కోతలతో.. కటకట

ABN , First Publish Date - 2022-04-07T05:38:38+05:30 IST

కొత్త జిల్లాలు వచ్చాయి.. వేలమందికి ఉపాధి కల్పన జరగబోతోంది.. అని పాలకులు ఊదరగొట్టారు.

కోతలతో.. కటకట
పొన్నూరులో వేళాపాళ లేకుండా అప్రకటిత కరెంటు కోతలపై నిడుబ్రోలు మెయిన్‌ సెంటర్‌లో రాత్రి 9 గంటలకు ఆందోళన చేస్తున్న యువకులు

విద్యుత్‌ లేక పరిశ్రమ కష్టాలు

దైవాధీనంగా కరెంటు రాకపోకలు 

ఉపాధికి గండితో కార్మికుల ఆకలి కేకలు

అప్రకటిత కోతలు.. ఎండల సెగతో జనం గగ్గోలు

విద్యార్థులకు పరీక్షల కష్టాలు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల వెతలు


ఎండల సెగలకు కరెంట్‌ కోతలు తోడయ్యాయి. బిల్లుల బాదుడు భరిస్తున్నా కోతల బాధలు తప్పడంలేదని ప్రజలు అల్లాడుతుంటే కరెంట్‌పై ఆధారపడి పనులు చేసే కార్మికులకు ఉపాధిలేక విలవిలలాడుతున్నారు. పల్లె పట్టణం అన్న తేడా లేకుండా కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో.. అసలు ఎందుకు తీస్తున్నారో.. ఎవరికీ అర్థంకావడంలేదు. కరోనా కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే పరిశ్రమలు కోలుకుంటుంటే కరెంట్‌ కోతలు చుక్కలు చూపుతున్నాయి. ఉపాధికి గండి పడి వివిధ రంగాలలో  పనిచేస్తూ  పొట్టపోసుకుంటున్న కార్మికులు ఆకలి కేకలతో గగ్గోలు పెడుతున్నారు. 


బాపట్ల(ఆంధ్రజ్యోతి), బాపట్ల, తెనాలి టౌన్‌, ఏప్రిల్‌ 6: కొత్త జిల్లాలు వచ్చాయి.. వేలమందికి ఉపాధి కల్పన జరగబోతోంది.. అని పాలకులు ఊదరగొట్టారు. అయితే కొత్త ఉపాధి సంగతి దేవుడెరుగు కరెంట్‌కోతలతో ఇప్పటికే ఉన్న ఉపాఽధులే ప్రమాదంలో పడ్డాయి. నిర్ణీత సమయం లేకుండా రోజుకు 4నుంచి 5గంటల పాటు వేళాపాళా లేని కోతలతో చిన్న, మధ్య తరగతి వ్యాపారులు, కరెంటుపై ఆధారపడి పనిచేసే కార్మికులు నెత్తిన చేతులు పెట్టుకుని ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది. విద్యుత్‌ కోతలతో ఆటోనగర్‌ వంటి పారిశ్రామిక కేంద్రాలు పనులు లేక వెలవెలపోతుండగా కార్మికులు అల్లాడుతున్నారు. వేసవిలో విద్యుత్‌ వాడకం పెరుగుతుందని తెలిసినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోనందునే కోతలు ప్రమాదకరస్థాయికి వెళ్లాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. కరెంటు తీయడం వరకే మావంతు తిరిగి ఎప్పుడొస్తుందో మేం చెప్పలేమంటూ విద్యుత్‌ సిబ్బంది పలాయనం చిత్తగించేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ మీద ఆధారపడిన    పనులు చేసుకునే కార్మికుల కడుపు కాలిపోతోంది. ఇక పరీక్షల సీజన్‌ ప్రారంభమై విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. అయితే కరెంట్‌ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఉక్కపోత.. మరోవైపు కరెంటు కోతలతో విద్యార్థుల చదువుకు ఆటంకంగా మారుతుంది. ఇక వర్క్‌ఫ్రమ్‌ హోం చేసే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కష్టాలు మరోరకంగా ఉన్నాయి.  పట్టణాల పరిస్థితి పక్కన పెడితే గ్రామాల్లో మంగళవారం అర్ధరాత్రి 1.10 నిమిషాలకు కరెంటు తీసి బుధవారం ఉదయం 6.10 ఇచ్చారు. మళ్లీ 10 గంటలకు తీసి 2 గంటలు తర్వాత ఇచ్చారు. కరెంటు కోతలు దారుణంగా ఉంటున్నాయని రోజు మొత్తం మీద ఏడెనిమిది గంటలు మాత్రమే ఉంటుందని గ్రామీణులు వాపోతున్నారు.


బాపట్ల జిల్లాలో 80,000 మందిపై ప్రభావం 

బాపట్ల జిల్లా వ్యాప్తంగా కరెంట్‌పై ఆధారపడి వివిధ అసంఘటిత రంగాల్లో దాదాపు 80,000 మందికిపైగా కార్మికులు జీవనం సాగిస్తున్నారు. చేనేత, ఆక్వా రంగాలతో పాటు ఐస్‌ ఫ్యాక్టరీలు, సెలూన్‌, టైలర్స్‌, కార్పెంటర్స్‌, ఎలక్ట్రిక్‌ వర్క్‌ చేసేవారితో పాటు చిన్నా చితకపనులు చేసుకుని కడుపు నింపుకునే వేలాదిమందిపై ఈ కరెంట్‌ కోతల ప్రభావం పరోక్షంగా పడి అల్లాడిపోతున్నారు. చిరువృత్తులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే ఎంతోమంది అసంఘటితరంగ కార్మికుల ఆదాయం కరెంటుకోతలతో తెగ్గోసుకుపోతుంది. సగటున వారి ఆదాయంలో 500 నుంచి రూ.1000 వరకు గండిపడుతుంది. అద్దంకి  ప్రాంతంలోని గ్రానెట్‌ ఫ్యాక్టరీల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి వేలాది మంది రోజు కూలిపై ఆధారపడి పని చేస్తుంటారు. కరెంట్‌కోతలతో ఆయా ఫ్యాక్టరీల్లో పనులు నిలిచిపోవడంతో వీరి కూలికి కోత పడుతుంటుంది. భట్టిప్రోలు, వేమూరు, రేపల్లె, చీరాల ప్రాంతాల్లో చేనేత రంగంపై ఆధారపడి 8 వేల కుటుంబాలు బతుకీడిస్తున్నట్లు  అంచనా. కరెంటు ఉంటేనే మగ్గం నడుస్తుంది. అసలే జీవనోపాధి అంతంతమాత్రంగా ఉంటే మూలిగే నక్కపై  తాటికాయ పడ్డ చందాన కరెంటు కోతలు వీరిని మరింత అగాధంలోకి తోసేస్తున్నాయి. కరోనాతో ఆసాంతం కుదేలయిపోయామని ఇప్పుడిప్పుడే కాలూ చేయి కూడా దీసుకుంటుంటే ఈ కరెంటు కోతలు మాకు అశనిపాతంగా తయారయ్యాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లాలో 38 వేల ఎకరాల్లో జరుగుతున్న ఆక్వా సాగుపైనా కరెంట్‌ కోతల ప్రభావం పడింది. ఏరియేటర్స్‌ పని చేయక సాగుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. బాపట్ల జిల్లాలోని నాలుగు ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్లు కూడా పని చేయక వేల మంది కార్మికుల ఉపాధికి గండి పడుతుంది.   


రైతుల పరిస్థితి మరీ దారుణం 

అప్రకటిత విద్యుత్‌ కోతలతో చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి మరీదారుణంగా ఉంది. గంటలకొద్ది కోతలతో బాపట్ల, తెనాలి ప్రాంతాల్లో మిర్చి, వేరుశనగా, ఆకుకూరలు, పూలతోటలు సాగు చేసే రైతులు సకాలంలో నీరుపెట్టుకోలేకపోతున్నారు. ఎండలు మండుతున్న పరిస్థితుల్లో నీరు లేక మొక్కలు ఎండుముఖంపడుతున్నాయి. గతంలో  దొరువులు తవ్వి బుంగపోతతో ఏవిధంగా అయితే సాగు చేసుకున్నామో అదే పరిస్థితి ప్రస్తుతం మళ్లీ వచ్చిందని రైతులు వాపోతున్నారు.  

  

 ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వెతలే 

బల్లికురవ: అప్రకటిత విద్యుత్‌ కోతల ప్రభావం ప్రభుత్వ కార్యాలయాలపైనా పడింది. కరెంటు లేక పోవడంతో ఉద్యోగులు ఖాళీగా కూర్చొంటున్నారు. ఇక సుదూర ప్రాంతాల నుంచి వివిధ పనులు కోసం వచ్చిన వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు లేదు మేము ఏమీ చేయలేమని ఉద్యోగుల సమాధానాలతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు ఎప్పుడు  వస్తుందా తమ పని ఎప్పుడు చేస్తారా అని ప్రజలు ఆయా కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బల్లికురవలో మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యుత్‌ కోత విధించారు. బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్‌ సరఫరా లేదు. బ్యాంకుల్లో కంప్యూటర్లు మొరాయించి కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రజలకు సమాధానం చెప్పలేక మీసేవ కేంద్రాల నిర్వాహకులు మూసేస్తున్నారు.  

 

Updated Date - 2022-04-07T05:38:38+05:30 IST