ట్రూ అప్‌.. షాక్‌

ABN , First Publish Date - 2022-08-03T05:48:19+05:30 IST

బాదుడే బాదుడు.. ఈ జాబితాలో ఈ సారి విద్యుత్‌ వినియోగదారులు చేరారు. విద్యుత్‌ సంస్థలను నష్టాల నుంచి గట్టెక్కించాలని ఆ భారం వినియోగదారులే భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ట్రూ అప్‌.. షాక్‌

మరోసారి బాదుడే బాదుడు

వినియోగదారులపై విద్యుత్‌ పిడుగు

ఈసారి వరుసగా 36 నెలలు బాదుడు 

ఉమ్మడి జిల్లాపై నెలకు రూ.6 కోట్ల భారం 

ఈ నెలలో ఇచ్చే బిల్లులోనే కలిపి వసూలు

 అద్దె ఇళ్లలో ఉండే వారి పరిస్థితి మరీ దారుణం


గుంటూరు, ఆగస్టు 2: బాదుడే బాదుడు.. ఈ జాబితాలో ఈ సారి విద్యుత్‌ వినియోగదారులు చేరారు. విద్యుత్‌ సంస్థలను నష్టాల నుంచి గట్టెక్కించాలని ఆ భారం వినియోగదారులే భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ట్రూ అప్‌ చార్జీల భారం మోసేందుకు సిద్ధమైంది. గతంలో ప్రజా వ్యతిరేకతతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఈ సారి ఏకంగా 36 నెలలు పాటు ట్రూ అప్‌ చార్జీలను వసూలు చేసేందుకు ముందుడుగు వేసింది. వాణిజ్య, గృహ వినియోగదారుల్లో అన్ని కేటగిరీల వారినీ ట్రూ అప్‌ చార్జీల జాబితాలో చేర్చారు. ప్రస్తుతం ఆగస్టు నెలలో అందజేస్తోన్న బిల్లులతో కలిపి ట్రూ అప్‌ చార్జీలను వసూలు చేయనున్నట్లు విద్యుత్‌శాఖ వర్గాలు ధృవీకరించాయి.   ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి ఆదేశానుసారం 2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల కాలంలో వినియోగించిన యూనిట్లను లెక్కించి దానిని 22 పైసలతో గుణించి వచ్చిన మొత్తాన్ని 36 దఫాలుగా చెల్లించే పద్ధతిలో ట్రూ అప్‌ చార్జీల పేరుతో బాదుడుకు శ్రీకారం చుట్టారు. ట్రూ అప్‌ చార్జీల బాదుడుతో విద్యుత్‌ బిల్లులు మరోసారి షాక్‌ కొట్టనున్నాయి. ఈ నెల బిల్లులతో ప్రారంభించి వరుసగా 36 నెలల పాటు అంటే 2025 జూలై వరకు వసూలు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 14.50 లక్షల మంది వినియోగదారులపై నెలకు సరాసరిన రూ.6 కోట్లపైనే ట్రూ అప్‌ చార్జీల భారం పడుతుందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. 36 నెలల పాటు అంటే రూ.226 కోట్లు వసూలుకు విద్యుత్‌శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. దీంతో సొంత ఇళ్ల వారి కంటే అద్దె ఇళ్లలో ఉండే వారి పరిస్థితి దారుణంగా ఉండనున్నది. 2014-2019 కాలంలో ఎవరో వినియోగించిన విద్యుత్‌కు తాము ఇప్పుడు ట్రూ అప్‌ చార్జీలు ఎలా చెల్లించాలన్నదే పెద్ద సమస్యగా మారింది. 


గత ఏడాదిలో వెనక్కి తగ్గి మరోసారి..

గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ట్రూ అప్‌ చార్జీలను ప్రభుత్వం వసూలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. అంతేగాక అప్పట్లో కొందరు వినియోగదారులు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. దాంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ట్రూ అప్‌ చార్జీలను గత ఏడాది నవంబరులో రెవెన్యూ జర్నల్‌ ద్వారా సర్‌ చార్జీలతో పాటు బిల్లుల్లో తిరిగి జమ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సైలెంట్‌గా మరోసారి ప్రభుత్వం ట్రూ అప్‌ చార్జీల భారాన్ని మోపేందుకు సిద్ధమవటం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. 

 

 

Updated Date - 2022-08-03T05:48:19+05:30 IST