తపాలా ఉద్యోగుల్ని వణికిస్తున్న ‘ఆధార్‌’

ABN , First Publish Date - 2020-09-17T06:36:59+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సర్కిళ్ల పరిధిలోని తపాలా ఉద్యోగుల వెన్నులో ‘ఆధార్‌’ వణుకు మొదలైంది. పోస్టాఫీసుల్లో ఆధార్‌ సెంటర్లను మళ్లీ పునః ప్రారంభించాలన్న...

తపాలా ఉద్యోగుల్ని వణికిస్తున్న ‘ఆధార్‌’

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సర్కిళ్ల పరిధిలోని తపాలా ఉద్యోగుల వెన్నులో ‘ఆధార్‌’ వణుకు మొదలైంది. పోస్టాఫీసుల్లో ఆధార్‌ సెంటర్లను మళ్లీ పునః ప్రారంభించాలన్న పై అధికారుల తాజా ఉత్తర్వులు వీరిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఉద్యోగులు అధిక సంఖ్యలో సెలవులు పెట్టి ఇళ్లకే పరిమితమవుతున్నారు. 50 ఏళ్లు పైబడ్డ సీనియర్‌ పోస్టల్‌ అసిస్టెంట్ల (పిఎ) పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ‘ఆధార్‌ సెంటర్‌’ మాట వింటేనే ఉలిక్కి పడుతున్నారు. కరోనా వైరస్‌ కోరలు చాస్తున్న క్లిష్ట సమయంలో ఆధార్‌ సెంటర్లను తిరిగి ప్రారంభించాలనడం భావ్యం కాదని నెత్తీనోరూ బాదుకుంటున్నారు. గతంలోనూ పోస్టాఫీసుల్లో ఆధార్‌ సెంటర్లు పనిచేశాయి. అప్పట్లో లేని భయం ఇప్పుడెందుకని ఆరా తీస్తే అంతటా ఒకటే సమాధానం... కరోనా వైరస్‌.


లాక్‌డౌన్‌ రోజుల్లో కూడా పోస్టాఫీ సులు బాగా పనిచేశాయి. అత్యవసర సేవల కింద ప్రజలకు అన్నివిధాలా అందుబాటులో ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు, స్పీడ్‌ పోస్టు సేవల్ని నిర్విఘ్నంగా నిర్వర్తించాయి. మార్చి వరకూ పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాలు నడిచాయి. ఆ తరువాత వీటి ద్వారా వైరస్‌ వ్యాప్తి ఎక్కువవుతుందని వాటి నిర్వహణను తాత్కాలికంగా నిలిపేశారు. ఐదు నెలల తరువాత మళ్లీ ఈ సెంటర్లను ప్రారంభించేందుకు తపాలా శాఖ హెడ్‌ పోస్టాఫీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్‌ సేవలను తిరిగి ప్రారంభించాలని పోస్టు మాస్టర్లపై ఒత్తిళ్లు మొదలయ్యాయి. దీంతో ఉద్యోగుల్లో భయం మొదలైంది.


పోస్టాఫీసుల్లో ఆధార్‌ సేవలు మొదలయ్యాయని తెలిస్తే చాలు... జనం పెద్ద సంఖ్యలో క్యూలు కట్టడం ఖాయం. కొత్తగా ఆధార్‌ కార్డుల కోసం పేర్లు నమోదు చేయించుకునే వారి దగ్గర నుంచి ఆయా కార్డుల్లో పేర్లు, డోర్‌ నెంబర్లు, ఇతరత్రా తప్పులను సరిచేయించుకోవడానికి, చిరునామా మార్చుకోవడానికి జనం పోస్టాఫీసుల బాట పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల తపాలా సర్కిళ్ల పరిధిలో రోజుకు సగటున 10 వేల మందికి పైగా ఆధార్‌ సేవలందేవని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే... ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 10 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. జిల్లాల్లో 500 నుంచి వెయ్యి వరకూ కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పాజిటివ్‌ కేసులు కనిపిస్తున్నాయి. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో వీటి సంఖ్య మరింత ఎక్కువ. పోస్టాఫీసుల్లో ఆధార్‌ సేవల కోసం వచ్చే ప్రతి ఒక్కరి దగ్గరా చేతి వేలిముద్రలు తీసుకోవాలి. కళ్లు ఐరిస్‌ పరీక్ష చేయాలి. వృద్ధులు, పిల్లలు వస్తే వాళ్ల చేతులు పట్టుకుని వేలిముద్రలు వేయించాలి. వచ్చిన వారికి అతి దగ్గరగా కూర్చుని ఇమేజ్‌ తీయాలి. వేలిముద్రలు వేసే బయోమెట్రిక్‌ మిషన్‌, కళ్లు పరీక్షించే ఐరిష్‌ డివైజ్‌లను ప్రతిసారీ శానిటైజర్‌తో శుద్ధి చేయాలి. ఇదంతా చాలా కష్టమైన, ప్రమాదకరమైన కార్యక్రమం. ప్రస్తుత తరుణంలో రోజుకు వందమంది అతి దగ్గరగా సేవలందించడం కోరి చావును కొనితెచ్చుకోవడమే.


పోస్టాఫీసుల్లో ఆధార్‌ సెంటర్లను ఇప్పుడే ప్రారంభించడం సహేతుకమైన నిర్ణయం  కాదు. ఆధార్ కు సంబంధించిన ఏ పని అయినా ప్రజలతో ఉద్యోగులు భౌతికంగా అత్యంత దగ్గరగా వ్యవహరించవలసి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయం అంత సముచితం కాదు. పోస్టల్ ఉద్యోగ సంఘాల నేతలు ఇది ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమేనని భావిస్తున్నారు. ఈ విషయంలో సర్కిల్‌ స్థాయి అధికారులు సమయోచిత నిర్ణయం తీసుకోవాలి. వ్యాక్సిన్‌ వచ్చే వరకూ ఆగడం అన్నింటికంటే మంచి నిర్ణయం అన్నది వీరి  అభిప్రాయం. ఈ అంశంలో ఉన్నతాధికారుల ఆలోచన వేరుగా ఉంది. వారి ఆలోచననూ తప్పు పట్టలేం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ అందాలంటే ఆధార్‌ ప్రామాణికంగా మారింది. కాబట్టి, ఆధార్ కేంద్రాలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించి సేవలను ప్రారంభిస్తే బాగుంటుందన్నది వీరి ఆలోచన. ఏదిఏమైనా ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ అంశంలో యూనియన్ నేతల అభిప్రాయం ప్రకారమే కొన్నాళ్లు ఆగటం మంచిది. ఇప్పటికే ఆధార్‌ సేవలను ప్రారంభించిన బ్యాంకులు వైరస్‌ బారినపడ్డ ఉద్యోగుల విషయంలో ఆందోళన చెందుతున్నాయి. ఇదే పరిస్థితి తపాలా శాఖకూ వస్తే అది ఇతరత్రా అందిస్తున్న ప్రజాసేవలకూ తీవ్ర ఇబ్బందే.

వేణుగోపాల్‌ గంగిశెట్టి

Updated Date - 2020-09-17T06:36:59+05:30 IST