TDP రాష్ట్ర కమిటీలో తూర్పు గోదావరి జిల్లా నేతలకు కీలక పదవులు..

ABN , First Publish Date - 2021-10-17T07:52:39+05:30 IST

టీడీపీలో పదవుల పండగ నెలకొంది. దసరా రోజు పార్టీ ప్రకటించిన రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన పలువురు నేతలకు కీలక పదవులు లభించాయి.

TDP రాష్ట్ర కమిటీలో తూర్పు గోదావరి జిల్లా నేతలకు కీలక పదవులు..

  • పదవుల పండగ 
  • పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రామకృష్ణారెడ్డి నియామకం
  • పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ
  • కార్యదర్శులుగా లచ్చయ్యదొర, వాసిరెడ్డి, పిల్లి, కాటంశెట్టి 

(కాకినాడ, ఆంధ్రజ్యోతి) : టీడీపీలో పదవుల పండగ నెలకొంది. దసరా రోజు పార్టీ ప్రకటించిన రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన పలువురు నేతలకు కీలక పదవులు లభించాయి. ఎన్నో ఏళ్ల తర్వాత ఊహించని ముఖ్య పదవులు కొందరు చురుకైన నేతలకు పార్టీ కట్టబెడుతూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు మిన్నంటుతున్నాయి. అనపర్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది. ఇన్నేళ్ల టీడీపీ చరిత్రలో అనపర్తి నియోజకవర్గానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడి పదవి దక్కడం ఇదే తొలిసారి. ఇక్కడ పార్టీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన నేతలు మొదటినుంచీ దాదాపు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువ. దీంతో సామాజికవర్గ కోణంలో పార్టీ పదవుల్లో ఇంతవరకు ఎవరికీ పెద్దగా చోటు కల్పించలేదు. కానీ తొలిసారిగా రామకృష్ణారెడ్డికి సామాజికవర్గ కోణంలో కాకుండా పార్టీ కోసం చురుగ్గా పనిచేస్తున్నారనే నివేదికల నేపథ్యంలో పదవి కట్టబెట్టారు.


వైసీపీ నేతలకు చెందిన గనుల అక్రమాలకు సంబంధించి రెండున్నరేళ్లుగా ఆయన హైకోర్టులో న్యాయపరంగా గట్టిగా పోరాడుతూ నియోజకవర్గంలో అధికారపార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. ఇదే విషయమై ఇటీవల చంద్రబాబు రామకృష్ఱారెడ్డిని అభినందించారు. ఇతర నియోజకవర్గాల్లో కూడా ఆ తరహా పోరాటం చేయాలంటూ.. కొన్నినెలల కిందట ప్రకటించిన మైనింగ్‌ వ్యతిరేక పోరాట కమిటీలో రామకృష్ణారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఇప్పుడు ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టడం విశేషం. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మకు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి హోదా కట్టబెట్టారు. ఈ నియోజకవర్గానికి కూడా పార్టీలో రాష్ట్రస్థాయి పదవి రావడం ఇదే తొలిసారి. గడిచిన రెండేళ్లలో పిఠాపురంలో పార్టీ పరంగా అనేక కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించి పార్టీ రాష్ట్రనేతల దృష్టిని ఆకర్షించారు. అధికార పార్టీ అక్రమాలను నిలదీయడం, పార్టీ కార్యక్రమాలను భారీస్థాయిలో నిర్వహించి విజయవంతం చేయడంలో గుర్తింపు పొందారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడడంలోను సమర్థుడిగా పేరొందారు.


ఈ నేపథ్యంలో ఆయనకు అధికార ప్రతినిధిగా పదవి రావడానికి కారణమైందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. జగ్గంపేటకు చెందిన కె.లచ్చయ్యదొర, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి చెందిన వాసిరెడ్డి రాంబాబు, కాకినాడరూరల్‌ నియోజకవర్గానికి చెందిన పిల్లి సత్యనారాయణమూర్తి, ముమ్మిడివరానికి చెందిన కాటంశెట్టి ప్రభాకర్‌కు పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా అధిష్ఠానం నియమించింది. పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన నేదునూరి వీర్రాజును హెచ్‌ఆర్‌డీ సభ్యుడిగా నియమించింది. కాగా తన నియామకంపై రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అధిష్ఠానం తనకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గుర్తింపు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. పార్టీ కట్టబెట్టిన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. వర్మ మాట్లాడుతూ పార్టీ అధికార ప్రతినిధిగా తనకు బరువైన బాధ్యతలు ఇవ్వడం రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు ఇచ్చినట్లయిందని, ఇకపై ప్రభుత్వ వైఫల్యాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తానని పేర్కొన్నారు. కాగా కొన్నినెలల కిందట టీడీపీ ప్రకటించిన పొలిట్‌బ్యూరోలో జిల్లాకు చెందిన సీనియర్లకు స్థానం కల్పించిన అధిష్ఠానం ఇప్పుడు జిల్లాలో మరికొందరు నేతలకు ముఖ్య పదవులు ఇవ్వడం విశేషం.

Updated Date - 2021-10-17T07:52:39+05:30 IST