బిల్లులు.. బాబోయ్‌

ABN , First Publish Date - 2021-09-07T05:30:00+05:30 IST

బాదుడే.. బాదుడు.. అన్నట్లుగా ప్రభుత్వాల తీరు ఉంది. కరోనాతో జీవనం కష్టంగా మారిన పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన పాలకులు సామాన్య, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోయేలా ధరలను బాదేస్తున్నారు.

బిల్లులు.. బాబోయ్‌

సామాన్యులకు కరెంట్‌ షాక్‌

విద్యుత్‌ చార్జీల బాదుడే.. బాదుడు

వినియోగం తగ్గినా పెరిగిన బిల్లులు

ట్రూ అప్‌ చార్జీల పేరుతో అదనపు వడ్డన

40 శాతానికి పైగా పెరిగిన విద్యుత్‌ బిల్లులు 

వినియోగదారులపై రూ.25 కోట్లకు పైగా భారం

 

కరోనాతో ఉపాధి లేక కొందరు.. ఆదాయాలు తగ్గి మరికొందరు అల్లాడుతున్నారు. ఇలాంటి వారికి ఉపశమనం కలిగించేలా చూడాలి. కాని దొరికారన్నట్లుగా ధరలతో బాదేస్తున్నారు. ఇప్పటికే పెరిగిపోయిన పెట్రోలు, గ్యాస్‌, నిత్యావసరాల ధరలకు తాజాగా కరెంట్‌ బిల్లులు బెంబేలెత్తిస్తున్నాయి. కరెంటు బిల్లులను చూస్తేనే షాక్‌ కొట్టేలా ఉన్నాయి. కరోనా కష్టకాలంలో కుటుంబాన్ని నెట్టుకురాలేక  ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాల వారు పెరిగిన విద్యుత్‌ బిల్లులను చూసి గగ్గోలు పెడుతున్నారు. గత నెలకు, ఈ నెలకు వచ్చిన వ్యత్యాసంతో బిల్లులు చెల్లించలేక లబోదిబోమంటున్నారు. విద్యుత్‌ వినియోగం పెరిగి బిల్లు పెరిగితే ఒక అర్థం ఉంటుంది.. కాని ఇక్కడ మాత్రం వినియోగం తగ్గినా 40 శాతానికిపైగా పెరిగిన చార్జీలతో వినియోగదారుల జేబులకు భారీగా చిల్లుపెడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కిలోవాట్‌కు రూ.10 చొప్పున ఫిక్స్‌డ్‌ చార్జీలు విధించిన ప్రభుత్వం తాజాగా ట్రూ అప్‌ చార్జీలను యూనిట్‌కు రూ.1.23 అదనంగా మోపింది.  


(ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్‌)

బాదుడే.. బాదుడు.. అన్నట్లుగా ప్రభుత్వాల తీరు ఉంది. కరోనాతో జీవనం కష్టంగా మారిన పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన పాలకులు సామాన్య, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోయేలా ధరలను బాదేస్తున్నారు. అధికారంలోకి వస్తే కరెంటు బిల్లుల భారం తగ్గిస్తామన్న పాలకులు అందుకు భిన్నంగా రకరకాల చార్జీల పేరుతో అదనపు భారం మోపుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు బిల్లు చేతికి రావటంతో సామాన్య జనం బెంబేలెత్తుతున్నారు. తాజాగా ట్రూ అప్‌ చార్జీల పేరుతో యూనిట్‌కు రూ.1.23 అదనంగా పెంచి వసూలు చేస్తుంది. ఇది ఈ ఒక్క నెలతో అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఈ ట్రూ అప్‌ చార్జీలు వచ్చే ఏడాది మార్చి వరకు వసూలు చేయనున్నట్లు విద్యుత్‌శాఖ ప్రకటించింది. పెంచిన ట్రూ అప్‌ చార్జీలను గృహావసరాలతో పాటు వాణిజ్య వినియోగదారులతో పాటు అన్నివర్గాల వారిపై భారం మోపారు. ఆగస్టులో వినియోగించిన విద్యుత్‌ యూనిట్‌కు రూ.1.23 ట్రూ అప్‌ చార్జీలను కూడా కలిపి బిల్లులు వస్తున్నాయి. ప్రతి నెలా జిల్లాలో సుమారు 243 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరుగుతోంది. తద్వారా ట్రూ అప్‌ చార్జీలతో జిల్లాలో వినియోగదారులపై నెలకు ఇంచుమించు రూ.25 కోట్లకుపైగా అదనపు భారం పడనున్నది. 


బాదుడే బాదుడు..

- చిలకలూరిపేటకి చెందిన జీ శ్రీనివాసరావు ఓ కంపెనీలో సూపర్‌వైజర్‌. గత నెలలో 196 యూనిట్లకు  రూ.672 బిల్లు వచ్చింది. ప్రతి నెలా రూ.300ల నుంచి రూ.400లకు మించి బిల్లు రాదు. అయితే రూ.672 బిల్లు రావడంతో విద్యుత్‌ ఆదా పాటించారు. దీనితో  విద్యుత్‌ వినియోగం పాటించడంతో ఈ నెలలో 159 యూనిట్లకే పరిమితమయ్యారు. బిల్లు రూ.450 మించదని భావించగా.. రూ.733 రావడంతో అవాక్కయ్యారు. 

- తెనాలిలో వృద్ధాప్య పింఛన్‌తో జీవనం సాగించే సరస్వతమ్మకు ప్రతి నెలా రూ.250 నుంచి 300 వచ్చే కరెంటు బిల్లు ఈ నెల 500 దాటింది. రూ.8 వేల జీతంతో కుటుంబాన్ని నెట్టుకువచ్చే ప్రైవేటు ఉద్యోగి అయిన రామారావు ఇంటికి   600 వరకు వచ్చే బిల్లు ఈ నెల రూ.1000 వచ్చింది. తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన మొహిద్‌ యోకోబ్‌ గత ఆగస్ట్‌ నెల బిల్లు 281 రాగా సెప్టెంబరు 1510 వచ్చింది. వ్యవసాయం చేసుకునే తనకు ఇంత బిల్లు రావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యాడు. 

- తాడికొండలో ఓ ఇంటికి ఆగస్టులో 204 యూనిట్లు విద్యుత్‌ను వినియోగించుకుంటే బిల్లు రూ.760 వచ్చింది.   సెప్టెంబరులో 206 యూనిట్లకు ఏకంగా రూ.1027 బిల్లు పెరిగింది. 


ట్రూ అప్‌ చార్జీలంటే

విద్యుత్‌ సంస్థలు ఏటా ఉత్పత్తి సంస్థలకు చెల్లించే మొత్తం, సిబ్బంది జీతాలు, పంపిణీ నష్టాలు, బొగ్గు కొనుగోలు వ్యయం, సరఫరాలో నాణ్యత పెంచడానికి చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి అనుసరించాల్సిన విధానాలను ఏపీఈఆర్‌సీ ప్రతి ఏటా ఆమోదించే టారిఫ్‌ ఆర్డర్‌లో సూచిస్తుంది. ఈ మేరకు డిస్కంలు వినియోగదారుల నుంచి చార్జీలు వసూలు చేస్తాయి. అయితే ఏపీఈఆర్‌సీ ఆమోదించిన అంచనాలకు మించి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అయ్యే అదనపు వ్యయం మొత్తాన్ని ఏటా ట్రూ అప్‌ చార్జీల పేరిట వసూలుకు డిస్కంలకు అనుమతిస్తుంది. 


8 నెలలు వరుస బాదుడు

ట్రూ అప్‌ చార్జీల పేరుతో 8 నెలల పాటు అదనపు బాదుడుకు రంగం సిద్ధమైంది. ఆగస్టులో యూనిట్‌కు రూ.1.23 కాగా సెప్టెంబరులో రూ.1.27, అక్టోబరులో రూ.1.19, నవంబరులో రూ.1.24లు, డిసెంబరులో రూ.1.24, వచ్చే ఏడాది జనవరిలో యూనిట్‌కు రూ.1.19, ఫిబ్రవరిలో రూ.1.21, మార్చిలో యూనిట్‌కు 1.11 చార్జీల వసూలు చేయనున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు.


పొన్నూరులో ఏడాదిగా

పొన్నూరు ఎలక్ట్రిసిటీ సబ్‌డివిజన్‌ పరిధిలో గత ఏడాది నుంచే కెపాసిటర్‌ సర్‌ చార్జీల పేరుతో వినియోగదారులపై భారం మోపారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో తొలిగా ఆగస్టు నెల నుంచి ఇంధన కొరత, కెపాసిటర్‌ సర్‌చార్జీలను వసూలు చేస్తున్నారు. దీంతో  సబ్‌డివిజన్‌ పరిధిలో నెలకు అదనంగా రూ.36 లక్షలు భారం పడింది. ఈ నెల నుంచి వీటికి అదనంగా ట్రూ అప్‌ భారం పడుతుంది. 


అద్దె రూ.1500, కరెంటు బిల్లు రూ.3 వేలు

రేకుల ఇంట్లో అద్దెకు ఉంటున్నాను. అద్దె రూ.1500 అయితే కరెంటు బిల్లు ఈ నెలలో రూ.3 వేలు వచ్చింది. ఫ్యాన్‌, టీవీ, రెండు బల్బులు తప్ప మరేమీ లేవు. ఏపూటకాపూట కూలిపనులకు వెళ్తాము. వచ్చిన సంపాదనంతా కరెంట్‌ బిల్లుకే సరిపోతుంది. మరి బతికేది ఎలానో అర్థం కావడంలేదు. 

- కుమారి, పిడుగురాళ్ల

 

కూలికి వెళ్తాం.. బిల్లేమో రూ.978

మేము కూలికి వెళ్లి పనులు చేసుకుని జీవనం సాగిస్తాం. గత నెలలో రూ.789 బిల్లు వచ్చింది. ఈ నెలలో 200 యూనిట్లకు రూ.732 బిల్లు వేసి ట్రూ అప్‌ ఛార్జీ పేరుతో అదనంగా రూ.246 కలిపారు. దీంతో బిల్లు ఏకంగా రూ.978కు చేరింది. ఇప్పటికే గ్యాస్‌, నిత్యావసరాల ధరలు పెరిగాయి. ఇలా పెంచుకుంటూ పోతే కూలిపనులు చేసుకునే మాలాంటి వాళ్లు ఎలా బతకాలి. ఇంతంత కరెంటు బిల్లులు వస్తే ఎలా కట్టాలి. 

-  షేక్‌ జాన్‌పీరా, నగరంపాలెం, గుంటూరు

 


======================================================================================

Updated Date - 2021-09-07T05:30:00+05:30 IST