Advertisement
Advertisement
Abn logo
Advertisement

పొట్టు ట్రాక్టర్ల రవాణాతో తీవ్ర ఇబ్బందులు

వెంకటాచలం, అక్టోబరు 24 : మండల పరిధిలోని జాతీయ రహదారిపై నిత్యం పొట్టు లోడుతో ట్రాక్టర్లు తిరుగుతున్నాయి. వెంకటాచలం మీదుగా ముత్తుకూరు మండలంలోని వివిధ పరిశ్రమలకు ఈ పొట్టు ట్రాక్టర్లు వెళ్తుండటంతో ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొట్టు లోడుతో వెళ్లే ట్రాక్టర్‌ వెనుక వచ్చే ద్విచక్ర వాహనదారుల కళ్లలోకి పొట్టు పడుతుండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ తరహా ప్రమాదాలు ఇటీవల వరుసగా జరుగుతున్నాయి. దీనికి కారణం పొట్టు లోడుతో వెళ్లే ట్రాక్టర్లకు పూర్తిస్థాయిలో చుట్టు పట్టలు కట్టుకుని వెనుక వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సి ఉంది. అయితే ట్రాక్టర్ల యాజమానులు వీటిన్నంటిని పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిత్యం పదుల సంఖ్యలో పొట్టు ట్రాక్టర్లు వెళ్తున్నాయి. వెంకటాచలం జాతీయ రహదారి, సర్వేపల్లి గ్రామాల మీదుగా ముత్తుకూరు మండలంలోని వివిధ పరిశ్రమలకు పొట్టు ట్రాక్టర్లను తిప్పుతుండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రవాణా, పోలీస్‌ శాఖల ఽఅధికారులు నామమాత్రంగా దాడులు చేసి, జరిమానాలు విధించి వదిలేస్తుండటంతో ట్రాక్టర్ల యాజమానులు తీరు మారడం లేదు. జాతీయ రహదారిపై కొందరు పోలీసులు పొట్టు ట్రాక్టర్ల వద్ద మాముళ్లు తీసుకుని వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా పొట్టు లోడు రవాణా చేసే ట్రాక్టర్లు నిబంధనలు పాటించేలా పోలీసులు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు, ద్విచక్ర వాహనచోదకులు కోరుతున్నారు.  

Advertisement
Advertisement