Abn logo
May 31 2020 @ 05:41AM

పౌల్ట్రీ పల్టీ !

ఆదిలాబాద్‌, మే 30(ఆంధ్రజ్యోతి): పౌల్ట్రీ  పరిశ్రమకు ప్రస్తుతం పరిస్థితుల్లో గండమే వచ్చి పడింది. నిన్న, మొన్నటి వరకు కరోనా మహమ్మారితో విలవిలలాడిన రైతులకు తాజాగా మండిపోతున్న ఎండలకు కోళ్ల పెంపకం పెద్ద సవాల్‌గానే మారింది. కరోనా పరిస్థితులతో చికెన్‌ సెంటర్లు మూతపడడం, కరోనా వస్తుందంటూ వదంతులు రావడంతో ఎవరు చికెన్‌ను తినేందుకు ఆసక్తి చూపించక అమ్మకాలు పూర్తి గా పడిపోయాయి. దీంతో కోళ్లను పెంచే స్థోమత వచ్చిన కాడికి అమ్మేసుకున్నారు. ఇప్పుడిప్పుడే కొంత మెరుగుపడుతున్నా.. భానుడి భగభగలకు కోళ్లన్నీ మృత్యువాత పడుతున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న కోళ్ల పరిశ్రమపై కరోనా, ఎండల ప్రభావం కనిపిస్తోంది.


జిలా ్లవ్యాప్తంగా 10లోపే పౌల్ర్టీ పరిశ్రమలు ఉన్నాయి. దీంతో పూర్తిగా మహారాష్ట్రపై ఆధారపడాల్సి వస్తుంది. అంతేకాకుండా డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో చికెన్‌ ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు చికెన్‌ ముక్కతినే పరిస్థితులు కనిపించడం లేదు పప్పు, కూరగాయలతోనే సరిపెట్టుకుంటున్నారు. అకస్మాత్తు గా వచ్చిపడిన పరిస్థితులతో పౌల్ర్టీ రైతులు భారీగా నష్టపోతున్నారు. మున్ముందు కోళ్ల పెంపకం చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని అన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

 

వెంబడిస్తున్న గడ్డు పరిస్థితులు

అసలే కోళ్ల పెంపకం అంటే కత్తిమీద సాముగా మారిన ఈ రోజుల్లో.. వరుసగా ఎదురవుతున్న గడ్డు పరిస్థితులు పౌల్ర్టీ రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. కరోనాతో ఊహించని రీతిలో దెబ్బతిన్న రైతులు గత కొద్ది రోజులుగా భానుడి భగభగల నుంచి కోళ్లను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ప్రస్థుతం 45 నుంచి 47 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండ వేడిమికి కోళ్లను రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. నిమిషం కరెంట్‌ పోయిన తట్టుకునే పరిస్థితులు కనిపించడం లేదు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విపరీతమైన వడగాలులు, ఉక్కపోత లతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొందరు రైతులు పౌల్ర్టీ చుట్టు చల్లని వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరైతే గోనె సంచులను వేస్తూ చల్లబరుస్తున్నారు. కూలర్లు, స్పింక్‌లర్లతో కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అదనంగా ఆర్థికభారం పెరిగిపోతున్నా.. ఆశించిన స్థాయిలో ఫలితం రావడం లేదని వాపోతున్నారు. 


ప్రభుత్వ నిర్ణయంతో ఇబ్బందులే..

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న నియంత్రిత సాగు విధానంతో పౌల్ర్టీ రైతులకు ఇబ్బందులే ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. జిల్లాలో అంతంత మాత్రంగా సాగయ్యే మొక్కజొన్న పంటను సాగు చేయవద్దంటూ వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. దీంతో భవిష్యత్‌లో కోళ్ల దాణా కొరత ఏర్పడి ధరలు మరింత పెరుగనున్నాయి. ముఖ్యంగా ఈ దాణా తయారీలో మొక్కజొన్నలనే వాడుతారు. పంట దిగుబడి తగ్గిపోతే ధరలపై మరింత ప్రభావం పడుతుందని పలువురు పౌలీ్ట్ర రైతులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం క్వింటాల్‌ రూ.రెండు వేలు ఉన్న కోళ్ల దాణా ధర.. వచ్చే సీజన్‌ వరకు రెండింతలయ్యే అవకాశం ఉందంటున్నారు. దీంతో చికెన్‌ ధరలు మరింత పెరిగిపోతే ఎవరు కొనలేని పరిస్థితులు ఏర్పడుతాయి. ఇప్పటికే నిర్వహణ ఖర్చు భారం పెరిగి పోవడంతో చికెన్‌ ధరలు రోజురోజుకు మండిపోతున్నాయి. 


ప్రత్యామ్నాయ మార్గాల వైపు రైతులు

ప్రస్తుతం పౌల్ర్టీ పరిశ్రమలో ఉన్న రైతులు క్రమక్రమంగా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో సగానికి పైగా పౌల్ర్టీ పరిశ్రమలు మూతబడ్డాయి. అప్పు సప్పు చేసి పెట్టుబడులు పెడుతున్న ఆశించిన లాభాలు రావడం లేదంటున్నారు. అకస్మాత్తుగా వచ్చి పడుతున్న విపత్తులు, కరెంట్‌ బిల్లులు, దాణా ఖర్చులు పెరిగి పోవడంతో మోయలేని భారం ఏర్పడుతుంది. కొంతమంది  వ్యవసాయం వైపు వెళ్తుండగా.. మరికొంత మంది రైతులు ఇతర వ్యాపారాలు చేసుకుంటున్నారు. అదేవిధగా మరికొన్నాళ్ల పాటు ఇవే పరిస్థితులు ఉంటే పూర్తిగా మూసివేసుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇక ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
Advertisement