విద్యుత్‌ కోతలు

ABN , First Publish Date - 2022-05-27T05:34:00+05:30 IST

ఒక పక్క భానుడి తీక్షణాలు.. మరోపక్క అప్రకటిత విద్యుత్‌కోతలతో జనం విలవిల్లాడుతున్నారు.

విద్యుత్‌ కోతలు

 గ్రామీణ ప్రాంతాల్లో జనం ఉక్కిరిబిక్కిరి

 మరోవైపు భానుడి ప్రతాపం

ఈదురు గాలులకు పడిపోతున్న విద్యుత్‌ స్థంభాలు


ఏలూరుసిటీ, మే 26: ఒక పక్క భానుడి తీక్షణాలు.. మరోపక్క అప్రకటిత విద్యుత్‌కోతలతో జనం విలవిల్లాడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. దీనికి తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవటంతో  పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో అప్రకటిత విద్యుత్‌ కోతలు విధించక తప్పటం లేదని చెబుతున్నారు. ఎప్పుడు విద్యుత్‌ ఉంటుందో... ఎప్పుడు విద్యుత్‌ పోతుందో తెలియని పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తోంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి నుంచి రెండు గంటల పాటు విద్యుత్‌ కోతలు విధించేవారు. అయితే ఇప్పుడు మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. రాత్రి సమయాల్లో విద్యుత్‌ సరఫరా లేకపోవటం వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలు అల్లాడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో పాటు సాయంత్రం సమయాల్లో  కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటం, గాలులు కారణంగా విద్యుత్‌ స్థంభాలు నేలకొరగటం, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినటం, విద్యుత్‌ లైన్లు తెగిపడటం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ కారణంగా కూడా ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు గంటల తరబడి అంతరాయం ఏర్పడుతోంది. దీనితో పాటు లోడ్‌ రిలీఫ్‌, ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ పేరుతో అప్రకటిత విద్యుత్‌ కోతలను జిల్లాలో చాలా ప్రాంతాల్లో విధిస్తున్నారు. 

పవన విద్యుత్‌ ఉత్పత్తికి లోటు..

రాష్ట్రంలో పవన విద్యుత్‌ ఉత్పత్తికి లోటు ఏర్పడటంతో ఏపీఈపీడీసీఎల్‌ పరిఽధిలో 500 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్‌ లోటు ఏర్పడింది. బుధ, గురువారాలలో ఈ పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. ఈనెల 23వ తేదీన విద్యుత్‌ వినియోగం 21.703 మిలియన్‌ యూనిట్లు వరకు ఉంది. 24వ తేదీన 22.017మిలియన్‌ యూనిట్లు, 25 వతేదీన 13.699 మిలియన్‌ యూనిట్లు వరకు ఉంది. అప్రకటిత విద్యుత్‌ కోతల వల్ల విద్యుత్‌ వినియోగం తక్కువగా జరిగినట్టు విద్యుత్‌ శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈనెల 24వతేదీ రాత్రి జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులుతో కూడిన భారీ వర్షాలు కురియటంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ స్థంభాలు పడిపోయి, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిని, విద్యుత్‌ లైన్లు తెగి పడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌ పునరుద్ధరణకు ఎక్కువ సమయం పట్టటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో బుధవారం నాడు 7మిలియన్‌ యూనిట్లు వరకు విద్యుత్‌ వినియోగం తగ్గింది. గురువారం కూడా ఇదే పరిస్థితి కనబడుతోంది. 


Updated Date - 2022-05-27T05:34:00+05:30 IST