మూడోరోజూ భారీ వర్షం

ABN , First Publish Date - 2022-08-04T05:50:24+05:30 IST

జిల్లాలో మూడో రోజూ వర్షం కుమ్మేసింది. 13 మండలాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది.

మూడోరోజూ భారీ వర్షం
రామ్‌నగర్‌లో నదిలా రోడ్డు..

కుమ్మేసిన వాన
నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
ఖరీఫ్‌, ఉద్యాన పంటలకు భారీ నష్టం
అనంతపురం అర్బన/క్రైం, ఆగస్టు 3:
జిల్లాలో మూడో రోజూ వర్షం కుమ్మేసింది. 13 మండలాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కంబదూరు మండలంలో 79.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆత్మకూరు 53.6, కుందుర్పి 45.2, కూడేరు 34.2, రాప్తాడు 12.4, కళ్యాణదుర్గం 11.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో 8 మి.మీ. వరకూ కురిసింది. అనంతపురం నగరంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి వర్షం కురిసింది. కూడేరు మండలం చోళసముద్రం గ్రామంలోకి వరద నీరు చేరింది. దీంతో గ్రామంలోని విధులన్నీ జలమయం అయ్యాయి. చోళ సముద్రం సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహరిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. కంబదూరు, కళ్యాణదుర్గం మండలాల్లోని పలు ప్రాంతాల్లో పొలాల్లోకి వర్షపు నీరు చేరడంతో టమోటా, వేరుశనగ దెబ్బతింది. కంబదూరు మండలంలోని జల్లిపల్లి వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆరు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉరవకొండ మండలం మైలారంపల్లి, రాచపల్లి గ్రామాల పరిధిలో మొక్కజొన్న, అరటి, టమోటా పంటలు నీట మునిగాయి. అనంతపురం జిల్లాలోని 781.78 హెక్టార్లల్లో రూ.5.62 కోట్లకుపైగా ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. అరటి, బీన్స,  అనప, చీనీ, కర్బూజ, కళింగర, జామ, మిరప, ఉల్లి, దానిమ్మ, బొప్పాయి, టమోటా తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. డి.హిరేహాల్‌, రాయదుర్గం, ఉరవకొండ, గార్లదిన్నె, కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, కూడేరు, పామిడి, కళ్యాణదుర్గం, ఆత్మకూరు, గుంతకల్లు మండలాల్లోని పలు గ్రామాల్లో ఉద్యాన పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

నగరం.. జలమయం..
అనంతపురం నగరంలో  బుధవారం ఉదయం వాన దంచికొట్టింది. నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీ నీరు వర్షపునీటితో కలిసి రోడ్లపై పారింది. రామ్‌నగర్‌, శ్రీకంఠం సర్కిల్‌, సప్తగిరి సర్కిల్‌, సుభా్‌షరోడ్డు, రాజు రోడ్డు, విద్యుతనగర్‌ సర్కిల్‌ నుంచి నవోదయకాలనీ వరకూ అన్ని రహదారులపై వర్షపు నీరు పొంగిపొర్లింది. పాతూరులోని ఇరుకు ప్రాంతాల ప్రజలు వర్షపునీటితో ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. విద్యుత నగర్‌ రోడ్డులో పెద్ద గుంతలలో నీరు నిలిచి ప్రమాదకరంగా మారింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్‌ మహమ్మద్‌, కమిషనర్‌ భాగ్యలక్ష్మి ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వారు అధికారులతో పర్యటించారు. డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌ రెడ్డి వర్షప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.



బీటీపీకి పెరుగుతున్న వరద
గుమ్మఘట్ట:
జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులో ఒకటైన భైరవానతిప్ప రిజర్వాయర్‌కు వరద పెరుగుతోంది. కర్ణాటకలోని హిరియూరు, చెళ్లకెర ప్రాంతాలలో భారీ వర్షాలు కురవడంతో వేదవతి హగరి నదికి భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో బీటీపీ జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు నీటి మట్టం 1655 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1651.5 అడుగులకు నీరు చేరిందని అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల్లో ప్రాజెక్టు నిండుతుందని అన్నారు. బీటీపీ ఆయకట్టు 12 వేల ఎకరాలు కాగా, కుడి కాలువ కింద 2,500 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. మరో 1200 ఎకరాలు మిగులు ఉంది. ఈ ఏడాది ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీరు చేరితే కుడికాలువ మిగులు ఆయకట్టుకూ, ఎడమ కాలువ ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది. వరద ఉధృతి కొనసాగితే గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ప్రాజెక్టును ఇరిగేషన అధికారులు బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు.  













Updated Date - 2022-08-04T05:50:24+05:30 IST