Abn logo
Apr 8 2021 @ 01:33AM

పొలిటికల్‌ ‘పోస్టింగ్‌’లు జీ హుజూర్‌.. అన్నోళ్ల‌కు అందలం

మెచ్చిన శాఖలో నచ్చిన సీటు 

సీనియార్టీ, సిన్సీయార్టీకి లేదు చోటు 

రూల్స్‌ పాటిస్తే మరుసటిరోజే సీటుకు ఎసరు


‘అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచం’లో అనే నానుడి అధికారుల బదిలీలకు సరిగ్గా సరిపోతుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరుగుతున్న బదిలీల్లో భారీ లాబీయింగ్‌ జరుగుతోంది. కమిషనర్ల దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో సిబ్బంది వరకు తమ అనుయాయులను పట్టుబట్టి మరీ కొందరు ప్రజా ప్రతినిధులు నియమించుకుంటున్నారు. సిబ్బంది సీనియార్టీ, సిన్సియార్టీని పట్టించుకోవడం లేదు. మహబూబ్‌నగర్‌కు చెందిన ప్రజాప్రతినిధి ఈ విషయంలో చక్రం తిప్పుతుండడం గ్రేటర్‌లో చర్చనీయాంశంగా మారింది.


హైదరాబాద్‌ సిటీ/దుండిగల్‌/నిజాంపేట ఏప్రిల్‌7 (ఆంధ్రజ్యోతి) : జీహెచ్‌ఎంసీతో పాటు శివారు కార్పొరేషన్లు బడంగ్‌పేట, మీర్‌పేట, ఫీర్జాదిగూడ, బోడుప్పల్‌, జవహర్‌నగర్‌, నిజాంపేట, బండ్లగూడజాగీర్‌, మున్సిపాలిటీలైన పెద్ద అంబర్‌పేట, నార్సింగ్‌, మణికొండ, కొంపల్లి, దుండిగల్‌, జల్‌పల్లి, తుర్కయాంజల్‌లో పోస్టింగ్‌లకు చాలా మంది పోటీ పడుతున్నారు. అధికార పార్టీ నేతల ద్వారా లాబీయింగ్‌ చేస్తున్నారు. దీంట్లో కొందరు అధికారులు సఫలీకృతులయ్యారు. మరి కొందరు ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్నారు. చేనేత శాఖకు చెందిన ఓ అధికారి జీహెచ్‌ఎంసీలో జోనల్‌ కమిషనర్‌ సీటును తన పలుకుబడితో సొంతం చేసుకున్నారు. ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేసే ఓ మహిళా అధికారి జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. కానీ అక్కడి పాలక వర్గానికి ఆ అధికారి పొసగలేదు. వారి ఒత్తిడి తట్టుకోలేక చివరకు తన మాతృసంస్థకు వెళ్ళారు. 


ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సీనియార్టీ, సిన్సీయార్టీకి ప్రాధాన్యమివ్వడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముషీరాబాద్‌ సర్కిల్‌లో డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌గా పని చేసిన ఓ మహిళా ఆఫీసర్‌ను గ్రేటర్‌ ఎన్నికలకు ముంద అనూహ్యంగా బదిలీ చేశారు. ఆమెను హెడ్‌ ఆఫీసుకు రిపోర్టు చేయాలని కమిషనర్‌ ఆదేశాలిచ్చారు. కొంత మంది కార్పొరేటర్లు, ఓ ఎమ్మెల్యే ఒత్తిళ్లే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సాధారణ బదిలీల్లో వచ్చే అధికారులైనా, ఉద్యోగులైనా స్థానిక ప్రజా ప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గితే సరే, లేకుంటే మరుసటి రోజు బదిలీ అర్డర్‌ చేతుల్లో పెడుతున్న పరిస్థితి కొనసాగుతోంది. 


ఆరు మాసాల్లోనే 

దుండిగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా పని చేస్తున్న ఓ మహిళా ఆఫీసర్‌ ఆరు నెలలు పూర్తిగాక ముందే బదిలీ అయ్యారు. అక్రమ నిర్మాణాలపై కఠినంగా ఉండడంతో ఆమె సీటుకు ఎసరు పెట్టినట్లు తెలిసింది. కౌన్సిలర్లతో సంబంధం లేకుండా తన విధులు నిర్వహించుకు పోవడం వారికి కంటగింపుగా మారింది. ఆఫీసుకు వివిధ పనుల నిమిత్తం వచ్చే సందర్శకులు మధ్యాహ్నం 3 తర్వాతే సంప్రదించాలని, సెల్‌ఫోన్లు తీసుకురావద్దని నిబంధనలు పెట్టారు. ఇవి నచ్చక చాలా మంది కౌన్సిలర్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్లు తెచ్చి ఆమెను అక్కడి నుంచి పంపేసినట్లు తెలిసింది. 

నిజాంపేటలో 

నిజాంపేట కార్పొరేషన్‌కు కమిషనర్‌ నియమాకంలో ప్రజాప్రతినిధులతో పాటు కొంత మంది డెవలపర్లు సైతం కీలకంగా మారారు. అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించిన వారిపై అక్కడ వేటు పడుతోంది. కార్పొరేషన్‌ తొలి కమిషనర్‌ ఏడు నెలల్లోనే బదిలీ కావడంపై పలు విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కమిషనర్‌గా వచ్చిన అధికారి కూడా అనుమతుల్లేని నిర్మాణాలపై కొరడా ఝలిపించారు. ఆయన కూడా నాలుగు నెలల్లోనే బదిలీ అయ్యారు. స్థానిక ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 


సీట్లను వదలని ఆఫీసర్లు

మున్సిపాలిటీలో, కార్పొరేషన్లలో వివిధ హోదాల్లో పని చేసే కొందరు అధికారులు ఆయా సీట్లను వదులుకోవడం లేదు. ఏళ్లకు ఏళ్లుగా అదే స్థానంలో ఉంటున్నారు. వేతనం కంటే పై సంపాదన అధికంగా ఉండడంతో ప్రజా ప్రతినిధుల అండదండలు సంపాదించి అక్కడే పాతుకుపోతున్నారు. కొందరు పదోన్నతులు పొందినా ఇక్కడి నుంచి వెళ్లడం లేదు. ఓ మహిళా అధికారి వెస్ట్‌జోన్‌ మినహా మరే ప్రాంతానికీ బదిలీ కావడం లేదు. డీఎంసీ నుంచి జోనల్‌ కమిషనర్‌ వరకు వివిధ గ్రేడ్‌లలో పదోన్నతులు పొందినా ఆయా ప్రాంతాలను మాత్రం వదలడం లేదు. పలువురు డిప్యూటీ కమిషనర్లు నాలుగేళ్లకు పైగా వివిధ సర్కిళ్ల పరిధిలోనే పని చేస్తున్నారు.  సరూర్‌ నగర్‌ సర్కిల్‌ ఉప కమిషనర్‌గా పనిచేస్తున్న ఓ అధికారి గతంలో ఇక్కడే సహాయ కమిషనర్‌గా పనిచేశారు. బదిలీపై అంబర్‌పేట ఉపకమిషనర్‌గా వెళ్లి మళ్ళీ ఇక్కడికే వచ్చారు. హయత్‌నగర్‌ సర్కిల్‌లో సహాయ కమిషనర్‌గా పనిచేస్తున్న ఓ అధికారి సైతం తనకు నచ్చిన రాజేంద్రనగర్‌, చార్మినార్‌ సర్కిళ్లకే బదిలీ అవుతున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల అడుగులకు మడుగులొత్తే కొందరు ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, ప్లానింగ్‌ ఆఫీసర్లు, పారిశుధ్య సిబ్బంది ఏళ్లకు ఏళ్లుగా ఒకే ప్రాంతంలో ఉంటూ కింగ్‌ మేకర్లుగా మారారు.


Advertisement
Advertisement