Abn logo
Jul 9 2020 @ 11:23AM

ఈ పోస్టుమాన్ సూపర్ హీరో.. దట్టమైన అడవిలో రోజుకు 15 కిలోమీటర్లు నడిచి..

చెన్నై: దట్టమైన అడవిలో క్రూర మృగాలకు సైతం వెరవకుండా రోజుకు 15 కిలోమీటర్లు నడిచి విధులు నిర్వహించిన ఓ పోస్టుమాన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. బాహ్య ప్రపంచం తొంగిచూడలేని మారుమూల ప్రాంతాలకు సైతం 30 ఏళ్ల పాటు ఉత్తరాలు అందించిన ఆయనను సూపర్ హీరో అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. తమిళనాడులోని కూనూర్ పోస్టుమాన్ డి. శివన్ పదవీ విరమణ సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ‘‘పోస్టుమాన్ డి. శివన్ కూనూర్‌లో ప్రవేశించ వీలుకాని ప్రాంతాల్లో ఉత్తరాలు చేరవేసేందుకు రోజుకు 15 కిలోమీటర్లు దట్టమైన అడవిగుండా నడిచి వెళ్లారు. ఏనుగులు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు వెంటపడినా... జారుతుండే జలపాతాలు, వాగులు వంకలు దాటుకుంటూ సేవలు అందించారు. గతవారంలో రిటైర్ అయ్యేంత వరకు 30 ఏళ్లపాటు అత్యంత అంకితభావంతో పనిచేశారు..’’ అని ఆమె పేర్కొన్నారు. 


66 ఏళ్ల శివన్ తన విధుల్లో భాగంగా ‘నీలగిరి మౌంటైన్ రైల్వే’ ట్రాక్‌ మీదుగా వెళ్లేటప్పుడు పలుమార్లు ఏనుగులు, ఎలుగుబంట్లు , ఇతర అడవి జంతువులు వెంటపడినట్టు గతంలో గుర్తుచేసుకున్నారు. ఎన్నోసార్లు విష సర్పాలు సైతం ఆయనపై బుసకొట్టాయి. అయినా శివన్ ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. 2016లో వచ్చిన ఓ కథనం ప్రకారం ఆయన జీతం రూ.12 వేలు. కాగా శివన్ సేవలపై సుప్రియా సాహు ట్విటర్లో పెట్టిన పోస్టుకు ఇప్పటికే 62 వేల మందికి పైగా లైక్ చేశారు. 12.6 వేల మంది రీట్వీట్ చేశారు. కూనూర్ పోస్టు ఆఫీసుకు శివన్ పేరు పెట్టాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తుండగా.. అత్యున్నత పౌర పురస్కారాలైన భారత రత్న, పద్మశ్రీ అవార్డులకు ఆయన అర్హుడని గతంలో ఇంటర్వ్యూ చేసిన ఓ సీనియర్ జర్నలిస్టు పేర్కొన్నారు. ‘‘దేశ నిర్మాణంలో ఆయన పాత్ర కొనియాడదగినది. ఆయన అంకితభావానికి శిరసువంచి నమస్కరిస్తున్నా..’’ అని ఐపీఎస్ అధికారి విజయకుమార్ పేర్కొన్నారు. 


Advertisement
Advertisement