వీళ్లతో పెట్టుకుంటే.. పోస్టర్‌ పడుద్ది!

ABN , First Publish Date - 2020-11-30T05:30:00+05:30 IST

మన శరీరానికి ముఖం ఎంత ముఖ్యమో.. సినిమాకి పోస్టర్‌ అంత ముఖ్యం. సినిమాలోని ముఖ్యమైన విషయాన్నింటినీ ఒడిసిపట్టి- ప్రేక్షకుడిని థియేటర్‌ వైపు లాక్కువెళ్లే శక్తి పోస్టర్‌కు ఉంటుంది. థియేటర్‌ ముందు పెట్టే 24 షీట్ల పోస్టర్‌ నుంచి.. సినిమా తేదీని ఎనౌన్స్‌ చేసే సోషల్‌ మీడియా పోస్ట్‌ దాకా- ప్రతి పోస్టర్‌కు ఒక కథ ఉంటుంది...

వీళ్లతో పెట్టుకుంటే.. పోస్టర్‌ పడుద్ది!

మన శరీరానికి ముఖం ఎంత ముఖ్యమో.. సినిమాకి పోస్టర్‌ అంత ముఖ్యం. సినిమాలోని ముఖ్యమైన విషయాన్నింటినీ ఒడిసిపట్టి- ప్రేక్షకుడిని థియేటర్‌ వైపు లాక్కువెళ్లే శక్తి పోస్టర్‌కు ఉంటుంది. థియేటర్‌ ముందు పెట్టే 24 షీట్ల పోస్టర్‌ నుంచి.. సినిమా తేదీని ఎనౌన్స్‌ చేసే సోషల్‌ మీడియా పోస్ట్‌ దాకా- ప్రతి పోస్టర్‌కు ఒక కథ ఉంటుంది. ఇలాంటి పోస్టర్ల వెనకున్న కథను చెప్పటానికి ప్రముఖ డిజైనర్లు అనీల్‌-భానులను నవ్య పలకరించింది. 


కొవిడ్‌ మొత్తం సిని పరిశ్రమనే దెబ్బతీసింది కదా.. మీకెలా ఉంది?

అనీల్‌: నిజం చెప్పాలంటే కొవిడ్‌ సమయంలో మాకు ఎక్కువ పనిలేదు. ఈ మధ్యనే ఓటీటీల కోసం మళ్లీ పనులు ప్రారంభమవుతున్నాయి. పని కన్నా- సినిమా విడుదల సమయంలో ఉండే ఒత్తిడి.. హడావిడి.. ఉత్కంఠ.. వీటిని ఎక్కువగా మిస్‌ అవుతున్నాం. 


పోస్టర్‌ డిజైనింగ్‌ గురించి అందరికీ చాలా తక్కువ తెలుసు. దీనిని మీరు ఎలా నిర్వచిస్తారు?

అనీల్‌: సినిమాకు పోస్ట్‌ ప్రొడక్షన్‌ ఎంత ముఖ్యమో.. డిజైనింగ్‌ కూడా అంతే ముఖ్యం. డిజైనింగ్‌ పని సినిమాను ఎనౌన్స్‌ చేసినప్పటి నుంచి మొదలవుతుంది. ఫొటోషూట్‌లు.. షూటింగ్‌.. ఇలా అడుగడుగున మేము భాగస్వాములవుతూనే ఉంటాం. ఒక ఇల్లు లోపల ఎంత అద్భుతంగా ఉన్నా.. బయట గోడలకు వేసే రంగులు బావుండకపోతే..ఆ ఇల్లు ఎవరిని ఆకర్షించదు. డిజైనింగ్‌ కూడా అంతే! సినిమా ఎంత బాగా తీసినా.. పబ్లిసిటి ఒక పద్ధతి ప్రకారం లేకపోతే దెబ్బతింటుంది. ముఖ్యంగా పోస్టర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమాలో కంటెంట్‌ను పోస్టర్‌ స్పష్టంగా చెప్పాలి. లేకపోతే ప్రేక్షకులు ఒక దాని బదులు మరొకటి అనుకుంటారు. అలా దెబ్బతిన్న సినిమాలు కూడా ఉన్నాయి. 


ఎలాంటి పోస్టర్లు డిజైన్‌ చేయటం కష్టం.. మిమల్ని ఇబ్బంది పెట్టిన పోస్టర్లు ఏవైనా ఉన్నాయా?

భాను: ప్రతి పోస్టర్‌ ఛాలెంజే! ముఖ్యంగా ప్రేమ కథలకు పోస్టర్లు చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే- మనకొచ్చే సినిమాల్లో ఎక్కువ శాతం ప్రేమ కథలే ఉంటాయి. అందువల్ల ప్రతి పోస్టర్‌ను కొత్తగా చూపించాల్సి ఉంటుంది. ఇక రీమేక్‌లకు పోస్టర్లు తయారుచేయటం కొంత కష్టమే! ప్రేమమ్‌ సినిమా మలయాళంలో పెద్ద హిట్‌! పోస్టర్లు చాలా బావుంటాయి. ఈ సినిమాను రీమేక్‌ చేసినప్పుడు- రెండు భాషల పోస్టర్ల మధ్య పోలిక వస్తుందేమోనని టెన్షన్‌ పడ్డాం. అందరూ తెలుగు పోస్టర్‌ను కూడా మెచ్చుకున్నారు. 

పోస్టర్‌ డిజైనింగ్‌ కళ తప్పుతున్న కళ అంటారా! ఒకప్పుడు ఎక్కడ చూసినా పోస్టర్లు కనిపించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా!

అనిల్‌: వాస్తవానికి ఇప్పుడు పని బాగా పెరిగింది. అదే సమయంలో సౌలభ్యమూ ఉంది. ఒకప్పుడు పోస్టర్లను మాన్యువల్‌గా డిజైన్‌ చేసేవారు. ఫొటోలు తీయించి.. వాటిని కట్‌ చేసి అంటించి.. ఆ తర్వాత స్ర్కీన్‌ ప్రింటింగ్‌ చేయించాల్సి వచ్చేవి. ఆ పోస్టర్‌ నిర్మాతకో.. డైరక్టర్‌కో నచ్చకపోతే - పని మళ్లీ మొదలయ్యేది. ఇప్పుడు డిజిటలైజేషన్‌ వల్ల కొంత శ్రమ తగ్గింది. కొత్త కొత్త సాఫ్ట్‌వేర్‌లు వచ్చాయి. అయితే ఇప్పుడు సోషల్‌ మీడియా ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఒక వైపు మాములు పోస్టర్లతో పాటుగా- సోషల్‌ మీడియాకు కూడా ప్రత్యేకంగా పోస్టర్లు డిజైన్‌ చేయాల్సి వస్తోంది. ఇంటి వాల్స్‌ మీద అంటించే పోస్టర్ల కన్నా ఫేస్‌బుక్‌వాల్స్‌పై వేసే పోస్టర్ల సంఖ్య పెరిగింది. 

భాను: నా దృష్టిలో ఒకప్పుడు ఉన్న ఎక్జైట్‌మెంట్‌ ఇప్పుడు తగ్గింది. ఒక గోడ మీదో.. థియేటర్‌ ముందో పోస్టర్‌ చూడటం వేరు! దానిలో ఆర్టిస్టు పనితనం కనిపిస్తుంది. మొబైల్‌లో పోస్టర్‌ను చూస్తే పెద్ద ఆసక్తి ఉండదు.


తెలుగు పోస్టర్లలో హీరో, హీరోయిన్లలే ఎక్కువగా ఎందుకు పెడతారు? పైగా పోస్టర్లు ప్రతి వారం మారిపోతూ ఉంటాయి కూడా..

అనీల్‌: దీనికి ప్రధాన కారణం ప్రేక్షకులు, ఫ్యాన్స్‌. ఉదాహరణకు చిరంజీవి సినిమా అనగానే మనకు ఒకే రకం పోస్టర్‌ గుర్తుకొస్తుంది. ఆ పోస్టర్‌లో ఆయన పెద్దగా కనిపించాలి. కొత్తగా ఉండాలి. అంతే కాకుండా.. వారానికి ఒక పోస్టర్‌ పడుతూ ఉండాలి. లేకపోతే ఫ్యాన్స్‌, డిస్ట్రిబ్యూటర్స్‌, థియేటర్‌ ఓనర్స్‌ ఒప్పుకోరు. మీకో ఉదాహరణ చెబుతాను. సైరా సినిమాకు మేము కేవలం ఆరు పోస్టర్లు మాత్రమే డిజైన్‌ చేశాం. చిరంజీవిగారు కూడా ఆ పోస్టర్లనే వేద్దామన్నారు. సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ఫ్యాన్స్‌ ఒప్పుకోలేదు. ఇంకా.. ఇంకా.. అని అడుగుతూనే ఉన్నారు. వారి ఒత్తిడి తట్టుకోలేక మళ్లీ మళ్లీ డిజైన్లు చేయాల్సి వచ్చింది. ఇలా మొదట ఆరు అనుకున్న పోస్టర్లు.. చివరకు 40 వరకూ వెళ్లిపోయాయి. 


పోస్టర్‌ డిజైన్ల సంఖ్య కూడా తక్కువేనమో కదా..

భాను: హాలీవుడ్‌లో ఒక సినిమాకు ఒక పోస్టరే ఉంటుంది. అన్నింటికీ దానినే వాడతారు. బాలీవుడ్‌లో కూడా నాలుగైదు పోస్టర్ల కన్నా వాడరు. మన దగ్గరే వారానికి ఒక పోస్టరు చొప్పున సినిమా సక్సెస్‌ ఆధారంగా పోస్టర్ల సంఖ్య పెరుగుతుంది. 

అనీల్‌: సోషల్‌ మీడియాతో పాటుగా పోస్టర్ల సంఖ్య కూడా పెరిగిపోయింది. సినిమా ఎనౌన్స్‌మెంట్‌ నుంచి సినిమా విడుదలయ్యే వరకూ దాదాపు 30 పోస్టర్లు అవసరమవుతున్నాయి. ఎనౌన్స్‌మెంట్‌, ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ రిలీజ్‌, సాంగ్‌ రిలీజ్‌లు- ఇలా ప్రతి దానికీ ఒక పోస్టరు అవసరమవుతోంది.  


దీని వల్ల క్వాలిటీ దెబ్బతింటుంది కదా..

భాను: క్వాలిటీ కన్నా.. సృజనాత్మకంగా ఒక కథను పోస్టర్‌ రూపంలో చెప్పటానికి అవకాశాలుండవు. ప్రస్తుతం- ఎవరైనా సినిమాను ఎనౌన్స్‌ చేశారనుకోండి. కాంబినేషన్‌, బ్యానర్‌, ఇతర వివరాలు తెలిపే పోస్టర్‌ వేయాలి. ఆ తర్వాత ప్రీ లుక్‌. ఆ తర్వాత టీజర్‌ పోస్టర్‌. ఆ తర్వాత ఫస్ట్‌ లుక్‌. ఇవి పూర్తయ్యే సరికి టీజర్‌. ఆ తర్వాత ఐదు లిరికల్‌ వీడియో పోస్టర్లు. మళ్లీ ట్రైలర్‌ పోస్టర్‌. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌. సెన్సార్‌ పూర్తయిన తర్వాత పోస్టర్‌. రిలీజ్‌డే పోస్టర్‌. ఇక విడుదలయిన తర్వాత ప్రతి వారం ఒక పోస్టర్‌.. ఇలా ఒకే సినిమా గురించి ఎన్ని విధాలుగా చెప్పగలం?



ఆ రెండూ  వేర్వేరు..

‘‘సోషల్‌ మీడియాలోను.. బయట సెన్సిబులిటీలలో తేడా ఉంటుంది. ఒక మాస్‌ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో వేయలేం. ‘ఊరగా ఉంది’ అంటారు. అదే పోస్టర్‌ను థియేటర్‌ బయట వేస్తే అది వెంటనే ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్‌- ‘అరే... అదిరిపోయింది. హీరో సూపర్‌గా ఉన్నాడు’ అనుకుంటారు. సొషల్‌ మీడియా కోసం చేసే డిజైన్లు భిన్నంగా ఉండాలి. చిన్న మొబైల్‌లో కూడా ఎలిమెంట్స్‌ అన్నీ స్పష్టంగా కనిపించాలి. లేకపోతే డిజైన్‌ ఫెయిల్‌ అవుతుంది. 


పోస్టర్లు రకరకాలు..

ధియేటర్‌ ముందు వేసేది పెద్ద పోస్టర్‌. దీనిని 24 షీట్‌ అంటారు. ఇది 20 బై 10 అడుగులు ఉంటుంది. వీటి కన్నా చిన్నవి 6 షీట్స్‌. వీటిని పెద్ద గోడల మీద అంటిస్తారు. ఆ తర్వాత 4 షీట్స్‌, 3 షీట్స్‌ పోస్టర్లు కూడా ఉంటాయి. వీటిని గోడల మీద, పాన్‌ డబ్బాల మీద అంటిస్తూ ఉంటారు.ఎన్ని థియేటర్లలో విడుదల చేస్తే అన్ని 24 షీట్‌ పోస్టర్లను ప్రింట్‌ చేస్తారు. 6 షీట్‌ పోస్టర్లు ప్రతి ఊర్లోను అంటించటానికి 10 నుంచి 15 వరకూ ప్రింట్‌ చేస్తారు. ఇక ఆ తర్వాత వేసే పోస్టర్ల సంఖ్య- సినిమా సక్సెస్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ పోస్టర్లు హైదరాబాద్‌, విజయవాడ, శివకాశీలలో ప్రింట్‌ అవుతాయి. 


ఆసక్తితోనే.. 

మేము ఎవరి దగ్గర పనిచేయలేదు. కేవలం సినిమాపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చా. మొదట్లో మ్యూజిక్‌ క్యాసెట్లకు డిజైన్‌ చేసేవాళ్లం. ఆ తర్వాత సినిమా పోస్టర్లు చేయటం మొదలుపెట్టాం. ఇప్పటి దాకా సుమారు 300లకు పైగా డిజైన్లు చేసి ఉంటాం.  ఈ మధ్య కాలంలో చాలామంది ఈ రంగంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ‘అవకాశాలుంటే చెప్పండి’ అనేవారు అనేక మంది ఉన్నారు.

- సివిఎల్‌ఎన్‌



Updated Date - 2020-11-30T05:30:00+05:30 IST