ఏది ఒప్పు - ఏది తప్పు?

ABN , First Publish Date - 2022-10-04T21:01:49+05:30 IST

తప్పుడు భంగిమల ప్రభావంతో మన ఎముకలు, కండరాలు ఒత్తిడికి లోనై

ఏది ఒప్పు - ఏది తప్పు?

పోశ్చర్‌ ప్రాబ్లమ్స్‌ 


దైనందిన జీవితంలో మనం అనుసరించే శారీరక భంగిమలు సరైనవైనా, కాకపోయినా పనులన్నీ వాటంతట అవి జరిగిపోతూనే ఉంటాయి. కానీ తప్పుడు భంగిమల ప్రభావంతో మన ఎముకలు, కండరాలు ఒత్తిడికి లోనై, దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. కాబట్టి ఏది ఒప్పో, ఏది తప్పో తెలుసుకోవడం అవసరం. 


బరువులు ఎత్తడం: బరువు ఎత్తగానే నడుము పట్టేస్తుందంటే, బరువును లేపే పద్ధతిలో తప్పు ఉందని అర్థం చేసుకోవాలి. నడుము పైభాగాన్ని వంచి, బరువును చేతులతో పైకి లేపే ప్రయత్నం చేస్తే, వెన్ను మీద ఒత్తిడి పడుతుంది. అలాకాకుండా మోకాళ్లను వంచి, కిందకు కుంగి బరువును లేపాలి. ఇలా చేస్తే తేలికగా బరువును లేపగలగడంతో పాటు వెన్ను సురక్షితంగా ఉంటుంది.




కంప్యూటర్‌ వర్క్‌: వీపు కుర్చీకి పూర్తిగా ఆనించి, నిటారుగా కూర్చోవాలి. తుంటి ఎముక, మోకీలు సమాంతరంగా ఉండాలి. కంటి చూపు, మానిటర్‌కు సమాంతరంగా ఉండాలి. అలాగే మోచేయి, ముంజేయి డెస్క్‌కు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి.




కీబోర్డ్‌: కంప్యూటర్‌ కీబోర్డు మీద చేతులతో టైప్‌ చేసేటప్పుడు, అరచేతులు బోర్డుకు అనించకూడదు. అలాగే రెండు చేతులు  సమాంతరంగా ఉండాలి. వేర్వేరు దిశల్లో ఉండకూదదు. మణికట్టును మరీ కిందకు, లేదా మరీ పైకి లేపి ఉంచి, వేళ్లతో టైప్‌ చేయకూడదు.




నిలబడడం: కొందరు నడుము పైభాగాన్ని ముందుకు వంచి నిలబడతారు. ఇంకొందరు వెనక్కి వంచి నిలబడతారు. కొందరు భుజాలను ముందుకు వంచేస్తారు. నిజానికి ఇవేవీ సరైన శారీర భంగిమలు కావు. నిలబడేటప్పుడు శరీర బరువు రెండు కాళ్ల మీద సమంగా పడేలా నిలబడాలి. వెన్ను, మెడ నిటారుగా ఉండాలి. ఎక్కువ సమయం నిలబడవలసి వచ్చినప్పుడు, శరీర బరువును ఒక కాలి మీద నుంచి మరో కాలి మీదకు తరచూ మారుస్తూ ఉండాలి.




మొబైల్‌ ఫోన్‌: రోజులో ఎక్కువ సమయం మొబైల్‌ ఫోన్‌ వాడే వాళ్లు, వీలైనంత వరకూ ఫోన్‌ను ముఖానికి ఎదురుగా చేత్తో పట్టుకుని వాడుకోవాలి. టెక్స్ట్‌ చేసేటప్పుడు, తలను మరీ కిందకు దించడం, మెడ వంపులో ఫోన్‌ ఇరికించుకుని మాట్లాడడం చేయకూడదు. సాధ్యమైనంతవరకూ ఇయర్‌ పాడ్స్‌ లేదా ఇయర్‌ ఫోన్స్‌ ఉపయోగించాలి.



Updated Date - 2022-10-04T21:01:49+05:30 IST