పాఠశాలలు మూతపడటంతో డెయిరీ, పౌల్ట్రీ రైతులకు నష్టాలు

ABN , First Publish Date - 2020-07-12T00:16:01+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి అన్ని రంగాలను దెబ్బతీస్తోంది. భౌతిక దూరం పాటించవలసి

పాఠశాలలు మూతపడటంతో డెయిరీ, పౌల్ట్రీ రైతులకు నష్టాలు

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి అన్ని రంగాలను దెబ్బతీస్తోంది. భౌతిక దూరం పాటించవలసి ఉండటంతో పాఠశాలలను మూసివేయడం వల్ల డెయిరీ, పౌల్ట్రీ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. బాలలకు పోషకాహారం అందజేయాలన్న లక్ష్యంతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకం ఈ రెండు రంగాల వ్యాపారానికి గట్టి హామీగా ఉంటోంది. ఈ మహమ్మారి అటు బాలలకు, ఇటు రైతులకు కష్టాలు మిగుల్చుతోంది. 


కర్ణాటకలో క్షీర భాగ్య పథకం క్రింద పాఠశాలలు, అంగన్వాడీల్లో చదువుతున్న బాలలకు పాలు పంపిణీ చేస్తారు. గుజరాత్‌లో దూద్ సంజీవని యోజనను విద్యార్థినీ, విద్యార్థుల కోసం అమలు చేస్తున్నారు. ఈ పథకాల క్రింద బాలలకు పాలు పంపిణీ చేస్తున్నారు. 


ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పాఠశాలల్లో చదివే బాలలకు వారానికి ఒక్కొక్కరికి 5 గుడ్లు  ఇస్తున్నారు. తెలంగాణాలో వారానికి మూడుసార్లు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపురలలో వారానికి రెండుసార్లు గుడ్లు ఇస్తున్నారు. కేరళ, బిహార్, అస్సాం, ఉత్తరాఖండ్, జమ్మూ-కశ్మీరులలో వారానికి ఒకసారి గుడ్లు పంపిణీ చేస్తారు. 


తెలంగాణాలో అంగన్వాడీ బాలలకు వారానికి ఒక్కొక్కరికి 7 గుడ్లు పంపిణీ చేస్తున్నారు. ఒడిశాలో 5, ఆంధ్ర ప్రదేశ్‌లో 4, తమిళనాడు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో 3, కర్ణాటకలో 2, బిహార్, త్రిపురలలో ఒకటి చొప్పున గుడ్లు ఇస్తున్నారు. 


ఈ పథకాల క్రింద ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో 55 లక్షల గుడ్లు రోజుకు అవసరమవుతాయి. తెలంగాణాకు 30 లక్షల గుడ్లు అవసరమవుతాయి. అన్ని రాష్ట్రాలు కలిపి మొత్తం మీద రోజుకు 2 కోట్ల గుడ్లను విద్యార్థినీ, విద్యార్థులకు పంపిణీ చేస్తున్నాయి. 


దేశంలో రోజుకు 25 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. వీటిలో 2 కోట్ల గుడ్లకు కచ్చితమైన మార్కెట్‌గా పాఠశాలలు, అంగన్వాడీలు నిలుస్తున్నాయి. 


హైదరాబాద్‌లోని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ బిజినెస్ మేనేజర్ సంజీవ్ మాట్లాడుతూ, పాఠశాలలు, అంగన్వాడీల మూసివేత వల్ల రోజుకు 2 కోట్ల గుడ్ల డిమాండ్‌లో 70 శాతం నష్టపోవలసి వస్తోందన్నారు. పౌల్ట్రీ రైతులు కూడా ఉత్పత్తిని రోజుకు 20 కోట్ల గుడ్లకు తగ్గించుకున్నారన్నారు. బ్రాయిలర్ (మాంసం) రైతుల కన్నా లేయర్ (గుడ్ల) రైతులు నష్టాలను పూడ్చుకోవడం కష్టమని చెప్పారు. 


పాడి రైతులు కూడా కోవిడ్ వల్ల నష్టపోతున్నారు. రైతుల నుంచి ఆవు పాల సేకరణ ధరను లీటరుకు రూ.29 నుంచి 24కు తగ్గించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పాల సేకరణ ధర తగ్గించడంతో తమ ఆదాయానికి గండి పడుతోందని రైతులు వాపోతున్నారు. 


Updated Date - 2020-07-12T00:16:01+05:30 IST