కావాలనే తప్పించారా?

ABN , First Publish Date - 2021-05-15T09:26:57+05:30 IST

భారత మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవి నుంచి డబ్ల్యూవీ రామన్‌ను తప్పించడం చర్చనీయాంశమైంది.

కావాలనే తప్పించారా?

రామన్‌ స్థానంలో పొవార్‌ ఎంపికపై డ్రామా 

మదన్‌లాల్‌ కమిటీపై విమర్శలు


న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవి నుంచి డబ్ల్యూవీ రామన్‌ను తప్పించడం చర్చనీయాంశమైంది. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచక్‌పలో అతడి ఆధ్వర్యంలోనే జట్టు అద్భుత ఆటతీరుతో ఫైనల్‌ వరకు చేరిందని పలువురు గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి అతడిని భారత అత్యుత్తమ కోచ్‌లలో ఒకడిగా పేర్కొంటారు. అలాంటిది దక్షిణాఫ్రికాతో రెండు సిరీ్‌సలు ఓడినంత మాత్రాన పదవి నుంచి తప్పించడం సరైన పద్దతి కాదనే వాదన వినిపిస్తోంది. అంతకుముందు భారత జట్టు కరోనా కారణంగా ఏడాదిపాటు క్రికెట్‌కు పూర్తిగా దూరమైంది. అంత సుదీర్ఘ విరామం తర్వాత క్రికెటర్ల ఆటతీరులో సహజంగానే మార్పు కనిపిస్తుంటుంది.  మరోవైపు మదన్‌ లాల్‌  నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) కూడా ముందుగానే రమేశ్‌ పొవార్‌ను నియమించాలనే అభిప్రాయానికి వచ్చినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.


అలాగే దక్షిణాఫ్రికాతో సిరీ్‌సకు కూడా నీతూ డేవిడ్‌తో కూడిన సెలెక్షన్‌ కమిటీ కీలక ఆటగాళ్లకు చోటివలేదనే విమర్శలున్నాయి. వన్డేల్లో షఫాలీ వర్మని ఎంపిక చేయకపోవడం.. వెటరన్‌ పేసర్‌ శిఖా పాండేను తప్పించడం వీటిల్లో భాగమనే అంటున్నారు. దీనికి తోడు అసలు 70 ఏళ్ల మదన్‌ లాల్‌ ఇంకా ఆ పదవిలో ఎలా ఉంటాడని బీసీసీఐ సీనియర్‌ సభ్యుడు ఒకరు ప్రశ్నించాడు. సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం ఆఫీస్‌ బేరర్ల గరిష్ట వయస్సు 70 ఏళ్లుగా ఉంది. 


జట్టులో స్టార్‌ సంస్కృతి ఆగాలి గంగూలీ, ద్రావిడ్‌కు రామన్‌ లేఖ

మాజీ కోచ్‌ డబ్ల్యువీ రామన్‌ భారత మహిళల క్రికెట్‌ జట్టులో నెలకొన్న స్టార్‌ కల్చర్‌పై మండిపడ్డాడు. ఈపద్దతిని రూపుమాపాలంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్‌ రాహుల్‌ ద్రవిడ్‌లకు లేఖ రాశాడు. అవసరమనుకుంటే భారత మహిళల క్రికెట్‌ పురోగతికి రోడ్‌ మ్యాప్‌ కూడా ఇవ్వగలనని అందులో సూచించాడు. ‘నాకు తెలిసినంత వరకు అన్నింటికంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని, ఆ తర్వాతే క్రికెటర్లని రామన్‌ భావిస్తుంటాడు. ఏ ఒక్క క్రికెటర్‌ కూడా దీనికి మినహాయింపు కాదు’ అని మాజీ కోచ్‌ సన్నిహితుడు ఒకరు తెలిపారు. అయితే జట్టులో ఆధిపత్యం చెలాయిస్తున్న క్రికెటర్‌ పేరును రామన్‌ పేర్కొనలేదు. కానీ ఇలాగే కొనసాగితే జట్టుకు నష్టమని, గంగూలీ ఈ విషయమై దృష్టి సారించాలని అందులో రామన్‌ కోరాడు.


అది పొవార్‌ జట్టు కదా..

మహిళల జట్టు కోచ్‌ పదవి కొనసాగింపు కోసం రామన్‌ కూడా ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. 45 నిమిషాలపాటు తన అభిప్రాయాలను తెలిపాడు. అయితే అందులో అతడికి విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. ‘టీ20 ప్రపంచకప్‌ రన్నర్‌పగా నిలిచిన జట్టు క్రెడిట్‌ను నీ ఘనతగా ఎలా చెబుతావు? అది రమేశ్‌ పొవార్‌ అంతకుముందే తయారు చేసిన జట్టు కదా?’ అని సీఏసీ సభ్యులు రామన్‌ను ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో ఈ పదవిని ఎలాగైనా పొవార్‌కు ఇవ్వాలనే ఆలోచన వారిలో ముందు నుంచే ఉన్నట్టుందని బోర్డు వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2021-05-15T09:26:57+05:30 IST