పైరవీలకు వేళాయె..

ABN , First Publish Date - 2022-06-12T05:50:41+05:30 IST

బదిలీలకు తెరలేయడంతో కావాల్సిన స్థానాల కోసం అధికారులు పైరవీలకు తెరలేపారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

పైరవీలకు వేళాయె..

పోస్టింగుల కోసం అధికారుల పాట్లు

ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ 

ముఖ్య స్థానాల కోసం పట్టు 

సిఫార్సు లేఖల వేటలో ఉద్యోగులు 

తమకు అనుకూలంగా ఉన్నవారి వైపే 

ప్రజాప్రతినిధుల మొగ్గు

హిందూపురం టౌన, జూన 11: బదిలీలకు తెరలేయడంతో కావాల్సిన స్థానాల కోసం అధికారులు పైరవీలకు తెరలేపారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సిఫార్సు లేఖలు పొందేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో అన్నిశాఖల్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టనున్నారు. ఐదు, ఎనిమిదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాలని నిబంధనలు ఉండటంతో వారికి నచ్చిన స్థానాల కోసం పట్టుబడుతున్నారు.


ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ

సాధారణ బదిలీలు ప్రారంభం కావడంతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల చుట్టూ బదిలీ అయ్యే అధికారులు ప్రదక్షిణ చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పైరవీలు చేస్తూ వారికి కావాల్సిన స్థానాల కోసం వేడుకుంటున్నారు. ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇనచార్జి సిఫార్సు లేఖల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ కార్యాలయాల్లో రాజకీయ అండదండలతో పాతుకుపోయిన వారికి కూడా స్థానచలనం తప్పేలా లేదు. దీంతో ప్రజాప్రతినిధుల లేఖల కోసం వేచి చూస్తున్నారు. కొన్ని కార్యాలయాల్లో అధికార పార్టీ ముద్ర పడిన అధికారులు బదిలీల విషయంలో చక్రం తిప్పుతున్నారు. ప్రజాప్రతినిధులకు దగ్గరగా ఉన్నవారికి పోస్టింగ్‌ కోసం అభ్యర్థిస్తున్నారు.


పోలీసు, రెవెన్యూ శాఖల్లో అధికం 

బదిలీల్లో పోలీసు, రెవెన్యూ శాఖల్లో రాజకీయ ప్రమేయం అధికంగా ఉంటుంది. ఈ శాఖలతోనే రాజకీయ నాయకులకు అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు శాఖలతోపాటు మునిసిపాలిటీలో పనిచేసే ఉద్యోగులు వారికి కావాల్సిన స్థానాల కోసం పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. హిందూపురంలో నలుగురు సీఐలు ఉండగా.. ప్రస్తుతం ఒకరిద్దరికి స్థానచలనం తప్పదని తెలుస్తోంది. దీంతో తమకు కావాల్సిన వారినే తెచ్చుకునే పనిలో ప్రజాప్రతినిధులు నిమగ్నమయ్యారు. మూడు స్థానాలు ఖాళీ అవుతాయనే ప్రచారం నేపథ్యంలో ఇప్పటికే 10 మంది సీఐలు.. ప్రజాప్రతినిధుల వద్దకు వచ్చి ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక్కడున్నవారు కూడా ఇతర ప్రాంతాల్లో పోస్టింగ్‌ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ విభాగంలో నియోజకవర్గంలోని తహసీల్దార్‌ పక్క మండలం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. సంబంధిత ప్రజాప్రతినిధిని ప్రసన్నం చేసుకున్నారు. మరో తహసీల్దార్‌ రెవెన్యూలోని మరో విభాగానికి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. డీటీలు ఇతర ప్రాంతాలకు అనువుగా ఉన్నచోట్ల సదరు ప్రజాప్రతినిధుల వద్ద లేఖలు పెట్టి వచ్చారు. మునిసిపాలిటీలో ఇంజనీరింగ్‌ విభాగ ముఖ్య అధికారితోపాటు మరికొంతమంది ఇతర ప్రాంతాల్లో అనువైన ప్రాంతం కోసం కర్చీ్‌ఫలు వేశారు. అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో మునిసిపల్‌ విభాగంలో పనిచేసిన అధికారి ఇతర ప్రాంతంలో పనిచేస్తున్నారు. ఆయన మరోసారి ఇక్కడికి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకు ఇక్కడి ప్రజాప్రతినిధి ససేమిరా అన్నట్లు తెలిసింది. ఆయన ఉద్యోగం కంటే రాజకీయాలే ఎక్కువగా చేస్తారనీ, అందుకోసమే ఆయనను ఇక్కడకు పంపకూడదని ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధి చేరవేసినట్లు తెలిసింది.


Updated Date - 2022-06-12T05:50:41+05:30 IST