వెరైటీ కోడిగుడ్ల మిస్టరీ వీడింది.. ఆకుపచ్చని చందమామకు అసలుకారణం ఇదే..!

ABN , First Publish Date - 2020-05-27T16:31:15+05:30 IST

ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన కేరళ ఆకుపచ్చ కోడిగుడ్ల వెనుక మిస్టరీ వీడింది...

వెరైటీ కోడిగుడ్ల మిస్టరీ వీడింది.. ఆకుపచ్చని చందమామకు అసలుకారణం ఇదే..!

తిరువనంతపురం: ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన కేరళ ఆకుపచ్చ చందమామ కోడిగుడ్ల వెనుక మిస్టరీ వీడింది. కేరళలోని ఓ ఫామ్‌లో వెలుగుచూసిన ఈ గుడ్లపై కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ యూనివర్సిటీ (కేవీఏఎస్‌యూ) నిపుణులు అధ్యయనం చేసి అసలు విషయం వెల్లడించారు. కోళ్లకు పెట్టిన ఆహారం వల్ల గానీ లేదా సహజసిద్ధమైన రంగునిచ్చే మొక్కలను తినడం వల్ల గానీ గుడ్లలోని చందమామకు ఈ రంగు వచ్చినట్టు తేల్చారు. మలప్పురానికి చెందిన ఓ వ్యక్తి ఈ కోడి గుడ్లను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో అవి విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.


వాస్తవానికి ఇలాంటి కోడిగుడ్లను తాము తొమ్మిది నెలలుగా చూస్తున్నామనీ.. అయితే ఫేస్‌బుక్‌లో పెట్టిన తర్వాత వీటిపై విస్తృత ప్రచారం జరిగిందని వారు చెబుతున్నారు. ఈ ఫోటోలు, వీడియోలను చూసిన కేవీఏఎస్‌యూ నిపుణులు సదరు ఫౌల్ట్రీని సందర్శించి ఓ కోడిని, గుడ్లను తీసుకెళ్లి అధ్యయనం చేశారు. కాగా ఈ రంగు సహజ సిద్ధంగా వచ్చిందేననీ.. దీని వెనుక ఎలాంటి జన్యుపరమైన సమస్యలు లేవని పౌల్ట్రీ నిపుణులు వెల్లడించారు. తమ అధ్యనంలో భాగంగా వాటికి పెట్టే ఆహారం మార్చగా.. రెండు వారాల్లో మళ్లీ సహజమైన పసుపు రంగు చందమామతోనే గుడ్లు పెట్టడం మొదలుపెట్టాయని వారు తెలిపారు. 

Updated Date - 2020-05-27T16:31:15+05:30 IST