ప్రయాణాలు వాయిదా వేసుకోండి..

ABN , First Publish Date - 2022-07-03T16:59:53+05:30 IST

‘సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం జరిగే బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి

ప్రయాణాలు వాయిదా వేసుకోండి..

హైదరాబాద్‌ సిటీ/మారేడ్‌పల్లి: ‘‘సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం జరిగే బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. హెచ్‌ఐసీసీ మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, రాజ్‌ భవన్‌, పంజాగుట్ట, బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌, ఎంజీ రోడ్‌, ఆర్‌పీ రోడ్‌, ఎస్‌డీ రోడ్‌, పరేడ్‌ గ్రౌండ్‌ తదితర ప్రాంతాల వైపు వాహనదారులు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి’’ అని నగర సీపీ ఆనంద్‌ కోరారు. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే విజయ సంకల్ప సభ నేపథ్యంలో భద్రతా చర్యలపై పోలీసు ఉన్నతాధికారులు శనివారం మరోసారి సమీక్షించారు. నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌, అదనపు సీపీ చౌహాన్‌, ఏఆర్‌ శ్రీనివా్‌సలతో పాటు జాయింట్‌ సీపీలు, డీసీపీలు, ఇతర అధికారులు పరేడ్‌గ్రౌండ్‌ను పరిశీలించారు. వివిధ సంఘాల నిరసనలు, ఆందోళనలకు సంబంధించి హెచ్చరికల నేపథ్యంలో జన సమూహాలు సభా స్థలి వైపు రాకుండా కట్టడి చేయాలని అధికారులను సూచించారు. మొత్తం 7 గేట్లు ఉండగా, 3,4, 5, 6, 7వ గేట్ల నుంచి ప్రజలను అనుమతించనున్నట్లు చౌహాన్‌ వెల్లడించారు. మూడు వేల పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని వెల్లడించారు.

ఈ దారులు బంద్‌

బీజేపీ సభ నేపథ్యంలో టివోలీ క్రాస్‌ రోడ్‌ నుంచి ప్లాజా క్రాస్‌ రోడ్‌ మధ్య రహదారి మూసివేస్తారు. దాంతో చిలకలగూడ, అలుగడ్డబాయి, సంగీత్‌, వైఎంసీఏ, ప్యాట్నీ, ఎస్‌బీహెచ్‌ క్రాస్‌ రోడ్లు, ప్లాజా, సీటీఓ జంక్షన్‌, బ్రూక్‌బాండ్‌ జంక్షన్‌, స్వీకార్‌ఉ్‌పకార్‌ జంక్షన్‌, సికింద్రాబాద్‌ క్లబ్‌, తిరుమలగిరి క్రాస్‌ రోడ్‌, తాడ్‌బండ్‌, సెంటర్‌ పాయింట్‌, డైమండ్‌ పాయింట్‌,  బోయినపల్లి క్రాస్‌ రోడ్‌, రసూల్‌పురా, బేగంపేట్‌, ప్యారడైజ్‌ ప్రాంతాల వైపు రాకుండా వాహనదారులు ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని పోలీసులు అభ్యర్థించారు. పరేడ్‌గ్రౌండ్‌ పరిసరాల్లో 3 కిలోమీటర్ల పరిధి వరకు ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉండే అవకాశముందని తెలిపారు. 

 సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ బయటకు వచ్చే/లోనికి వెళ్లే ప్రయాణికులు గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్‌ క్రాస్‌రోడ్స్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, లోయర్‌ ట్యాంక్‌ బండ్‌, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌, ఐమాక్స్‌ రోటరీ, వీవీ విగ్రహం, పంజాగుట్టకు చేరుకోవాలి. స్టేషన్‌కు వెళ్లే వారు కూడా అదే మార్గం ద్వారా వెళ్లాలి. 

 ఉప్పల్‌- తార్నాక-ఆలుగడ్డబావి- చిలకల గూడ ఎక్స్‌ రోడ్‌ - సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌.. తిరిగి అదే మార్గం ద్వారా వెళ్లాలి. 

 ఉప్పల్‌ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే వారు రామంతపూర్‌-అంబర్‌పేట్‌- హిమాయత్‌నగర్‌- వివి విగ్రహం- పంజాగుట్ట వెళ్లాలి. 

 పంజాగుట్ట/అమీర్‌పేట వైపు నుంచి తార్నాక/ఉప్పల్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్‌ - నిరంకారి - సైఫాబాద్‌ - ఇక్బాల్‌ మినార్‌ -తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ - లోయర్‌ ట్యాంక్‌బండ్‌ - కవాడిగూడ - ముషీరాబాద్‌ - చిల్కలగూడ రోటరీ - మెట్టుగూడ వైపు మళ్లిస్తారు.

 బహిరంగ సభకు వచ్చే ప్రజలు పార్కింగ్‌ స్థలాల కోసం పోలీసులు ప్రత్యేకంగా సిద్ధం చేసిన మ్యాప్‌ను పరిశీలించాలని కోరారు.


రైలు ప్రయాణికుల కోసం..

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు సకాలంలో చేరుకునేలా ముందుగానే బయలుదేరాలని పోలీసులు సూచించారు. ప్లాట్‌ఫామ్‌ నంబర్‌ 1 వైపు నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోకి వెళ్లే రూట్‌లో ట్రాఫిక్‌ రద్దీ ఉండే అవకాశముందని, చిలకలగూడ వైపు నుంచి రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌ నెం.10 నుంచి లోపలికి వెళ్లాలని సూచించారు.


పార్కింగ్‌ ఇక్కడే..

 కరీంనగర్‌/ సిరిసిల్ల/సిద్దిపేట/పెద్దపల్లి/జగిత్యాల/మంచిర్యాల (రాజీవ్‌ రహదారి) ప్రాంతాల నుంచి వచ్చే జనం శామీర్‌పేట, తిరుమలగిరి క్రాస్‌ రోడ్డు, బోయిన్‌పల్లి మార్కెట్‌, డైమండ్‌ పాయింట్‌ ద్వారా నగరంలోకి ప్రవేశించి హాకీగ్రౌండ్‌ (ధోబీఘాట్‌) బోయిన్‌పల్లి మార్కెట్‌లో వాహనాలను పార్క్‌ చేయాలి.

 ఆదిలాబాద్‌/ నిర్మల్‌/ నిజామాబాద్‌/ కామారెడి/మెదక్‌/సంగారెడ్డి నుంచి  వచ్చే జనం మేడ్చల్‌, సుచిత్ర, బోయిన్‌పల్లి రోడ్డు, తాడ్‌బండ్‌, కూకట్‌పల్లి, జీడిమెట్ల, బాలానగర్‌ల వద్ద దిగి ఎన్‌సీసీ గ్రౌండ్స్‌లో వాహనాలు పార్క్‌ చేసి కాలినడకన వెళ్లాలి. 

 రంగారెడ్డి/నాగర్‌కర్నూల్‌/అచ్చంపేట్‌ (శ్రీశైలంరోడ్‌), నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్‌, యాదాద్రి, ఘట్‌కేసర్‌ నుంచి వచ్చే జనం రైల్వే డిగ్రీ కళాశాల, తార్నాక వద్ద వాహనాలు పార్క్‌ చేసి వెళ్లాలి. 

 రంగారెడ్డి/మహబూబ్‌నగర్‌/వికారాబాద్‌ నుంచి వచ్చే వారు సంజీవయ్య పార్క్‌, బుద్ధభవన్‌/నెక్లె్‌స రోడ్‌/నల్లగుట వద్ద పార్క్‌ చేయాలి. 

Updated Date - 2022-07-03T16:59:53+05:30 IST