శాపంగా మారిన పేదరికం

ABN , First Publish Date - 2022-01-19T06:17:40+05:30 IST

ఆ అక్కాచెల్లెళ్ల పాలిట పేదరికం శాపంగా మారింది.

శాపంగా మారిన పేదరికం

- చిన్నప్పుడే తల్లి మృతి, వదిలిపెట్టి వెళ్లిన తండ్రి

- ఆలనాపాలనా చూసే అమ్మమ్మ, తాత మృతి

- అనాథలుగా జీవనం సాగించిన అక్కాచెల్లెళ్లు

- చెల్లి మృతితో షాక్‌లోకి వెళ్లిన అక్క

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఆ అక్కాచెల్లెళ్ల పాలిట పేదరికం శాపంగా మారింది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి అనారోగ్యం పాలై పన్నెండేళ్ల ప్రాయంలోనే మృతిచెందగా.. వారి ఆలనాపాలనా చూడాల్సిన కన్నతండ్రి ఆడపిల్లలని కూడా చూడకుండా వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. వారి బరువుబాధ్యతలను స్వీకరించిన అమ్మమ్మ, తాతలు తాము ఉన్నాలేకున్నా.. ఎక్కడైనా సొంత కాళ్లపై నిలబడి బతుకుతారని ఆశించి వారిని ఉన్నత చదువులు చదివించారు. వారిద్దరిని ఓ ఇంటి వారిని చేయకముందే వాళ్లు కన్నుమూయడంతో ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనాథలుగా మారారు. అయినా కష్టపడి ఉన్నత చదువులు చదివారు. అయిన వారెవరు లేక, ఒక దిశానిర్ధేశం చూపేవారు లేక, ఆదరించే వారెవరూ లేక ఆ అక్కాచెల్లెళ్లు అగాఽథంలో కూరుకుపోయారు. వరుస పరిణామాలతో వారి మనసులు గాయపడ్డాయి. 

చిన్నతనంలో పెద్ద షాక్‌..

పెద్దపల్లి పట్టణంలోని ప్రగతినగర్‌లో ఒక ఇంటిలో మారోజు శ్వేత(24), మారోజు స్వాతి(26) అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు అద్దెకు ఉంటున్నారు. శ్వేత ఎంసీఏ చదవగా, స్వాతి ఎంటెక్‌ చదివింది. వారి చిన్నప్పుడే తల్లి అనారోగ్య కారణాల వల్ల మృతిచెందగా, వారి ఆలనాపాలనా చూడాల్సిన తండ్రి రాజేశం వారిని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. వారి బాధ్యతలను స్వీకించిన అమ్మమ్మ, తాతలు తమ శక్తి మేరకు చదవించారు. వాళ్లు కూడా అనారోగ్యం పాలుకాగా, ఒకరు 2013లో, మరొకరు 2014లో మృతిచెందారు. దీంతో ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు మానసికంగా కృంగిపోయారు. వారిని నాఅన్న వాళ్లు ఎవరు చేరదీయలేదు. చెల్లెల్ని ఉన్నత చదువులు చదివించేందుకు అక్క స్వాతి ఒక ప్రైవేట్‌ విద్యా సంస్థలో విద్యాబోధన చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత ప్రైవేట్‌ కళాశాలలో టెక్నిషియన్‌గా చేరింది. పట్టణంలో వారికంటూ ఒక సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లల్లోనే నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ప్రగతినగర్‌లోని ఒక ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. అయితే వారిరువురు ఇరుగుపొరుగు వారితో పెద్దగా మాట్లాడేవారు కాదని, అమ్మమ్మ, తాత మృతిచెందినప్పటి నుంచి కొంత షాక్‌కు గురయ్యారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. 

కరోనాతో ఆరిక సంక్షోభం..

పొట్ట నింపుకునేందుకు అక్క ఒక ప్రైవేట్‌ విద్యాసంస్థలో ఉద్యోగం చేస్తూ వచ్చింది. ఏడాదిన్నర క్రితం నుంచి కరోనా పెరగడంతో విద్యాసంస్థలు మూతపడి వారిని మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. కరోనా సమసిపోయి విద్యా సంస్థలు తెరుచుకుని ఇప్పుడు ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నారు. సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. చెల్లెలు ఒక్కసారిగా జ్వరం బారినపడడంతో మరింత షాక్‌కు గురైంది. ఓ వైపు పేదరికం మరోవైపు నాఅన్న వారు లేక  ఏం చేయాలో పాలుపోక, ఎటు తీసుకపోవాలో తెలియక ఇంట్లోనే ఉండిపోయింది. 

చేరదీసే వారు కరువయ్యారు..

వారంరోజుల క్రితం చెల్లెలు శ్వేత జ్వరం బారిన పడినప్పటికీ, ఆమెకు పెద్దగా వైద్యం అందించలేదు. తన చెల్లెకు జ్వరం వచ్చిన విషయం స్వాతి ఎవరికి చెప్పలేదని స్థానికులు చెబుతున్నారు. జ్వరం తీవ్రమై చెల్లెలు చనిపోవడంతో స్వాతి నిశ్శేష్టురాలై చలించలేని స్థితికి చేరింది. మృతదేహం ఇంట్లో ఉండగానే స్వాతి సోమవారం ఇంటికి తాళం వేసి తాను పనిచేసే కళాశాలకు వెళ్లిపోయింది. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడం స్థానికులు గమనించి సాయంత్రం ఇంటి తలుపు తీయించగా శ్వేత మృతిచెంది ఉన్నది. ఈమేరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరుసటి రోజు మంగళవారం ఆ ఇంటికి సఖి కేంద్రం నిర్వాహకులు అక్కడకు వెళ్లి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించినప్పటికీ స్వాతి ఏమి చెప్పలేకపోయింది. ‘నా చెల్లెకు ఏమయ్యింది.. జ్వరం వచ్చింది అంతే’ అని చెప్పడం ఆమె మానసిక స్థితి ఎలా ఉందో అర్థం అవుతున్నది. మరోవైపు ఆమె నివాసం ఉండే పక్కగదిలో అద్దెకు ఉండేవాళ్లు ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోగా, ఇంటి యజమాని స్వాతిని ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తీసుకరావడంతో ఏమి చేయలేని స్థితిలో ఉన్నది. విధి ఆడిన వింత నాటకంలో అమ్మ, అమ్మమ్మ, తాతతో పాటు చివరికి చెల్లెల్ని పోగొట్టుకున్న ఆ అక్క పరిస్థితి కడు దయనీయంగా మారింది. అయినా ఆమెను చేరదీసే వారే కరువయ్యారు.

Updated Date - 2022-01-19T06:17:40+05:30 IST