విద్యుత్‌ కోతలు.. కష్టాలు

ABN , First Publish Date - 2022-05-27T04:39:38+05:30 IST

అప్రకటిత విద్యుత్‌ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. అదీ అర్ధరాత్రి కరెంట్‌ తీసి ఎప్పుడో తెల్లవారుజామున ఇస్తున్నారు.

విద్యుత్‌ కోతలు.. కష్టాలు
వినుకొండ ప్రభుత్వాస్పత్రిలో కరెంట్‌ కష్టాలు కరెంటు లేకపోవడంతో చీకటిలో చంటి బిడ్డకు టవల్‌తో విసురుతున్న శావల్యాపురం మండలం ముండ్రువారిపాలెం గ్రామానికి చెందిన ఐ.భవాని

అర్ధరాత్రి అనధికార కోతలు

అంధకారం, ఉక్కపోత, దోమలతో అల్లాడిన జనం

వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల అవస్థలు వర్ణనాతీతం

చినరావూరు సబ్‌స్టేషన్‌ ముట్టడించిన విద్యుత్‌ వినియోగదారులు 


తెనాలి రూరల్‌, వినుకొండటౌన్‌, మే 26: అప్రకటిత విద్యుత్‌ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. అదీ అర్ధరాత్రి కరెంట్‌ తీసి ఎప్పుడో తెల్లవారుజామున ఇస్తున్నారు. వేసవి ఉక్కపోత, దోమలతో ప్రజలు జాగారం చేయాల్సి వస్తుంది. వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. కోతలతో ఇళ్లల్లో ఉండలేక ప్రజలు రోడ్లపైకి వచ్చి తిరుగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ కోత విధించారు. తెనాలి, తెనాలి మండలంలో రాత్రి సుమారు 10.30 సమయంలో నిలిచిపోయిన విద్యుత్‌ను గురువారం తెల్లవారుజామున సుమారు 1.30 గంటల సమయంలో పునరుద్ధరించారు. కరెంట్‌ లేక అల్లాడిపోయిన ప్రజలు చినరావూరు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. విద్యుత్‌ తక్షణమే పునరుద్ధరించాలంటూ నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన ప్రజలను పోలీసులు శాంతింపజేసి అక్కడి నుంచి పంపించారు. ప్రజలు ముట్టడిస్తారేమోనని చెంచుపేట కార్యాలయం వద్ద త్రీ టౌన్‌ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.  దోమలు, ఉక్కపోతలతో నిద్ర లేక అల్లాడిన ప్రజలు పలువురు ఆయా ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి విసనకర్రలతో సేదతీరారు. 2500 మెగా వాట్ల విద్యుత్‌ కాస్త 600 మెగా వాట్లకు పడిపోవడంతో విద్యుత్‌ నిలుపుదల చేయకతప్పలేదని అధికారులు తెలిపారు. వినుకొండలో బుధవారం రాత్రి 10.22 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో జనరేటర్‌ లేకపోవడంతో రోగులు అంధకారం,  అల్లాడిపోయారు. దోమలు, ఉక్కపోత మధ్య బాలింతలు చిన్నారులకు కొంగులతో విసురుతూ కనిపించారు. కరెంట్‌ వచ్చే వరకు పలువురు జాగారం చేయాల్సి వచ్చింది. వైద్యశాలలోని ఇన్వర్టర్లు కాలిపోయి ఉన్నా పట్టించుకున్న వారు లేరని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు ప్రాంతంలోని గురజాల, మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో బుధవారం రాత్రి అప్రకటిత కోతతో ప్రజలు అల్లాడిపోయారు. నకరికల్లు మండలంలో రెండు రోజులుగా విద్యుత్‌ కోతలు అధికమయ్యాయి. బుధవారం రాత్రి 3 గంటల పాటు విద్యుత్‌ కోత విధించారు. గురువారం చేజర్ల సబ్‌ స్టేషన్‌ పరిధిలోని కుంకలగుంట, చేజర్లలో మధ్యాహ్నం నిలిచి పోయిన విద్యుత్‌ సరఫరా రాత్రి వరకు పునరుద్ధరించ లేదు. రాజుపాలెం మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం రాత్రి 10 గంటలకు తీసిన కరెంటు మరల అర్ధరాత్రి 2గంటలకు పునరుద్ధరించారు.  




Updated Date - 2022-05-27T04:39:38+05:30 IST