వానల్లోనూ.. చీకట్లే

ABN , First Publish Date - 2021-09-07T05:06:13+05:30 IST

రోజూ జోరున వానలు పడుతున్నాయి. విద్యుత్‌ వాడకం కూడా సగానికి తగ్గిపోయింది.

వానల్లోనూ.. చీకట్లే

వర్షాకాలంలో విద్యుత్‌ కోతలు

వాడకం తక్కువగా ఉన్నా కటకటే

చీకటి.. దోమలతో అల్లాడుతున్న జనం

ముందుచూపులేక.. కరెంటు కొనలేక కోతలు


పుష్కలంగా వానలు పడుతున్నాయి. వాతావరణం చల్లగా ఉంది. విద్యుత్‌ వాడకం కూడా తగ్గింది. అయినా విద్యుత్‌ కటకటే. పల్లెల్లో అయితే ఎప్పుడు కరెంటు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. రాత్రి సమయాల్లో కరెంట్‌ కోతలతో అంధకారం నెలకొంటుంది. దీంతో పాటు దోమలకు జనానికి కంటిమీద కునుకు లేక అల్లాడిపోతున్నారు. ఒకవైపు జడిపిస్తోన్న జ్వరాలు.. మరోవైపు దోమలతో జనం భీతిల్లిపోతున్నారు. వర్షాలు, వరదల్లో కూడా ఈ చీకటి బతుకుల ఖర్మేంటంటూ జనం మండిపడుతున్నారు. కేవలం ముందుచూపు లేకపోవటం, అవసరాలకు సరిపడా విద్యుత్‌ను కొనుగోలు చేయలేని స్థితిలో సీపీడీసీఎల్‌ ఉండటమే ఈ కోతలకు కారణమని జనం విమర్శిస్తున్నారు. ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌(ఈఎల్‌ఆర్‌) పేరుతో నిత్యం రెండు గంటలకు పైగా విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నారు. విద్యుత్‌ కోతలే ఉండవని చెప్పిన సర్కారు ఇప్పుడు నోరు మెదపకపోవటం, అసలు పట్టించుకోకపోవటం విడ్డూరమే.  


 తెనాలి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రోజూ జోరున వానలు పడుతున్నాయి. విద్యుత్‌ వాడకం కూడా సగానికి తగ్గిపోయింది. అయినా విద్యుత్‌ కోతలు షరామామూలుగా ఉంటున్నాయి. దీంతో జనం అల్లాడుతున్నారు. ప్రస్తుతం గ్రామాలతో మొదలైన కోతలు పట్టణాలకూ చేరడానికి ఎంతో సమయం లేదు. జిల్లాలో మండుటెండల్లో 15 వేల మెగావాట్ల వరకు విద్యుత్‌ అవసరం ఉంటుంది. ప్రస్తుతం వర్షాల కారణంగా 8 వేల నుంచి 9 వేల మెగావాట్ల మాత్రమే డిమాండ్‌ ఉంది. అయితే ఇప్పుడు అది కూడా కొరతగా మారింది. జిల్లాకు సెంట్రల్‌ గ్రిడ్‌ నుంచి 2,400 మెగావాట్ల అందుతుంటే, మరో 2,800 మెగావాట్లు సోలార్‌, 4000 మెగావాట్లు విండ్‌ పవర్‌ ద్వారా సమకూరుతుంది. ధర్మల్‌, జలవిద్యుత్‌ ద్వారా మరో 7,200 మెగావాట్ల విద్యుత్‌ సమకూరుతుంది. అయితే సెంట్రల్‌ గ్రిడ్‌, విండ్‌, సోలార్‌ ద్వారా అందే 9,200 మెగావాట్ల విద్యుత్‌ ప్రస్తుత అవసరాలకు సరిపోతుంది. కానీ వర్షాల కారణంగా సోలార్‌, విండ్‌ పవర్‌ జనరేషన్‌ తగ్గిపోతోంది. ఈ లోటును భర్తీ చేద్దామన్నా ధర్మల్‌ పవర్‌ ఉత్పత్తి చెయ్యటం ఒక్కటే మార్గం. అయితే వర్షాల్లో బొగ్గుతో విద్యుత్‌ ఉత్పత్తి కూడా ఖర్చు, ఇబ్బందులతో కూడుకున్నదే. జలవిద్యుత్‌ విషయంలోనూ చిక్కులు ఏర్పడటంతో ఈ లోటును తీర్చడానికి ప్రభుత్వం ముందుచూపు ధోరణితో వ్యవహరించాల్సి ఉన్నా, పట్టించుకోని పరిస్థితి. దీనివల్లే కోతలు తప్పటంలేదు. ముందుచూపు లేమి, కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకోక కోతల వైపు దృష్టి సారిస్తున్నారు. విద్యుత్‌ డిమాండ్‌ ఎంత.. దానికి అనుగుణంగా ఉత్పత్తి ఉందా లేదా అనేది ముందే గుర్తించి దానికి అనుగుణంగా అదనపు విద్యుత్‌ కొనుగోలుకు ఒక ప్రణాళిక సిద్ధ చేయటం పరిపాటి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. అసలు కొనుగోలు చేసి విద్యుత్‌ కోతలను అరికట్టాలనే ఆలోచనే అధికారుల్లో కనిపించటంలేదు.


కొనలేక.. సరఫరాలో కోతలు

ప్రస్తుత అవసరాలకు సరిపడా విద్యుత్‌ ఉత్పత్తి లేకపోవటంతో కోతలు విధిస్తున్నారు. అయితే విద్యుత్‌ బయటి నుంచి కొనుగోలు చెయ్యాలన్నా ఇప్పటి పరిస్థితుల్లో పెద్దగా కొరత ఉండదు. అయితే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుందనే కారణంతో కోతలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.  ఒక్కో డిస్ట్రిబ్యూషన్‌ స్టేషన్‌ పరిఽధిలో నిత్యం గంటన్నర నుంచి రెండు గంటలు తగ్గకుండా విద్యుత్‌ సరఫరాలో కోత విధిస్తున్నారు. సాధారణంగా ఒక్కో యూనిట్‌ గ్రామాల్లో వాడకానికి రూ.3 నుంచి రూ.5 వరకు ఆదాయం వస్తుంటే ఖర్చు మాత్రం రూ.8 వరకు పడుతుంది. బయట కొనుగోలు చేయ్యాలంటే యూనిట్‌కు రూ.9 నుంచి రూ.10 వరకు ఖర్చు చేయాలి. అదికూడా ఒక రోజు ముందే కొనుగోలు చెయ్యాలి. వాడకం తక్కువగా ఉండే పగటిపూట ఒక విధంగా, ఎక్కువ వాడకం ఉండే రాత్రి వేళల్లో ఒక విధంగా రేట్లు ఉంటాయి. 24 గంటల ముందే బిడ్డింగ్‌ వేసుకోవాలి. విద్యుత్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు వేసే బిడ్డింగ్‌ రేటుకంటే మరొకరు ఎక్కువగా వేస్తే వారికే సరఫరా ఖాయం చేస్తారు. పైగా యూనిట్‌కు రూ.10 పైగా చెల్లించాల్సి రావటం, అంత డబ్బు ఖర్చు చేయటం ఎందుకనే ఆలోచనతో కొనుగోలు ఊసే వదిలేసి, కోతలకే సర్కారు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వం విద్యుత్‌ సరఫరా విషయంలో వ్యాపార ధోరణిలోనే వ్యవహరిస్తుంది. ఇది గ్రామాలకు శాపంగా మారింది. సాధారణంగా గ్రామాలలో యూనిట్‌కు వచ్చేది రూ.3 మాత్రమే. అదే పట్టణాల్లో రూ.7.50 నుంచి రూ.10 వరకు ఒక్కో యూనిట్‌కు వస్తుంటే, పరిశ్రమల నుంచి రూ.11 పైనే ఆదాయం వస్తోంది. అందుకే మొదటి ప్రాధాన్యం పట్టణాలకు, పరిశ్రమలకే ఇస్తున్నారు. గ్రామాలు అంధకారంలో ఉన్నా, జనం అవస్థలు పడుతున్నా గ్రామాలకు విద్యుత్‌ సరఫరాను నిలిపేస్తున్నారు. గ్రామాల్లో రెండు గంటలు సరఫరాలో కోత విధిస్తుంటే, మున్సిపల్‌ కేంద్రాలు, చిన్న పట్టణాల్లో అప్రకటితంగా కోతలు వేస్తూనే ఉన్నారు. ఇవి చాలవన్నట్టు వర్షాలకు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లు, ఇన్సులేటర్‌లు దెబ్బతిని పోవటంతో ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలో అత్యవసర కోతలూ తప్పటంలేదు. మొత్తంమీద గ్రామాల్లో ఈఎల్‌ఆర్‌, రిపేర్ల కారణాలతో రెండు నుంచి మూడున్నర గంటల వరకు రోజువారి కోతలు గ్రామాలకు విధిస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితులు, వర్షాల కారణంగా దోమలు పెరిగి గ్రామాలు జ్వరాలతో మంచం పడుతున్నాయి. విద్యుత్‌ కోతల పుణ్యమా అని పల్లెవాసులు నరకం అనుభవిస్తున్నారు. అధికారులు మాత్రం కోతలకు కారణాలేమని అడిగితే మాత్రం తేలికగా ఈఎల్‌ఆర్‌ అని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు.  


Updated Date - 2021-09-07T05:06:13+05:30 IST