బకాయిలు.. రూ.70 లక్షలు

ABN , First Publish Date - 2022-07-26T06:06:21+05:30 IST

నరసరావుపేట మున్సిపాల్టీకి విద్యుత్‌ బకాయిలు గుదిబండగా మారాయి. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో అవి పేరుకుపోయాయి.

బకాయిలు.. రూ.70 లక్షలు
నరసరావుపేట మునిసిపల్‌ కార్యాలయం

మున్సిపాల్టీకి విద్యుత్‌ శాఖ నోటీసు

బిల్లులు చెల్లింపులకు ముగిసిన గడువు

విద్యుత్‌ కట్‌ చేస్తామన్న విద్యుత్‌ అధికారులు

నేటి వరకు గడువు కోరిన మున్సిపల్‌ అధికారులు 



నరసరావుపేట, జూలై 25: నరసరావుపేట మున్సిపాల్టీకి విద్యుత్‌ బకాయిలు గుదిబండగా మారాయి. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో అవి పేరుకుపోయాయి. బిల్లుల బకాయి రూ.70 లక్షలకు చేరింది. భారీగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో వసూళ్లపై విద్యుత్‌ శాఖ దృష్టి సారించింది. ఈ క్రమంలో బిల్లులు చెల్లించాలని విద్యుత్‌ శాఖ మున్సిపాలిటీకి నోటీసు జారీ చేసింది. తక్షణం బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్లు కట్‌ చేసి విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. నెలల తరబడి బిల్లులు చెల్లించడంలో మున్సిపల్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే నోటీసుల జారీకి కారణంగా మారింది. విద్యుత్‌ బిల్లుల బకాయిలు చెల్లింపులకు మూడు రోజుల గడువు ఇచ్చింది. ఆ గడువు కూడా సోమవారంతో ముగిసింది. అయితే విద్యుత్‌ శాఖ ఇచ్చిన గుడువులోగా మున్సిపల్‌ అధికారులు బిల్లులు చెల్లించలేదు. పైగా మంగళవారం వరకు కోరారు. అందుకు విద్యుత్‌ శాఖ అధికారులు అంగీకరించారు. ఈ ప్రకారం మంగళవారం బకాయిలు చెల్లించకపోతే బుధవారం విద్యుత్‌ కనెక్షన్లు తొలగించనున్నట్లు సమాచారం. అయితే ఒక మొత్తంగా రూ.70 లక్షలు చెల్లించే పరిస్థితి మున్సిపాలిటీలో లేనట్లు తెలుస్తుంది. 14వ ఆర్థిక సంఘం నిధులు నుంచి జిల్లాలోని ఇతర మున్సిపాల్టీలు విద్యుత్‌ బిల్లులను చెల్లించాయి. నరసరావుపేట మున్సిపాల్టీ అధికారులు మాత్రం సదరు నిధులను ఇతర పనులకు మళ్లించారు. దీంతో విద్యుత్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పైగా బిల్లులను చెల్లించడాన్ని అధికారులు విస్మరించారు. ప్రస్తుతం బిల్లులను మున్సిపల్‌ సాధారణ నిధుల నుంచి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఆ స్థాయిలో మున్సిపాల్టీలో నిధులు లేనట్లు సమాచారం. మరో వారం రోజుల్లో మున్సిపాల్టీ కాంట్రాక్ట్‌ కార్మికులకు, పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలి. ఈ పరిస్థితుల్లో వారి కోసం ఉంచిన నిధులను విద్యుత్‌ బకాయిలకు వినియోగిస్తే కార్మికుల జీతాల చెల్లింపు నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీంతో విద్యుత్‌ బకాయిలు చెల్లించే అంశంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొంతమొత్తం చెల్లించి మరికొంత గడువు కోరాలనే యోచనలో అధికారులు ఉన్నారు. ఇందుకు విద్యుత్‌ శాఖ అంగీకరిస్తుందో లేదో చూడాలి. బకాయి మొత్తం చెల్లించాలని సదరు శాఖ పట్టు పడితే మున్సిపాల్టీ ఇరకాటంలో పడే అవకాశం ఉంది. బకాయి మొత్తం చెల్లించకపోతే విద్యుత్‌ కనెక్షన్లు తొలగిస్తామని విద్యుత్‌ అధికారులు తేల్చిచెబుతున్నారు. ఇదే జరిగితే నీటి సరఫరా, వీధి దీపాలకు విద్యుత్‌ లేక ప్రజలు ఇక్కట్లు పడటం ఖాయం. ఇరు శాఖల అధికారులు మధ్య బకాయిల విషయంలో జరుగుతున్న చర్చలు ఫలించని పక్షంలో ప్రజలు ఇక్కట్లు పడే అవకాశాలే ఎక్కువుగా ఉన్నాయి. నీటి సరఫరా, వీధి దీపాలు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల వరకు విద్యుత్‌ శాఖ అధికారులు మినహాయింపు ఇస్తారో లేదో చూడాలి. రూ.70 లక్షల బకాయిలు చెల్లించాలని మున్సిపాలిటీకి నోటీసులు ఇచ్చామని, ఇచ్చిన గడువు కూడా మంగళవారంతో ముగుస్తుందని విద్యుత్‌ శాఖ ఏడీ ఏడుకొండలు తెలిపారు.  బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్‌ కమిషనర్‌ డీ రవీంద్ర తెలిపారు. 


Updated Date - 2022-07-26T06:06:21+05:30 IST