పొటాష్‌ జాడేది?

ABN , First Publish Date - 2021-10-28T06:15:00+05:30 IST

ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులపాలిట శాపంగా మారింది

పొటాష్‌ జాడేది?

ప్రత్యామ్నాయంగా మల్టీ కే పొడి పిచికారీ చేయాలని సలహా

పొటాష్‌ చల్లకుంటే దిగుబడిపై తీవ్ర ప్రభావం


ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులపాలిట శాపంగా మారింది. వరి పైరుకు అదునులో అందించాల్సిన పొటాష్‌ ఎరువు ఇంత వరకు అందలేదు. సకాలంలో ఎరువు అందేలా చర్యలు తీసుకోవలసిన వ్యవసాయశాఖ అధికారులు రేపు, మాపు అంటూ ఇప్పటి వరకూ కాలం వెళ్లదీశారు. తీరా ఇప్పుడు ఈ ఎరువు అందుబాటులో లేనందున ప్రత్యామ్నాయంగా మల్టీ కే పొడిని ఎకరానికి రెండు కిలోల చొప్పున పైరుపై పిచికారీ చేయాలని సలహా ఇస్తుండడంతో ఇది ఎంతవరకు ఫలితాన్నిస్తుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. 


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 14వేల టన్నుల పొటాష్‌ ఎరువు అవసరం ఉంటుందనేది వ్యవసాయశాఖ అధికారుల అంచనా. ఇప్పటి వరకు 7,540 టన్నులు వచ్చిందని, మరో 7,460 టన్నుల పొటాష్‌ దిగుమతి కావాల్సి ఉందని చెబుతున్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 2,37,453 హెక్టార్లలో వరిసాగు జరిగింది. ప్రస్తుతం ఈ పైరు చిరు పొట్టదశ, పొట్టదశలో ఉంది. ఈ తరుణంలో ఎకరానికి కనీసం 25 కిలోల పొటాష్‌, 25 కిలోల యూరియా కలిపి చల్లాలి. పొటాష్‌ కొరత ఎక్కువగా ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 


ఎరువు వచ్చినా నో స్టాక్‌ అనే సమాధానం

ఆర్‌బీకేలు, పీఏసీఎస్‌లలో పొటాష్‌ ఎరువును విక్రయిస్తామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నప్పటికీ, అక్కడకు వెళ్లిన రైతులకు స్టాకు లేదనే సమాధానం వస్తోంది. బందరు మండలం చిన్నాపురం వ్యవసాయ పరపతి సంఘానికి ఇటీవల పది టన్నుల పొటాష్‌ను దిగుమతి చేశారు. లారీ వచ్చిన వెంటనే రైతులు వెళ్లినా, సిబ్బంది నుంచి ఎరువు అయిపోయిందనే సమాధానం రావడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. బ్లాక్‌మార్కెట్‌లో ప్రైవేటు వ్యాపారులు 50 కిలోల పొటాష్‌ బస్తాను రూ.1300 నుంచి 1700 వందల వరకు విక్రయిస్తున్నారని రైతులు అంటున్నారు.  


పొటాష్‌ వినియోగిస్తేనే అధిక దిగుబడి

చిరుపొట్టదశలో ఉన్నప్పుడు పొటాష్‌ చల్లితే వరి పైరుకు మెతకదనం పోయి కరుకుదనం వస్తుందని, పురుగుల దాడి తగ్గుతుందని, తద్వారా దిగుబడి పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. సకాలంలో పొటాష్‌ను అందిస్తే కంకుల్లోని గింజలు బలంగా తయారవుతాయని అంటున్నారు. వర్షం కురిసినా, ఒక మోస్తరు బలమైన గాలులు వీచినా, పైరు నేలవాలే అవకాశాలు తక్కువగా ఉంటాయని రైతులు చెబుతున్నారు.   


ప్రత్యామ్నాయంగా మల్టీ కే పొడి

పొటాష్‌ అందుబాటులో లేనందున ప్రత్యామ్నాయంగా మల్టీ-కే పొడిని ఎకరానికి రెండు కిలోల చొప్పున పైరుపై పిచికారీ చేయాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అయితే ఇదిఎంతవరకు పనిచేస్తుందనేది ప్రశ్నార్థకమేనని రైతులు అంటున్నారు. 


కొరత ఉన్నమాట వాస్తవమే

జిల్లాలో పొటాష్‌ ఎరువు కొరత ఉన్న మాట వాస్తవమేనని వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ టి.మోహనరావు తెలిపారు. జిల్లాకు 100, 50 టన్నుల చొప్పున వస్తోందని, వచ్చిన ఎరువు వచ్చినట్టు అవసరమున్న ప్రాంతాలకు అందజేస్తున్నామని చెప్పారు.

Updated Date - 2021-10-28T06:15:00+05:30 IST