ఇంటర్‌ ఆన్‌లైన్‌ తరగతులు వాయిదా

ABN , First Publish Date - 2020-08-15T08:32:57+05:30 IST

ఇంటర్‌ విద్యార్థులకు ఈ నెల 17 నుంచి నిర్వహించాలనుకున్న ఆన్‌లైన్‌ తరగతులను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఇంటర్‌ ఆన్‌లైన్‌ తరగతులు  వాయిదా

17వ తేదీ నుంచి ఉండవు

ఎప్పుడన్నది తర్వాతే నిర్ణయం

మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడి

ఉత్తర్వులు జారీచేసి..రద్దు చేసిన ఇంటర్‌ బోర్డు 

స్కూళ్లపై ఉత్తర్వులే ఇవ్వని పాఠశాల విద్యాశాఖ 

టీచర్లు పాఠశాలలకు వెళ్లడంపై అయోమయం

‘ప్రైవేటు’కు గుర్తింపే కారణం?


హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ విద్యార్థులకు ఈ నెల 17 నుంచి నిర్వహించాలనుకున్న ఆన్‌లైన్‌ తరగతులను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దీనిపై 17 తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తామని ‘ఆంధ్రజ్యోతి’తో పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు 17 నుంచి తెరవాలని, సిబ్బంది అంతా హాజరై ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ఈ నెల 10వ తేదీనే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతోపాటు పాఠశాలలకు కూడా అదే తేదీ నుంచి 50 శాతం మంది ఉపాధ్యాయులు హాజరు కావాలని, 20వ తేదీ నుంచి 6-10 తరగతుల విద్యార్థులకు దూరదర్శన్‌ ద్వారా ప్రసారాలు ఉంటాయని తెలిపింది. కానీ, ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇంటర్‌ బోర్డు మాత్రం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. 17న ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీలు తెరవాలని, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ అంతా హాజరు కావాలని పేర్కొంది. ప్రవేశాలు ప్రారంభించాలని, సెకండియర్‌ విద్యార్థులకు వాట్సాప్‌ గ్రూపుల ద్వారా పాఠాలు బోధించాలని, దూరదర్శన్‌ ద్వారా అందరూ వినేటట్టు చర్యలు తీసుకోవాలని సూచించింది. వాట్సాప్‌, దూరదర్శన్‌ అందుబాటులో లేని విద్యార్థులకు కూడా పాఠాలు అందేలా చూడాలని ఇంటర్‌ విద్య కమిషనర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఆదేశాల్లో పేర్కొన్నారు. కానీ, కాసేపటికే రద్దు చేశారు.


ప్రైవేటు కాలేజీల అంశమే కారణం..? 

 నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి కారణాలను ఇంటర్‌ బోర్డు అధికారులు తెలపకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వులో ప్రైవేటు జూనియర్‌ కాలేజీల ప్రవేశాలు, ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి ప్రస్తావన చేయలేదు. వాస్తవానికి ప్రైవేటు కాలేజీల గుర్తింపు వ్యవహారం కొలిక్కి రాలేదు. రాష్ట్రంలో 200 కాలేజీలకు గుర్తింపు కూడా లేదు. ఈసారి అమలు చేయాలంటున్న కఠిన నిబంధనల్ని సడలించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇవన్నీ తేలకముందే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలపై బోర్డు నిర్ణయం తీసుకోవడంపై సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసిందని, అందుకే ఉత్తర్వులు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. 


పాఠశాలలపైనా అయోమయం.. 

పాఠశాల విద్యాశాఖలోనూ ఇదే అయోమయం నెలకొంది. 17 నుంచి ఉపాధ్యాయులు హాజరు కావాలనే అంశంపై శుక్రవారం రాత్రి వరకు ఉత్తర్వులు జారీ కాలేదు. 50 శాతం సిబ్బంది హాజరు, కొత్త ప్రవేశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, 20 నుంచి నిర్వహించాలన్న ఆన్‌లైన్‌ తరగతులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. దీనికోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అందించిన ఫైలు శుక్రవారం రాత్రి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దే ఉన్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి అనుమతించిన తర్వాతనే జీవో విడుదల కావాల్సి ఉండటం, శని, ఆదివారాలు సెలవులు కావడంతో సోమవారం నుంచి పాఠశాలల ప్రారంభంపై ఉపాధ్యాయుల్లో అనుమానాలు నెలకొన్నాయి. 

Updated Date - 2020-08-15T08:32:57+05:30 IST