సంక్షోభం వాయిదా

ABN , First Publish Date - 2020-08-25T05:51:26+05:30 IST

కాంగ్రెస్‌లో సమస్య వచ్చింది. వెళ్లిపోయింది కూడా. మరో ఆరునెలల పాటు సోనియాగాంధీయే అధ్యక్షురాలిగా పార్టీ పనిచేస్తుంది. పార్టీ పద్ధతుల్లో మార్పురావాలని కోరుతూ లేఖ...

సంక్షోభం వాయిదా

కాంగ్రెస్‌లో సమస్య వచ్చింది. వెళ్లిపోయింది కూడా. మరో ఆరునెలల పాటు సోనియాగాంధీయే అధ్యక్షురాలిగా పార్టీ పనిచేస్తుంది. పార్టీ పద్ధతుల్లో మార్పురావాలని కోరుతూ లేఖ రాసిన నేతలు చల్లారిపోయారు. సోనియా–రాహుల్‌ నాయకత్వాన్ని పటిష్ఠం చేయాలని వర్కింగ్‌  కమిటీ తీర్మానం చేసింది. సారాంశం ఏమిటంటే, రానున్న బిహార్‌ ఎన్నికలను కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడున్న నాయకత్వంతోనే, యథాతథ యంత్రాంగంతోనే ఎదుర్కొంటుంది. వచ్చే ఏడాది మేలో జరగవలసి ఉన్న బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికల సమయానికి, అయితే గియితే, కాంగ్రెస్‌కు ఒక పూర్తిస్థాయి, సమర్థ నాయకత్వం ఏర్పడే అవకాశమున్నది. 


పూర్తిస్థాయి, సమర్థ నాయకత్వం అంటే ఏమిటి? సోనియా గాంధీ కంటె ఆ విశేషణాలకు అర్హమైన వారు కాంగ్రెస్‌ పార్టీలో ఎవరున్నారు? కానీ, తాను పెద్దదాన్నయిపోయానని, పార్టీ బరువు మోయలేనని చెబుతున్నారు. కొడుకు ఎదిగి చేతికి వస్తే, బాధ్యతలు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్న తల్లి ఆమె. కానీ, కొడుకు కాడిఎత్తేస్తే, తాను పూర్తి భారాన్ని తలకెత్తుకోవలసి వచ్చింది. ఆ కుమారుడు ఎప్పుడు స్థిమితపడతాడో, ఎప్పుడు ఆమె అభీష్ఠం తీరుతుందో తెలియదు. 


కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పుడు మిగిలినవారంతా, నెహ్రూవంశ వారసులే నాయకత్వం తీసుకోవాలని, వారి ఆధ్వర్యంలోనే పార్టీ ఏకతాటి మీద ఉంటుందని నమ్ముతున్నారు. రెండు వారాల కిందట 23 మంది మాజీ కేంద్రమంత్రులు సోనియాగాంధీకి రాసిన లేఖ కోరింది కూడా– పార్టీప్రక్షాళన, అట్టడుగుస్థాయి నుంచి ఎన్నికలు, పటిష్ఠమైన నాయకత్వం మొదలైన ప్రజాస్వామికమైన అంశాలే. ఆ ఉత్తరాల రచయితలకెవరికీ స్వయంగా నాయకత్వం  తమకు కావాలన్న ఆశల్లేవు. సోనియా–రాహుల్‌కు వ్యతిరేకంగా కుట్రచేసి మరెవరికో సాయంపడే ఉద్దేశ్యాలు కూడా లేవు. లేఖ ఆలస్యంగా, ఆదివారం నాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు కానీ, లేఖరాసినవారే, వర్కింగ్‌ కమిటీ సమావేశం ముందు కావాలనే దాన్ని పొక్కించారని విధేయబృందాలు ఆరోపించాయి. పార్టీ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఆ లేఖ రాసి, ఇబ్బంది పెట్టారని, బిజెపితో చేతులు కలిపారని రాహుల్‌ గాంధీ అన్నట్టుగా వినిపించిన వ్యాఖ్య కలకలం రేపింది. కపిల్‌ సిబల్‌, గులాం నబీ ఆజాద్‌ ఆ వ్యాఖ్యలకు బాగా నొచ్చుకున్నారు. బిజెపితో సంబంధాల మాట రాహుల్‌ గాంధీ అనలేదని తేలడంతో, ఆ అంశం సద్దు మణిగింది. 


పార్టీని ఏమి చేసి బతికించాలో అయోమయంలో ఉన్న నాయకత్వానికి, మాజీ కేంద్రమంత్రుల లేఖ అంతర్మథనానికి ఒక ప్రాతిపదిక అయి ఉండేది. వివిధ సందర్భాలలో కాంగ్రెస్‌ నాయకత్వం స్పందించవలసిన తీరులో స్పందించలేదన్నట్టుగా లేఖారచయితలు చేసిన విమర్శలో సత్యం ఉన్నది. యథాలాపపు, నీరసపు ప్రకటనలను పేర్కొని, స్పందించామని సాక్ష్యాలు చూపితే ఫలితం లేదు. కాంగ్రెస్‌ మీద ప్రజలలో ఇప్పటికిప్పుడు ఎటువంటి ఆశలూ, నమ్మకమూ లేకపోవచ్చును కానీ, రెండో దఫా మోదీ హయాంలో ఒక ప్రతిపక్షం కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు కావలసినదల్లా, ఒక నాయకత్వం, దానికి కాస్త విశ్వసనీయత. అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద ప్రజలు  విసిగిపోయి ప్రత్యామ్నాయంగా తమను ఎంచుకోవాలి తప్ప, తామందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేమని కాంగ్రెస్‌ అనుకుంటున్నదేమో తెలియదు.  పోనీ, అదే జరగాలి అనుకున్నా, ప్రత్యామ్నాయంగా ప్రజలు గుర్తించేట్టు నడవడిక ఉండాలి కదా? దేశంలో ఇప్పుడున్న కేంద్రప్రభుత్వం చాలా కీలకమయిన, వివాదాస్పదమైన నిర్ణయాలను తీసుకుంటున్నది. అనేక నిర్మాణాలను, పద్ధతులను మార్చివేస్తున్నది. వాటి మంచిచెడ్డలను చర్చించి, ప్రజలతో పంచుకునేవారు కావాలి.  విమర్శ నుంచే ప్రత్యామ్నాయాలు పుట్టుకువస్తాయి. దేశం  నాశనమైపోతోందో అని గగ్గోలు పెట్టడం కన్నా, నాశనం కాకుండా నువ్వేమి చేస్తావో దాన్ని ప్రజలు అభినందిస్తారు. పోరాటం చేయకుండానే ఓడిపోయేవారిని ఎవరూ లెక్కలోకి తీసుకోరు. 


ప్రశ్నించిన లేఖనేమో అసమ్మతిగా పరిగణించి, ఖండనమండనలతో వర్కింగ్‌ కమిటీ చర్చను నడిపి, చివరకు సోనియాకు మరో ఆరునెలల పొడిగింపు ఇచ్చి కలకలాన్ని ముగించారు. కాంగ్రెస్‌ పార్టీకి చాలా రోజుల తరువాత రెండురోజులు వరుసగా పత్రికల్లో పతాకశీర్షికలు. ఈ ప్రాధాన్యం కాంగ్రెస్‌కు, దాని ప్రస్తుత నేతలకు మేలు చేసేదేనా? 


కొత్తనేతలు ఆకాశంలోనుంచి ఊడిపడరు. వంశ పరంపరకు చెందక పోతే, నాయకత్వం నిలబడదు అనుకుంటే కనుక, అదే ప్రాతిపదికను కొనసాగించాలి. ఇప్పుడు రాహుల్‌గాంధీ కొత్తగా కుటుంబపాలన గురించి మొహమాటపడితే ఎట్లా? నాకు అక్కరలేదు, మరెవరినన్నా, గాంధీలు కానివారినెవరినైనా ఎంచుకోండి – అంటూ పదే పదే అర్జున విషాదయోగాన్ని ఆలపిస్తున్న రాహుల్‌గాంధీకి నిజంగానే వైరాగ్యం ఉన్నదా – తేల్చుకుని అప్పుడు ఎవరో ఒకరిని కాసింత ప్రజాపునాది ఉన్న నాయకుడినో నాయకురాలినో ఖరారు చేసుకుంటే, పార్టీకి ఒక  కొనసాగింపు ఉంటుంది. ఇంత సరళమైన విషయాన్ని, జటిలం చేసి పీటముడులు వేసి, కాలక్షేపం చేయడం  ఎందుకు?


గజం మిథ్య, పలాయనం మిథ్య. సంక్షోభం మిథ్య, పరిష్కారమూ మిథ్యే. 

Updated Date - 2020-08-25T05:51:26+05:30 IST