పోటెత్తిన రంగలీల

ABN , First Publish Date - 2022-10-07T06:04:41+05:30 IST

పోటెత్తిన రంగలీల

పోటెత్తిన రంగలీల

ఉర్సు గుట్ట వద్ద వరుణుడి ఆటంకాల మధ్య ‘రావణ వధ’

టపాసులు తడిసిపోవడంతో పాక్షికంగా దహనమైన ప్రతిమ

నిరాశ పర్చిన ముఖ్య ఘట్టం... ఉసూరుమన్న వేలాది జనం...

వేడుకల్లో ఆకట్టుకున్న లేజర్‌ షో, బాణసంచా విన్యాసాలు

రాముడి రథానికి పోలీసుల అడ్డంకులు.. భక్తుల నిరసన..


కరీమాబాద్‌ (వరంగల్‌), అక్టోబరు 6: దసరా పండుగ వేళ నగరంలోని ఉర్సు రంగలీల మైదానం బుధవారం రాత్రి జనంతో పోటెత్తింది. వరుణ దేవుడు ఆటంకాలు కల్పించినా రావణవధ వేడుకను తిలకించడానికి జనం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అయితే రావణ ప్రతిమలోని టపాసులు తడిసిపోవడం.. చివరకు ప్రతిమ పూర్తిగా దహనం కాకపోవడంతో జనం తీవ్ర నిరాశ చెందారు. మొత్తం వేడుకల్లో లేజర్‌ షో, బాణసంచా విన్యాసాలు జనాన్ని ఆకట్టుకున్నాయి.  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, మేయర్‌ సుధారాణి, ఎంపీ పసునూరు దయాకర్‌, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌, ‘కుడా’ చైర్మన్‌ సుందర్‌రాజ్‌, కలెక్టర్‌ గోపి, పోలీసు కమిషనర్‌ తరుణ్‌జోషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి 10 గంటల వరకు వేడుకలు కొనసాగాయి.

దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో రావణ వధ వేడులకు భారీ ఏర్పాట్లు చేశారు. వేలాది జనాన్ని దృష్టిలో పెట్టుకొని అటు అధికార యంత్రాంగం, ఇటు పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రతీ ఏటా సాయంత్రం 6 గంటల నుంచే దసరా వేడుకలు ప్రారంభమవుతాయి. ఈసారి అనుకోకుండా వర్షం కురవడంతో నిర్వహణ ఆగమాగంగా మారింది.  రావణ ప్రతిమ తడిసిపోవడంతో పాటు, మైదానమంతా బురదమయంగా మారింది. బారికేడ్లు కూలిపోయాయి. గ్యాలరీలు ఆస్తవ్యస్తంగా మారాయి. ఓ దశలో రావణవధ జరుగుతుందా లేదా అనే సందిగ్ధంలో నిర్వాహకులు పడిపోయారు. అయితే  రాత్రి 7.30 గంటల సమయంలో వర్షం నిలిచిపోవడంతో జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొద్దిసమయంలోనే మైదానం జనసంద్రంగా మారింది. 


ఆకట్టుకున్న లేజర్‌ షో

రావణ వధ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక లేజర్‌ షో జనాన్ని ఆకట్టుకుంది. గుట్ట పైభాగంపై రామాయణ ఇతిహాసంలోని సీత అపహరణ, వారధి నిర్మాణం, అశోకవనంలో సీతమ్మను హనుమంతుడు గుర్తించడం, లంకా దహనం, కుంబకర్ణ, రావణ సంహార ఘట్టాలను లేజర్‌ షో ద్వారా ప్రదర్శించారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే నరేందర్‌ చిత్రాలను సైతం ప్రదర్శించారు. ఈ షోను జనం ఆద్యంతం ఆసక్తికరంగా తిలకించారు. 


అలరించిన బాణసంచా విన్యాసాలు

వేడుకల్లో భాగంగా బాణసంచా విన్యాసాలు హైలైట్‌గా నిలిచాయి. రకరకాల రంగుల్లో వెలుగులు విరజిమ్మూతూ. వినూత్నమైన డిజైన్లలో నింగిలో బాణసంచా చేసిన విన్యాసాలు ప్రతీ ఒక్కరికి కట్టిపడేశాయి. టపాసుల మోతలు, కలర్‌ఫుల్‌ క్రాకర్స్‌తో ఉర్సు గుట్ట ప్రాంతం దేదీప్యమానంగా ప్రకాశించింది. యువత, పిల్లలు కేరింతలు కొడుతూ బాణసంచా విన్యాసాలను తిలకించారు. 


పాక్షకింగా రావణ దహనం

అనూహ్య వర్షం వల్ల రావణ ప్రతిమ తడిసిపోవడంతో అది అతికష్టమ్మీద దహనమైంది. వాస్తవానికి ప్రతీసారి వేడుకల్లో రావణ ప్రతిమ దహనమే హైలైట్‌గా నిలిచేది.  బాణసంచా మిరుమిట్లు గొలుపుతుండగా, టపాసులు పేలుతుండగా రావణ ప్రతిమ దహనమవుతుంటే జనం కేరింతలు కొడుతూ చూసేవారు.  ఈసారి నిర్వాహకులు ఎంత ప్రయత్నించినా రావణ ప్రతిమ పూర్తిగా దహనం కాలేకపోయింది. ముఖ్యమైన ఘట్టమే మిస్‌కావడంతో జనం తీవ్రంగా నిరాశచెందారు. 


పోలీసుల వైఫల్యం

కరీమాబాద్‌లోని రామస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన రాముని రథం రంగలీల మైదానానికి చేరుకోగా, ప్రధాన ద్వారం నుంచి వేదిక వద్దకు వెళ్లేందుకు పోలీసులు నిరాకరించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత రథం కొంత మేరకు ముందుకు కదలగానే మళ్లీ పోలీసులు అడ్డుకున్నారు. సీపీ వాహనం ఉందని, వీఐపీ గ్యాలరీ నుంచి రథం వెళ్లేందుకు వీలులేదని పోలీసులు, కరాఖండిగా చెప్పడంతో పరిస్థతి ఉద్రిక్తంగా మారింది.  ఒకానొక దశలో రావణ సంహారం జరగకుండానే రాముని రథాన్ని వెనక్కి తీసుకెళ్లేందుకు భక్తులు సిద్ధం అయ్యారు. చివరకు పోలీసులు రాముడి రథాన్ని వేదిక వద్దకు చేర్చారు. ఈ విషయంలో నిర్వాహకులు ప్రేక్షకపాత్ర వహించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. 

వేడుకల ప్రారంభానికి ముందు నుంచే వర్షం కురవడం, క్రమ క్రమంగా వర్షం తగ్గడం, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసులు సరైన రీతిలో స్పందించలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి.   ఇక ఉత్సవాల్లో తమ కళారూపాలను ప్రదర్శించాల్సిన కళాకారులు వర్షం కారణంగా తడిసి పోయారు. భారీ వర్షం కారణంగా వేడుకలు కొనసాగేట్టులేవని, వాతావరణం కూడా ప్రదర్శనకు అనుకూలంగా లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. 

ఈ కార్యక్రమంలో  ఇంకా అదనపు కలెక్టర్‌ హరిసింగ్‌, ఆర్టీవో మహేందర్‌జీ, తహసీల్దార్‌ ఫణికుమార్‌, కార్పొరేటర్లు మరుపల్ల రవి, పల్లం పద్మ, పోషాల పద్మ, ముష్కమల్ల అరుణ తదితరులతో పాటు దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్‌బాబు, ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్‌, కన్వీనర్‌ వడ్నాల నరేందర్‌, ట్రస్ట్‌ చైర్మన్‌ వంగరి కోటేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 


దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ : మంత్రి ఎర్రబెల్లి

దసరా పండుగ విజయానికి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.  ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో బుధవారం రాత్రి రావణ వధ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాముడు రావణుడిపై విజయం సాధించిన సందర్భాన్నే విజయ దశమి వేడుకగా జరుపుకుంటున్నామన్నారు. తెచ్చుకున్న తెలంగాణ తెర్లు కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాపాడుతూ బంగారు తెలంగాణ స్వప్న సాకారం చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విడనాడకుండా కరోనా కష్టకాలంలో సైతం ప్రజలను ఆదుకున్నారని పేర్కొన్నారు.  అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలుపుతున్నారని,  ప్రజల సంపూర్ణ మద్ధతుతో కేసీఆర్‌ భారత రాష్ట్ర సమితితో దేశ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా అడుగులు ముందుకేస్తున్నారని మంత్రి తెలిపారు.


రాష్ట్రంలో అనూహ్యమైన అభివృద్ధి : ఎమ్మెల్యే నరేందర్‌

పోరాడి సాధించిన తెలంగాణాలో అనూహ్యమైన అభివృద్ధి కొనసాగుతోందని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో బుధవారం రాత్రి రావణ వధ వేడుకల్లో ఆయన మాట్లాడారు. తూర్పు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకుసాగుతోందని, జిల్లాల విభజన అనంతరం కలెక్టరేట్‌, సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ఏర్పాటుతో పాటు, వందల కోట్లతో నగరాభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి దేశ రాజకీయాలను ప్రభావితం చేయడమే కాకుండా, విజయవంతంగా ముందుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. రంగలీల మైదానంలో మునుపెన్నడూ లేని విధంగా ఈ దసరా వేడుకల్లో ప్రజల ఆనందాన్ని రెట్టింపు చేసేందుకై ప్రత్యేకంగాలేజర్‌ లైటింగ్‌ షో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దసరా అందరికీ శుభాలు పంచాలని ఆకాంక్షించారు. 


దసరా వేడుకలు వర్షార్పణం

హనుమకొండ కల్చరల్‌, అక్టోబర్‌ 6: దసరా పండుగ వేళ బుధవారం సాయ్రం తం కురిసిన భారీ వర్షం అందరినీ తీవ్రంగా నిరాశపర్చింది.  సాయంత్రం 5 గంటలకు ప్రజలు దసరా వేడుకల్లో పాల్గొనేందుకు బయట అడుగుపెడుతున్న తరుణంలోనే నగరంలో ఒక్కసారిగా కుంభవృష్టి కురిసింది. వర్షం వల్ల రావణవధ వేడుకల  కోసం వివిధ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లన్నీ కుప్పకూలాయి. సిద్ధేశ్వర ప్రాంగణంలో రావణ విగ్రహం తడిసిపోవడంతో వధ కార్యక్రమానికి అంతరాయం కలిగింది. ఇక ఆలయాల్లో శమీ పూజలు నామమాత్రంగానే జరిగాయి. అయితే వరంగల్‌ ప్రాంతం లో  మాత్రం రావణవధ వేడుకలను వర్షం తర్వాత ఎలాగోలా పూర్తిచేశారు. 



Updated Date - 2022-10-07T06:04:41+05:30 IST