాటులో ఉండనుంది. గృహ వినియోగకనెక్షన్ల (కేటగిరి-1, కేటగిరి-2)లో మొబైల్‌తో మీటర్‌రీడింగ్‌ తీసుకోవచ్చు. గ్రేటర్‌ జోన్‌ పరిధిలో మొత్తం 52 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా వాటిలో 45 లక్షల గృహావినియోగ కనెక్షన్లు ఉన్నాయి. బంజారాహిల్స్‌, సైబర్‌సిటీ, హైదరాబాద్‌ సెంట్రల్‌, సౌత్‌ సర్కిళ్లతో పాటు గద్వాల్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్గొండ, సిద్దిపేట, సూర్యపేట, వికారాబాద్‌, వనపర్తి, యాదాద్రి సర్కిళ్ల పరిధిలోని వినియోగదారులు యాప్‌తో సెల్ప్‌మీటర్‌ రీడింగ్‌ తీసుకొవచ్చని ఐటీ అధికారులు తెలిపారు.


ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోండి..

ప్లే స్టోర్‌ నుంచి టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ ఐటీ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌లోకి వెళ్లగానే కన్జ్సూమర్స్‌ సెల్ఫ్‌ బిల్లింగ్‌ అనే గుర్తు కనిపిస్తుంది. కొత్తగా యాప్‌ వాడుతున్నట్లయితే యునిక్‌ సర్వీస్‌ నంబరు, ఈ మెయిల్‌, మొబైల్‌ నంబరు వంటి వివరాలు నమోదు చేసుకోవాలి. మీరు ఏ మీటర్‌  బిల్లింగ్‌ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోగానే మీటర్‌ స్కానింగ్‌ అని చూపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి మీటర్‌లో కేడబ్ల్యూహెచ్‌ అంకెలు వచ్చినప్పుడు స్కాన్‌ చేయాలి. వివరాలన్నీ సక్రమంగా ఉంటే నెక్ట్స్‌ అని చూపిస్తుంది. దానిని నొక్కగానే ఆన్‌లైన్‌లో బిల్లు కనిపిస్తుంది. చెల్లింపు సదుపాయం సైతం యాప్‌లోఅందులో ఉంటుంది.


యాప్‌లో డెమో వీడియోలు..

విద్యుత్‌ వినియోగదారులకు ఈ విషయాలన్నీ అర్థమయ్యేలా యాప్‌లో డెమో వీడియోలను తెలుగులో డిస్కం అధికారులు అందుబాటులో ఉంచారు. ఒక వేళ మీకంటే ముందే మీటర్‌ రీడర్లు వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీస్తే ఆ విషయం యాప్‌లో కనపడుతుంది. మీరే ముందు రీడింగ్‌ స్కాన్‌ చేసి బిల్లు తీసుకుంటే రీడింగ్‌ సిబ్బందికి బిల్‌ జనరేటెడ్‌ అని సమాచారం వెళుతుందని అధికారులు  చెబుతున్నారు. నెలరోజల కంటే ముందే బిల్లు రీడింగ్‌ తీసుకొవాలని ప్రయత్నించిన అది సాధ్యం కాదని, ఆ కంట్రోల్‌ సిస్టమ్‌ విద్యుత్‌ అధికారుల వద్దే ఉంటుందని ఐటీవింగ్‌ అధికారులు తెలిపారు. 


ఎన్పీడీసీఎల్‌లో ఇప్పటికే అమలు..

వరంగల్‌ కేంద్రంగా ఉన్న ఎన్పీడీసీఎల్‌ పరిధిలో ఇప్పటికే సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ విధానం అందుబాటులో తీసుకువచ్చారు. కరోనా నేపథ్యంలో ప్రతినెలా మీటర్‌ రీడింగ్‌ తీసే సమయానికి విద్యుత్‌ సిబ్బంది రాకపోతే ఒకటి రెండు రోజులు చూసి సెల్ఫ్‌మీటర్‌ రీడింగ్‌ యాప్‌తో మీటర్‌లోని వివరాలతో బిల్లు తీసుకుంటున్నారు. యాప్‌లో మీటర్‌ స్కాన్‌ చేస్తే వినియోగదారుడి మొబైల్‌ నంబర్‌కు బిల్లు చేరుతుంది.

Updated Date - 2021-05-17T16:36:34+05:30 IST