వారణాసి ఘాట్ల వద్ద హిందూయేతరులకు ప్రవేశం లేదంటూ పోస్టర్లు

ABN , First Publish Date - 2022-01-07T20:33:03+05:30 IST

హిందూయేతరలకు వారణాసి ఘాట్ల వద్ద ప్రవేశం లేదంటూ గంగానదీ పరిసర ప్రాంతాల్లోని..

వారణాసి ఘాట్ల వద్ద హిందూయేతరులకు ప్రవేశం లేదంటూ పోస్టర్లు

వారణాసి: హిందూయేతరలకు వారణాసి ఘాట్ల వద్ద ప్రవేశం లేదంటూ గంగానదీ పరిసర ప్రాంతాల్లోని గోడలపై శుక్రవారంనాడు పలు పోస్టర్లు వెలిశాయి. ''ఇది విజ్ఞప్తి కాదు..హెచ్చరిక'' అని కూడా ఆ పోస్టర్లలో రాసి ఉంది. విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ), బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు ఈ పోస్టర్లను అంటించినట్టు తెలుస్తోంది.


కాగా, వారణాసి ఘాట్లను విహారయాత్రా ప్రాంతాలుగా (పిక్నిక్ స్పాట్స్) భావించే వారికి ఈ పోస్టర్ల ద్వారా చాలా స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నట్టు బజరంగ్ దళ్ సిటీ కన్వీనర్ నిఖిల్ త్రిపాఠి 'రుద్ర' తెలిపారు. ''గంగా ఘాట్లకు దూరంగా ఉండాలని మేము వారిని హెచ్చరిస్తున్నాం. ఈ ఘాట్లు సనాతన సంస్కృతీ చిహ్నాలు'' అని ఆయన చెప్పారు. సనాతన ధర్మం పట్ల గౌరవం లేనివాళ్లు ఘాట్‌లు, ఆలయాలకు రావాల్సిన అవసరం లేదని వీహెచ్‌పీ సిటీ కార్యదర్శి రాజన్ గుప్తా తెలిపారు. సనాతన ధర్మాన్ని గౌరవించే పక్షంలో వారిని (హిందూయేతరులు) ఆహ్వానిస్తామని చెప్పారు.


ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు వారణాసి వస్తుంటారు. గంటల తరబడి ఘాట్ల వద్ద సంచరిస్తూ స్థానిక ప్రజలతో ముచ్చటిస్తుంటారు. అయితే పర్యటకులు ఇక్కడ ధూమపానం చేస్తుండటం పట్ల హిందూ సంస్థలు గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కొత్త సంవత్సరం రోజు ఈ సంస్థల కార్యకర్తలు చాంద్‌మరి ప్రాంతంలోని చర్చి వద్ద ప్రదర్శన నిర్వహించడంతో పాటు హనుమాన్ చాలీసా పఠించారు.

Updated Date - 2022-01-07T20:33:03+05:30 IST