ఇస్లామాబాద్ : మతపరమైన తీవ్రవాదం వల్ల పాకిస్థాన్ నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఫవద్ చౌదరి హెచ్చరించారు. పాకిస్థాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, ప్రపంచంలో ఆరో అతి పెద్ద సైన్యం ఉందని, అందువల్ల ఇతర దేశాల నుంచి ముప్పు లేదని అన్నారు. ఉగ్రవాదంపై సంప్రదింపుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘మనకు భారత్ నుంచి ముప్పు వచ్చే అవకాశం లేదు. మనది ప్రపంచంలో ఆరో అతి పెద్ద సైన్యంగల దేశం, మనకు అణ్వాయుధ శక్తి ఉంది, మనతో భారత దేశం పోటీ పడజాలదు. మనకు అమెరికా నుంచి ప్రమాదం లేదు, యూరోపు నుంచి ముప్పు లేదు. మనకు ఎదురవుతున్న అతి పెద్ద ప్రమాదం దేశంలోపలి నుంచే (తీవ్రవాదం వల్ల)’’ అని ఫవద్ చెప్పారు.
300 ఏళ్ళ క్రితం ఆధునిక కైబర్ పష్తూన్‌క్వా, పంజాబ్, ఇతర ప్రాంతాల్లో మతపరమైన తీవ్రవాదం ఉండేది కాదన్నారు. పాకిస్థాన్ ఏర్పడినపుడు సూఫీల గడ్డగా ఉండేదన్నారు. ఇప్పుడు కనిపిస్తున్నంత మతపరమైన తీవ్రవాదం పాకిస్థాన్‌లో గతంలో ఎన్నడూ లేదన్నారు. దీనివల్ల తీవ్ర ముప్పు, అపాయం ఎదురవుతున్నప్పటికీ, దీనిని నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలు తగినంతగా లేవని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కానీ, దేశం కానీ తగిన స్థాయిలో సిద్ధంగా లేనట్లు తెలిపారు. తెహరీకీ లబ్బాయక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ)తో వ్యవహరించేటపుడు ప్రభుత్వమే వెనుకకు తగ్గవలసి వచ్చిందన్నారు.