ఆరెస్సెస్ లో మహిళలకు పదవులు?

ABN , First Publish Date - 2022-10-05T08:40:07+05:30 IST

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆరెస్సె్‌సలో మార్పులు చోటుచేసుకోనున్నాయా? కరడుగట్టిన హిందుత్వ సంస్థ సంఘ్‌ చరిత్రను తిరగరాసే పనిలో ఉందా? అంటే అవుననే సమాచారమే వస్తోంది.

ఆరెస్సెస్ లో మహిళలకు పదవులు?

వందేళ్ల సంఘ్‌ చరిత్రలో తొలిసారిగా!

న్యూఢిల్లీ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆరెస్సె్‌సలో మార్పులు చోటుచేసుకోనున్నాయా?  కరడుగట్టిన హిందుత్వ సంస్థ సంఘ్‌ చరిత్రను తిరగరాసే పనిలో ఉందా? అంటే అవుననే సమాచారమే వస్తోంది. సంఘ్‌లో మహిళలు కూడా అత్యున్నత పదవులు స్వీకరించనున్నారు. కీలకమైన సహ కార్యవాహ్‌, సహ సర్‌ కార్యవా్‌హగా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2025 నాటికి ఆరెస్సెస్‌ 100 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో సంఘ్‌ అనుబంధ సంస్థ రాష్ట్ర సేవికా సమితిలో పనిచేస్తున్న మహిళలను సంఘ్‌లోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. 97 ఏళ్ల సంఘ్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా అత్యున్నత పదవిని చేపట్టలేదు. కీలక పదవుల్లో మహిళలకు బాధ్యతలు అప్పగించేందుకు సంఘ్‌ పెద్దలు కూడా ఆమోదముద్ర వేశారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే తొలిసారిగా నాగ్‌పూర్‌లో నిర్వహించనున్న విజయదశమి వేడుకలకు పర్వతారోహకురాలు సంతోష్‌ యాదవ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారని సమాచారం. ఇలా హాజరుకాబోతున్న తొలి మహిళ ఈమే కావడం విశేషం. రెండు సార్లు ఎవరెస్టును అధిరోహించిన మహిళగా ఆమె ప్రపంచ రికార్టు సాధించారు. ఆరెస్సెస్‌లో 1936 నుంచి మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి కోసం బాల శాఖ, తరుణ శాఖ, రాష్ట్ర సేవికా సమితి ఉన్నాయి. లక్ష్మీబాయి కేల్కర్‌ 1936లో విజయదశమి రోజే సేవికా సమితిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వి.శాంతకుమారి ప్రముఖ్‌ సంచాలికగా ఉన్నారు. గత ఏడాది ఢిల్లీలో ఆరెస్సెస్‌ వార్షిక సమావేశాల సందర్భంగా సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌కు కొంతమంది విదేశీ విలేకరులు సంఘ్‌లో మహిళల పాత్రపై ప్రశ్నలు సంధించారు. ఆ తర్వాత మహిళలకు బాధ్యతలు అప్పగించడంపై ఆరెస్సె్‌సలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. 

Updated Date - 2022-10-05T08:40:07+05:30 IST