ఏఆర్‌ఆర్‌లు వెనక్కి!

ABN , First Publish Date - 2021-12-21T06:53:42+05:30 IST

విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్‌)లకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (టీఎ్‌సఈఆర్‌సీ) షాకిచ్చింది.

ఏఆర్‌ఆర్‌లు వెనక్కి!

  • మూడేళ్ల ఏఆర్‌ఆర్‌లను తిప్పిపంపిన టీఎస్‌ఈఆర్‌సీ
  • టారిఫ్‌ ప్రతిపాదనలు ఇవ్వకుండా 
  • విచారణార్హత లేదని స్పష్టీకరణ
  • 2022-23 టారిఫ్‌ ప్రతిపాదనల దాఖలుకు వారం గడువు
  • 27లోగా సమర్పించాలని డిస్కమ్‌లకు ఆదేశం
  • ఆలస్యానికి కారణాలపైనా పిటిషన్‌ వేయాలని నిర్దేశం


హైదరాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్‌)లకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (టీఎ్‌సఈఆర్‌సీ) షాకిచ్చింది. డిస్కమ్‌లు దాఖలు చేసిన వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్‌ఆర్‌ల)లో మూడేళ్ల ఏఆర్‌ఆర్‌లను వెనక్కి పంపింది. ఏఆర్‌ఆర్‌లకు టారిఫ్‌ ప్రతిపాదనలు పొందుపరచనందున 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఏఆర్‌ఆర్‌లపై విచారణ జరిపే అవకాశం లేదని తెలిపింది. సోమవారం ఏఆర్‌ఆర్‌ల విచారణార్హతపై ఈఆర్‌సీ చైర్మన్‌ తన్నీరు శ్రీరంగారావు, సభ్యుడు మనోహర్‌రాజు, బండారు కృష్ణయ్య హియరింగ్‌ నిర్వహించారు. దీనికి ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డితోపాటు డిస్కమ్‌ల తరపు న్యాయవాదులు హాజరయ్యారు. కాగా, మూడేళ్ల ఏఆర్‌ఆర్‌లకు విచారణార్హత లేనందున వాటిని తీసుకెళ్లాలని ఈఆర్‌సీ చైర్మన్‌ పేర్కొన్నారు.


అయితే ఏఆర్‌ఆర్‌లకు టారిఫ్‌ ప్రతిపాదనలు కలిపి సమర్పిస్తే.. ట్రూ-అప్‌ కింద విచారణ జరపాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. వాటిపై కూడా ప్రభావ వర్గాల (స్టేక్‌ హోల్డర్ల) నుంచి అభిప్రాయాలు/అభ్యంతరాలు/సూచనలు తీసుకున్నాకే నిర్ణయం ఉంటుందన్నారు. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరం టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించేందుకు మాత్రం ఈఆర్‌సీ వారం రోజుల గడువు ఇచ్చింది. టారిఫ్‌ ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నామని, 10 రోజుల గడువు ఇవ్వాలని డిస్కమ్‌లు కోరగా.. ఈఆర్‌సీ అందుకు నిరాకరించింది. ఈ నెల 27లోపు టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతోపాటు టారిఫ్‌ ప్రతిపాదనలు ఆలస్యంగా సమర్పించడానికి గల కారణాలపై పశ్చాతాప (కండోల్డ్‌ డీల్‌) పిటిషన్‌ కూడా వేయాలని నిర్దేశించింది. 


సుమోటోగా విచారణ జరుపుదామా...?

డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్‌లు దాఖలు చేసి.. టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించకపోవడంతో తామే సుమోటోగా విచారణ జరిపి ఉత్తర్వులు ఇస్తే ఎలా ఉంటుందని ఈఆర్‌సీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటిదాకా దేశంలో ఏ డిస్కమ్‌ కూడా సుమోటోగా విచారణ జరిపి.. టారిఫ్‌ ఉత్తర్వులు ఇచ్చిన దాఖలాలు లేవని అధికారులు ఈఆర్‌సీ చైర్మన్‌కు చెప్పినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌లో మాత్రం డిస్కమ్‌లకు ఈఆర్‌సీ జరిమానాలు విధించిందని నివేదించారు. దీంతో టారిఫ్‌ ప్రతిపాదనల దాఖలుకు డిస్కమ్‌లకు ఈ నెల 27 వరకు గడువు ఇచ్చినందున.. అప్పటిదాకా ఆగాలని నిర్ణయించారు. మరోవైపు ఏఆర్‌ఆర్‌ల దాఖలుపై డిస్కమ్‌లు దోబూచులాడుతున్నాయి. ఏఆర్‌ఆర్‌ దాఖలు చేసినా... అందులో టారిఫ్‌ ప్రతిపాదనలు లేకపోవడంతో ఈఆర్‌సీ ముందుకు వెళ్లలేకపోతోంది. సుదీర్ఘ విరామం అనంతరం ఈ ఏడాది నవంబరు 30న 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్‌లు దాఖలు చేసినా.. టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించని విషయం తెలిసిందే. దీంతో ఈనెల 10వ తేదీలోగా టారి్‌ఫలు దాఖలు చేయాలని ఈఆర్‌సీ నోటీసులిచ్చింది.


అయినా.. డిస్కమ్‌లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. ఇక టారిఫ్‌ ప్రతిపాదనలకు తుదిరూపు ఇవ్వడానికి మంత్రుల స్థాయిలో మూడు దఫాలుగా సమావేశం కూడా జరిగింది. ఇందులో ముసాయిదాను మాత్రమే సిద్ధం చేశారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదం తెలపాల్సి ఉండడంతో.. ఆయన పిలుపు కోసం డిస్కమ్‌లు 10 రోజులుగా వేచిచూస్తున్నాయి. తాజాగా ఈ నెల 27 వరకు ఈఆర్‌సీ గడువు ఇవ్వడంతో టారిఫ్‌ ప్రతిపాదనలకు ఈ లోగా సీఎం కేసీఆర్‌ ఆమోదం లభిస్తుందో, లేదో వేచిచూడాల్సి ఉంది.


ఎన్నికల వల్లే ఏఆర్‌ఆర్‌లు ఆలస్యం

ఎన్నికల కారణంగానే సకాలంలో ఏఆర్‌ఆర్‌లను దాఖలు చేయలేకపోయామని ఈఆర్‌సీకి డిస్కమ్‌లు వెల్లడించాయి. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు ఏఆర్‌ఆర్‌ల దాఖలుకు నాలుగుసార్లు ఎన్నికలు అడ్డు వచ్చాయని పేర్కొన్నాయి. 2018 నవంబరులో అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ వల్ల దాఖలు చేయలేదని తెలిపాయి. 2019 జనవరి 9 నుంచి ఈఆర్‌సీ కార్యకలాపాలు జరగలేదని, మార్చి 10 నుంచి మే 23 వరకు లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ఉందని వివరించాయి. అనంతరం వార్షిక లెక్కలు బోర్డులో తేలాల్సి ఉండటం, 2019 డిసెంబరు 23 నుంచి 2020 జనవరి వరకు మునిసిపల్‌ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటం, ఆపై టారిఫ్‌ హేతుబద్ధీకరణపై కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ సిఫారసులపై కసరత్తు చేయడం, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు, 2020 నవంబరు 17 నుంచి డిసెంబరు 4 వరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోడ్‌తో ఆలస్యమైందని పేర్కొన్నాయి. 

Updated Date - 2021-12-21T06:53:42+05:30 IST