Advertisement
Advertisement
Abn logo
Advertisement

రామారావుపేట రోడ్డు సర్వే 25కు వాయిదా


  మునిసిపల్‌ కమిషనర్‌ కనకారావు 

నర్సీపట్నం, అక్టోబరు 22 : పట్టణంలోని పాత స్టేట్‌ బ్యాంకు ఎదురుగా రామారావుపేటకు వెళ్లే రోడ్డు సర్వేను 25వ తేదీకి వాయిదా వేశామని ముని సిపల్‌ కమిషనర్‌ కనకారావు శుక్రవారం తెలిపారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం పక్కన పాత స్టేట్‌ బ్యాంక్‌ ఎదురుగా రామారావుపేటలో సర్వే నెంబరు 129లో రోడ్డు ఆక్రమించి షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించారని సామాజిక కార్యకర్త శివనారాయణరాజు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఐదు నెల క్రితం మునిసిపల్‌ అధికారులు సర్వే చేయించారు. అయితే రెవెన్యూ అధికారులతో సర్వే చేయించాలని షాపింక్‌ కాంప్లెక్స్‌ నిర్మించిన వ్యక్తి కోరారు. శుక్రవారం మునిసిపల్‌ కమిషనర్‌ కనకారావు, తహసీల్దార్‌ జయ, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే అధికారి బాబు కోర్టు ఆదేశాల మేరకు సర్వే చేయడానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ యజమాని కృష్ణ అధికారులతో మాట్లాడుతూ ఆర్డీవో కార్యాలయం ప్రహరీ గోడను కొలమానంగా తీసుకొని సర్వే చేయడం సరికాదన్నారు. కార్యాలయం ప్రహరీ గోడ తన స్థలంలో నిర్మించారని ఆయన అధికారులకు చెప్పారు. సర్వే చేస్తే ఆర్డీవో కార్యాలయంలో 12 అడుగులు తన స్థలం ఉం టుందన్నారు. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి మొత్తం సర్వే చేయాలని కోరారు. అవకాశం ఇస్తే తాను జీపీఎస్‌ సర్వే చేయించుకుంటానని, కొద్ది రోజులు గడువు కావాలని కోరారు. దీంతో ఈ నెల 25న సర్వే చేసి నివేదిక ఇవ్వాలని, 2012లో అప్పటి ఆర్డీవో ఇచ్చిన నివేదిక ఆధారంగా సర్వే చేయాలని ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే అధికారి బాబును కోరామని కమిషనర్‌ తెలిపారు.   ఇదిలావుంటే, రామారావుపేట రోడ్డులో అధికారులు సర్వే చేయడానికి వెళ్లినప్పుడు,  మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని షాపింగ్‌ కాంప్లెక్స్‌ యజమాని కృష్ణ బహిరంగంగా బెదరించారని కమిషనర్‌ కనకారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.   

Advertisement
Advertisement